వసూల్‌ బాబా! కృష్ణా జిల్లా అధికారి అవినీతి బాగోతం

ABN , First Publish Date - 2020-11-12T16:44:11+05:30 IST

జిల్లాలో అవినీతికి కేరాఫ్‌గా మారిన..

వసూల్‌ బాబా! కృష్ణా జిల్లా అధికారి అవినీతి బాగోతం

పైసలిస్తేనే ఫైలు కదిలేది

ప్రతి పనికీ ధరల పట్టిక 

పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్‌ రెన్యువల్‌కు రేటు ఫిక్స్‌ 


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: జిల్లాలో అవినీతికి కేరాఫ్‌గా మారిన ఓ జిల్లా అధికారి అక్రమ వసూళ్ల కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు.  ప్రతి పనికీ ధరలు నిర్ణయించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల పశ్చిమ కృష్ణా ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన పరిపాలనా పరమైన అంశాలను పక్కనపెట్టేసి నా సంగతేంటి అంటూ నేరుగా అడిగేయడం, హాట్‌ టాపిక్‌గా మారింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ..  ఈ అధికారి వసూళ్లకు తెరతీయడంతో  సంబంధితశాఖ ఉద్యోగులు ఈయన ధోరణికి బెంబేతెల్తిపోతున్నారు.  ఈ తరహా అధికారిని మునుపెన్నడూ చూడలేదని, ఆ శాఖ ఉద్యోగులు  ఔరా అని ముక్కున  వేలేసుంటున్నారు. తన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వదల కుండా ఇంక్రిమెంట్లు, సర్వీసుమేటర్లు, ఇతర త్రా పనులకోసం ఫైలు పెడితే, వారితో నేరుగా మాట్లాడి తాను  ప్రతిపాదించిన మొత్తం ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేస్తున్నాడని  బాహాటంగానే ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. జిల్లాలో పలు ప్రాంతాలకు ఈ అధికారి  వెళ్లిన సమయంలో తనను జిల్లా నుంచి పంపి వేస్తున్నారని చెబుతూనే, వసూళ్లలో మాత్రం ఎలాంటి రాజీ పడ కుండా తమను ఇబ్బందులపాలు చేస్తున్నాడని ఉద్యోగులు అంటున్నారు. ఈ అధికారిని ఆదర్శంగా తీసుకున్న డివిజనల్‌ స్థాయి అధికారి ఒకరు  వసూళ్లకు తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. 


ఎన్‌వోసీకి 25 వేలు! 

జిల్లాలో పెట్రోలు బంకులకు ఎన్‌వోసీలు ఇస్తూ ఉంటారు. ఒక్కో పెట్రోలు బంకు నుంచి రూ.20 వేల నుంచి 25వేల వరకు తనకు ఇవ్వాలంటూ ఈ అధికారి వసూళ్లకు తెరతీయడం గమనార్హం. గతంలో పనిచేసిన జిల్లా అధికారులు పెట్రోలు బంకులకు ఎన్‌వోసీలు ఇచ్చేందుకు నగదు వసూలు చేసిన సంఘటనలు చాలా అరుదు అనే వాదన వినపడుతోంది. 


విజయవాడ నుంచే కార్యకలాపాలు 

జిల్లా కార్యాలయం మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఉండగా, ఈ అధికారి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచే కార్యకలాపాలు నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చుట్టం చూపుగా కూడా కలెక్టరేట్‌లోని ప్రధాన కార్యాలయానికి రారన్నది అందరికీ తెలిసిన విషయమే. మచిలీపట్నం ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను సైతం విజయవాడకే రప్పించి,  పనిచేయించుకుంటున్నారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.  పారిశుధ్య కార్మికులకు సంబంధించిన కాంట్రాక్టును రెన్యువల్‌ చేసేందుకు పంచాయతీల సామర్థ్యాన్ని బట్టి ఇంత ధర అని నిర్ణయించి, తాను చెప్పిన విధంగా నగదు చెల్లింపులు చేస్తేనే కాంట్రాక్టులకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సిబ్బంది సర్వీసు నిబంధనలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే, నేరుగా వారికే ఫోన్‌చేసి కార్యాలయానికి పిలిపించుకుని, అడిగినంత ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు చెప్పుకొంటున్నారు. ఈ అధికారి పనితీరుపై జిల్లాస్థాయి అఽధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2020-11-12T16:44:11+05:30 IST