రూ.20 కోట్ల స్థలంపై కన్ను

ABN , First Publish Date - 2022-07-05T07:50:47+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కొందరి కన్ను పడింది. దీనికోసం కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి అనుచరుడు కుర్లి శివారెడ్డి తొలి అడుగు వేశారు. సుమారు రూ.85 లక్షల విలువైన 3.5 సెంట్లను ఆయన..

రూ.20 కోట్ల స్థలంపై కన్ను

కబ్జా దిశగా కదిరి ఎమ్మెల్యే అనుచరుడి తొలి అడుగు

అర్ధరాత్రి నిర్మాణ పనులు.. అధికారులపై దౌర్జన్యం

ఎదురు కేసులు పెడతానంటూ హెచ్చరికలు

‘ఫోన్‌’ రాకతో వెనుదిరిగిన తహసీల్దార్‌, సిబ్బంది


కదిరి, జూలై 4: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కొందరి కన్ను పడింది. దీనికోసం కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి అనుచరుడు కుర్లి శివారెడ్డి తొలి అడుగు వేశారు. సుమారు రూ.85 లక్షల విలువైన 3.5 సెంట్లను ఆయన ఆక్రమించుకున్నారు. అందులో ఆదివారం అర్ధరాత్రి గోడలు కట్టించారు. వాటిని కూల్చడానికి సోమవారం మధ్యాహ్నం వెళ్లిన తహసీల్దార్‌ గోపాలకృష్ణ, ఇతర రెవెన్యూ అధికారులపై పట్టణ సీఐ మధు సమక్షంలోనే వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు కుర్లి శివారెడ్డి, కదిరి మున్సిపాలిటీ వైఎస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు. ‘‘ఆక్రమణలు మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాతే కూల్చాలని హుకుం జారీ చేశారు. దీంతో ‘‘ప్రభుత్వ స్థలంలో నిర్మాణ పనులు చేపడితే ఎందుకు నోటీసులివ్వాలి?’’ అని తహసీల్దార్‌ ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఎందుకు గోడలు కట్టారని నిలదీశారు. దీంతో ‘‘అప్పుడు కాదు, ఇప్పుడే కడతాం. మీకు చేతనైంది చేసుకోండి’’ అని తహసీల్దారుకు రాజశేఖర్‌ రెడ్డి సవాలు విసిరారు. 


2006 నుంచి వివాదం

అడపాల వీధిలో 84 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. 2006లో ఇందులో 24 మందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందినవారు అనర్హులని తేలడంతో అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌ వీటిని రద్దు చేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.20 కోట్లు పలుకుతోంది. దీంతో ఎలాగైనా చేజిక్కించుకోవాలని అప్పట్లో పట్టాలు పొందిన అనర్హులు ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో కుర్లి శివారెడ్డి ఒకరు. తనకు కేటాయించి, రద్దు చేసిన స్థలంలో నెల కిందట శివారెడ్డి బేస్‌మెంట్‌ వేశారు. ఆదివారం అర్ధరాత్రి గోడలు కట్టేశారు. కుర్లి శివారెడ్డిని ముందు పెట్టి, మిగిలిన వారందరూ అక్కడ ఇళ్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో శివారెడ్డి కట్టడాన్ని కూల్చడానికి పోలీసు బందోబస్తు నడుమ తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వారిని శివారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి దూషించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ‘‘కట్టడాలను కూల్చివేస్తే విషం తాగి, మీపై కేసు పెడతా’’ అని అధికారులను శివారెడ్డి బెదిరించారు. రాజశేఖర్‌ రెడ్డి కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఈలోగా అధికారులకు ‘ఫోన్‌’ రావడంతో అక్రమ కట్టడాన్ని కూల్చివేయకుండానే వెనుదిరిగారు. 

Updated Date - 2022-07-05T07:50:47+05:30 IST