పంచాయతీలకు సర్కార్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-07-27T05:53:23+05:30 IST

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఇతరత్రా పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరిట తీసేసుకోవడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీలకు సర్కార్‌ షాక్‌

విద్యుత్‌ బకాయిలకు 14వ ఆర్థిక సంఘం నిధులు జమ

సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వకుండానే సొమ్ములు బదలాయింపు

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఫ్రీజింగ్‌

కనీసం పారిశుధ్య పనులు చేపట్టేందుకు కూడా నిధులు లేవు

ఇలాగైతే ఎలాగంటూ సర్పంచుల అసంతృప్తి

ఉత్సవ విగ్రహాలుగా మారామంటూ ఆవేదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తరువాత చెక్‌ పవర్‌ వచ్చింది. అభివృద్ధి పనుల కోసం పంచాయతీకి చెందిన బ్యాంకు ఖాతాను పరిశీలించగా...‘జీరో’ నిల్వలు చూపించడంతో షాక్‌ అయ్యాను. విద్యుత్‌ బకాయిల పేరిట 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకుందని పంచాయతీ కార్యదర్శి చెప్పేంత వరకు నాకు తెలియదు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి కానీ, వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇలా అయితే గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేయగలం?

  - పత్తి రమణ, సర్పంచ్‌ (వైసీపీ మద్దతుదారు), పుత్తడి గైరంపేట, గొలుగొండ మండలం


చెట్టుపల్లి పంచాయతీకి వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.5 లక్షలతోపాటు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.18 లక్షలు వచ్చాయి. మొత్తం రూ.23 లక్షలు బ్యాంకు ఖాతాలో ఉండేవి. కానీ మాకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరిట మొత్తం రూ.23 లక్షలూ తీసుకుంది. ఇప్పుడు పంచాయతీ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు. నిధులు లేకుండా గ్రామాల్లో పనులు ఎలా చేయాలి?

-గజాల నాగరత్నం, సర్పంచ్‌ (ఇండిపెండెంట్‌), చెట్టుపల్లి, నర్సీపట్నం మండలం


గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఇతరత్రా పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరిట తీసేసుకోవడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులతోపాటు వివిధ రూపాల్లో పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని కూడా లాగేసుకోవడంపై ప్రతిపక్షాలకు చెందిన సర్పంచులతోపాటు అధికార వైసీపీకి చెందిన సర్పంచులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఇలాగైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం పారిశుధ్య పనుల కోసం బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో వున్నాయని, 15వ ఆర్థిక సంఘం విడుదల అయినప్పటికీ, వాటిని వాడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించిందని వాపోతున్నారు. ప్రభుత్వ తీరుతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారని, చెక్‌పవర్‌ వున్నా...ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు. 


గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నూతన సర్పంచులు సుమారు నెలరోజుల తరువాత పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇది జరిగిన రెండు నెలల తరువాత చెక్‌ పవర్‌ వచ్చింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. తీరా పంచాయతీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు లేకపోవడాన్ని చూసి వారంతా షాక్‌ అయ్యారు. 14వ ఆర్థిక సంఘం నిధుల గురించి పంచాయతీ కార్యదర్శులను వాకబు చేయగా...విద్యుత్‌ బిల్లుల బకాయిల కోసం ప్రభుత్వం వెనక్కు తీసుకుందని చెప్పారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా తీసుకుంటుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించడానికి పంచాయతీ ఖాతాల నుంచి దశల వారీగా సొమ్ములు వెనక్కు తీసుకునే అవకాశం ఉన్నా..ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందంటూ సర్పంచులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచులకు విలువ ఉండేదని...ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో వవుందన్న సంతోషమే తప్ప ఇంకేమీ లేదని బుచ్చెయ్యపేట మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్‌ ఒకరు వ్యాఖ్యానించారు. 


ఇదిలావుండగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నప్పుడు గ్రామాల్లో వివిధ రకాల పనులు చేపట్టారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో పారిశుధ్యం పేరిట పలు రకాల పనులు నిర్వహించారు. వీటికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ పనుల కోసం చేసిన ఖర్చులకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు బిల్లులు సిద్ధం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు క్లియర్‌ చేద్దామనుకే సమయానికి ఎన్నికలు రావడంతో నిధులు డ్రా చేయడానికి వీలుకాలేదు. పంచాయతీలకు పాలక వర్గాలు ఏర్పడి, సర్పంచులకు చెక్‌పవర్‌ వచ్చి, బిల్లులు క్లియర్‌ చేద్దామనుకునేలోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరుతో మొత్తం నిధులన్నీ లాగేసుకుంది. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు వచ్చినా...వాటిని వినియోగించుకులేని పరిస్థితి ఏర్పడింది. వీటిని డ్రా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఎత్తివేస్తే తప్ప బిల్లుల చెల్లించే పరిస్థితి లేదు.  


రాష్ట్ర ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధం

వై.వినోద్‌రాజు, ఉపాధ్యక్షుడు, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ 


విద్యుత్‌ బకాయిల పేరుతో సర్పంచులకు చెప్పకుండా, వారి సంతకాలు లేకుండా జిల్లాలోని పంచాయతీ ఖాతాల నుంచి రూ.33 కోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్‌ చట్టానికి వ్యతిరేకం. ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడానికి వినియోగించాలి తప్ప విద్యుత్‌ బకాయిలు తీర్చడానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ తీవ్రంగా ఖండిస్తున్నది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం.

Updated Date - 2021-07-27T05:53:23+05:30 IST