కల్లాల్లోనే కష్టం

ABN , First Publish Date - 2021-11-10T06:47:18+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

కల్లాల్లోనే కష్టం
బందరు మండలం హుస్సేన్‌పాలెం వద్ద జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యం

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలు

తేమశాతం 17 ఉంటేనే కొంటామని షరతులు

రైతులను భయపెడుతున్న వాయు‘గండం’

ధాన్యాన్ని ఆరబెట్టేదెలా?

అనుమతులొచ్చే వరకూ కల్లాల్లోనే

వర్షం నుంచి కాపాడుకునేదెలా?


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ వరికోతలు ప్రారంభమయ్యాయి. కోతకోసి విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద సంచులు సిద్ధంగా ఉన్నాయా, లేవా అనేది సందేహమే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, రానున్న రెండు మూడు రోజుల్లో కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కూలీల కొరత, కూలీరేట్లను దృష్టిలో పెట్టుకుని రైతులు యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేస్తున్నారు. ఆ ధాన్యంలో తేమశాతం 17 ఉంటేనే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అసలే చలికాలం. ధాన్యంలో తేమ శాతం 17కు తీసుకురావాలంటే కనీసం పది రోజులైనా ఆరబెట్టాలి. అలాగే ఆరబెడదామంటే వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. 


వేధిస్తున్న కూలీల కొరత 

జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకోవడంతో కూలీల కొరత వేధిస్తోంది. నిల్వ కూలీలకు జంటకు రోజుకు రూ.1200 నుంచి రూ.1300 వరకు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. మినుము సాగు చేసే పొలాల్లో వరిపైరును కోసి కుప్పవేయాల్సిందే. యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేస్తే, ధాన్యంలో తేమ శాతం అఽధికంగా ఉన్నదనే సాకుతో మద్దతు ధరలో కోత పెడతారు. అందుకే చాలా ప్రాంతాల్లో కోతలు పూర్తిచేసి, ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. 


ధాన్యం కొనుగోళ్లే పెద్ద తతంగం

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఇప్పటికే 20 శాతం కోతలు పూర్తయ్యాయి. ముతక రకం ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనకూడదని ప్రభుత్వం నిబంధనను విధించింది. రైతులు ధాన్యం శాంపిళ్లను ఆర్‌బీకేకు తీసుకువెళితే అక్కడ తేమ శాతం పరీక్షిస్తారు. తేమ 17శాతం ఉంటేనే తమ పరిధిలో ఉన్న రైస్‌మిల్లుకు ఆర్‌బీకే ఆ శాంపిళ్లను పంపుతుంది. ఆ ధాన్యం ఎంత శాతం నూక అవుతుంది? అందులో రంగు మారిన ధాన్యం ఎంత, తప్ప, తాలు గింజలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే కొనుగోలుకు మిల్లు యజమాని అనుమతులు ఇస్తారు. నాసిరకం ధాన్యం తమకు వద్దని మిల్లరు చెబితే, ఆ శాంపిళ్లను మరో మిల్లుకు పంపుతారు. ఈ తతంగం మొత్తం పూర్తవడానికి కనీసంవారం సమయం పడుతుంది. అంత వరకూ ధాన్యం కల్లంలో ఉండాల్సిందే. ఈ లోపు వర్షాలు కురిస్తే రైతులకు అంతా నష్టమే. 


ఆర్‌బీకేల్లో సిబ్బంది కొరత, ధాన్యం కొనేందుకు సంచుల కొరత 

జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. ఇంత విస్తీర్ణంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే సుమారు 5.50 కోట్లకు పైగా సంచులు కావాలి. అన్ని సంచులను మిల్లర్లు, అధికారులు సిద్ధంగా ఉంచారా? అనేది అనుమానమే. ఈ నెల 11వ తేదీన పౌరసర ఫరాల శాఖ కమిషనర్‌, 13న జేసీలు నిర్వహించే సమావేశాల్లో ఽధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోపక్క ఆర్‌బీకేల్లో ఉన్న అరకొర సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లలో అనుభవం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కొనుగోళ్లు ఎంతమేరకు సక్రమంగా జరుగుతాయనేది ప్రశ్నార్థకమే.

Updated Date - 2021-11-10T06:47:18+05:30 IST