సాగుకు సాయమేదీ!

ABN , First Publish Date - 2022-10-01T09:04:18+05:30 IST

‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో గత మూడేళ్లలో పంట దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. రైతులతో పాటు రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారు’’.. ఇదీ వైసీపీ ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. దీనికి అనుగుణంగానే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ

సాగుకు సాయమేదీ!

రైతన్నకు ప్రభుత్వ పెద్దల మాయమాటలు

సాగుకు లక్షా 29 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రగల్భాలు

అందులో సగానికి సగం కూడా తేలని లెక్కలు 

మూడేళ్లలో కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు రూ.3,600కోట్లే 

జాతీయ బ్యాంకులిచ్చే రుణాలూ సర్కారు ఖాతాలోకే...

కొలిక్కిరాని అగ్రి ల్యాబ్‌లు, కోల్డ్‌స్టోరేజీ, గిడ్డంగుల పనులు 

పరస్పర విరుద్ధ ప్రకటనలతో రైతాంగంలో అయోమయం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో గత మూడేళ్లలో పంట దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. రైతులతో పాటు రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారు’’.. ఇదీ వైసీపీ ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. దీనికి అనుగుణంగానే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్‌ నుంచి మంత్రుల వరకూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. గడిచిన 40నెలల్లో ప్రతి రైతన్ననూ మనసులో పెట్టుకుని ప్రతి కుటుంబానికీ మంచి చేయాలన్న తపనతో... మనసు పెట్టి ఆలోచన చేసి రైతులకు మేలు చేశామని ఇటీవల సీఎం జగన్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే రైతాంగానికి రూ.లక్షా 28వేల కోట్లు ఖర్చు చేశామని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కొన్ని రోజుల క్రితమే సెలవిచ్చారు. మరోవైపు వ్యవసాయ రంగంలో జగన్‌ సర్కారు ఇప్పటి వరకు రూ.1,28,634 కోట్లు ఖర్చు చేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్‌ చేశారు.


అయితే వ్యవసాయ రంగంలో కేటాయింపులపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన సవాల్‌ను ప్రభుత్వ పెద్దలెవరూ స్వీకరించలేదు. ఇదిలాఉంటే నాబార్డు రుణంతో సహకార బ్యాంకులిచ్చే వ్యవసాయ రుణాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఎరువులు, విత్తనాలు అమ్మిన సొమ్మును కూడా కలిపినా.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా మొత్తంలో సగానికి సగం కూడా తేలడం లేదు. ఈ పథకాలకు ఐదేళ్ల వ్యయంతో పోల్చినా అంత లెక్క కనిపించడం లేదు. అధికారిక గణాంకాలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన వివరాలు పరిశీలిస్తే.. బడ్జెట్‌ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి విరుద్ధంగా ఉన్నాయి. పెండింగ్‌ బిల్లులకు చెల్లింపులు జరిపి, పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి, తిరిగి అమ్మి సొమ్ము చేసుకునే విలువను కూడా కలుపుకుని, వ్యయం ఎక్కువ చేసి చూపుతున్న ప్రభుత్వ పెద్దలు తీరును రైతులు బేరీజు వేసుకుంటున్నారు. 


పంపిణీ చేసిందిదే...

ప్రభుత్వశాఖల నిర్వహణలో సాధారణ ఖర్చులు, కేంద్ర పథకాల నిధుల వ్యయాన్ని మినహాయిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన నిధులు, చేసిన వ్యయాన్ని శాసనసభ, శాసనమండలిలో మంత్రి కాకాణి వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన నిధుల వివరాలు... 


  • రైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకంలో సగటున 46లక్షల మంది రైతులకు రూ.23,875 కోట్లు పెట్టుబడి సాయాన్ని అందించారు. 
  • సున్నావడ్డీ పంట రుణాలకు సంబంధించి పాత బకాయిలతో కలిపి రూ.1,282 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేశారు. 
  • పంటల బీమా కింద మూడేళ్లలో రూ.6,685కోట్లు రైతులకు పరిహారం చెల్లించారు.ఇందులో ఉద్యాన రైతులకు రూ.1,196 కోట్లు ఇచ్చారు. 
  • ప్రకృతి విపత్తులకు, పంట నష్టపోయినందుకు 20.85 లక్షలమంది రైతులకు రూ.1,796కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద చెల్లించారు. ఇందులో ఉద్యాన రైతులకు రూ.210కోట్లు చెల్లించగా, తితలీ తుఫాన్‌లో నష్టపోయిన కొబ్బరి, జీడిమామిడి రైతులకు 182కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. 
  • ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కింద 2019లో రూ.100కోట్లు ప్రతిపాదించారు. ఆ తర్వాత ఏటా రూ.20కోట్లు చొప్పున కేటాయించారు. ఇప్పటి వరకు రూ.72.14కోట్లు మాత్రమే బాధిత రైతు కుటుంబాలకు అందించారు. 
  • 2021-22లో ప్రారంభించిన వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ఖర్చు చేసింది రూ.690.87కోట్లు. ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,235కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 
  • ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో రూ.666.56 కోట్ల రాయితీతో రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. 
  • ఉద్యానశాఖ ద్వారా ఆయిల్‌పామ్‌ రైతులకు 2020లో రూ.80కోట్లు బోన్‌సగా ఇచ్చారు. సూక్ష్మసేద్యం కింద 2018-19 నుంచి పెండింగ్‌ ఉన్న రూ.430కోట్లు విడుదల చేశారు. ఇంకా డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీలకు రూ.వెయ్యి కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. 
  • సూక్ష్మ, బిందు సేద్యానికి మూడేళ్లుగా కేంద్ర వాటా నిధులు వస్తున్నా.. రాష్ట్ర వాటా విడుదల చేయలేదు.
  • పశుసంవర్థక శాఖ ద్వారా పశునష్ట పరిహారం కింద ఏటా రూ.50కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.150 కోట్లు దాకా ఖర్చు చేశారు. సంచార పశువైద్య సేవలకు రూ.133కోట్లు వెచ్చించగా, రూ.110కోట్లతో రాయితీపై దాణ, పశుగ్రాస విత్తనాలు పంచారు. కొద్దిపాటి నిధులతో మిషన్‌ పుంగనూరు, కడక్‌నాథ్‌ కోళ్ల ప్రాజెక్టు చేపట్టారు. 
  • చేయూత కింద మూడేళ్లలో రూ.14వేల కోట్లు దాకా ఇచ్చామని చెబుతున్నా.. మహిళలకు ఇచ్చిన డెయిరీ యూనిట్లలో అధికశాతం కనుమరుగయ్యాయి. 
  • సహకార రంగంలో అమూల్‌తో ఒప్పందం చేసుకుని, జగనన్న పాలవెల్లువ పేరుతో పాల సేకరణ పరికరాలకు రూ.1,361 కోట్లు వెచ్చించారు. 
  • ఆప్కాబ్‌కు రూ.100కోట్లు, డీసీసీబీలకు రూ.195కోట్ల మూలధనం అందించాలని నిర్ణయించినా.. ఇంకా ఇవ్వలేదని సమాచారం. 
  • వేట నిషేధ భృతి కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున నాలుగేళ్లలో రూ.413కోట్లు అందించారు. జాలర్ల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.97కోట్లు ఇచ్చారు. 
  • ప్రమాదవశాత్తు మృతిచెందిన మత్స్యకుటుంబాలకు రూ.10కోట్లు, ఆక్వా రైతుల విద్యుత్‌ రాయితీ కింద రూ.2,377 కోట్లు ఖర్చు చేశారు. 


ఎక్కడ వేసిన గొంగళి... 

మార్కెటింగ్‌ శాఖ ద్వారా ధరల స్థిరీకరణ నిధి కింద మూడేళ్లలో రూ.7,156 కోట్లతో 20.18లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ధాన్యం కొనగోలుకు రూ.14వేల కోట్లు వెచ్చించినట్లు లెక్క చూపారు. కేంద్రం అగ్రిఇన్‌ఫ్రా ఫండ్‌, నాబార్డు రుణం ఇవ్వగా రూ.17వేల కోట్లతో అగ్రి ల్యాబ్‌లు, గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజీల వంటి మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించినా.. మొదటిదశ పనులే ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు రూ.1,584 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ఆహారశుద్ధి రంగంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా.. అవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. 


పంట రాక ముందే ప్రగల్భాలు  

ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 2019-20లో అత్యధికంగా 175 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని ప్రభుత్వం పేర్కొంది. 2020-21, 2021-22లో తుఫాన్లు, అధికవర్షాలవల్ల కొంత పంట దెబ్బతిన్నా.. 160-165 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైందని అంటున్నారు. 2022-23లో 186.08 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుందని సర్కారు అంచనా వేసింది. కానీ రానున్న3నెలలు తుఫాన్ల సీజన్‌. పంట దిగుబడులపై ముందే చెప్పలేని పరిస్థితి. ఇంకా తొలకరి పంట దిగుబడులు రాకముందే అత్యధిక ఉత్పత్తులు సాధించామని ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలకడం రైతులను విస్మయపరుస్తోంది. 

Updated Date - 2022-10-01T09:04:18+05:30 IST