జగనన్నా.. జీతాలివ్వండి

ABN , First Publish Date - 2022-03-14T08:32:28+05:30 IST

ఉద్యోగం.. స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. వినేందుకు ఎంతో గౌరవంగా ఉంటుంది. జీతం మాత్రం రోజుకు కేవలం రూ.500. నెలకు 15 వేలు. ఆ జీతమైనా నెలా నెలా ఇస్తున్నారా అంటే అదీ

జగనన్నా.. జీతాలివ్వండి

స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్ల వేడుకోలు ..

ఏడాదిగా జీతాలు ఇవ్వని సర్కారు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగం.. స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. వినేందుకు ఎంతో గౌరవంగా ఉంటుంది. జీతం మాత్రం రోజుకు కేవలం రూ.500. నెలకు 15 వేలు. ఆ జీతమైనా నెలా నెలా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఏడాదిగా ఆ అరకొర జీతాలు కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. 2021 మార్చి నుంచి ఇదే పరిస్థితి. దీంతో వారి బతుకు దయనీయంగా మారింది. ఆ చిరుద్యోగులు కుటుంబాన్ని నడపలేక, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఏదో ఒక ఊతం దొరికిందని విధుల్లో చేరిన వారిలో ఆవేదన, ఆక్రందన కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే మద్యాన్ని కట్టడి చేయడం.. నాటు సారా తయారు చేయకుండా అడ్డుకోవడం.. రాష్ట్రంలోని వాగులు, వంకల్లో ఇసుక సరిహద్దులు దాటి పోకుండా చూడటం ఎస్‌పీవోల బాధ్యతలు. అధికారంలోకి వస్తే పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ఏటా జనవరిలో నియామకాలు చేపడుతామన్న హామీని జగన్‌ విస్మరించారు. ‘దశలవారీగా మద్యనిషేధం’ హామీకి కూడా తూట్లు పొడిచిన వైసీపీ ప్రభుత్వం.. మొదట్లో ఆకాశాన్నంటేలా మద్యం ధరలు పెంచింది.


పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ దిగుమతి కాకుండా కట్టడి చేసేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌)ను ఏర్పాటు చేసింది. పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బంది ఉమ్మడిగా మద్యం అక్రమ దిగుమతి, మరోవైపు ఇసుక అక్రమ ఎగుమతి అరికట్టే ప్రయత్నం చేసింది. వారికి తోడుగా ప్రతి జిల్లాకు 200 మంది చొప్పున 2020 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌పీవోలను నియమించింది. రాష్ట్ర సరిహద్దుల్లో రాత్రింబవళ్లు కాపలాకాస్తూ మద్యం దిగుమతిని అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మకాలు పెరిగాయి. మూడేళ్లలో మద్యం ఆదాయం ఏకంగా పాతిక వేల కోట్లకు చేరి, ప్రభుత్వాన్ని ఆదుకుంటోంది. అయితే.. ఎస్‌పీవోలకు మాత్రం ఏడాది నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఇసుక అక్రమ రవాణాను సైతం అడ్డుకుంటున్న ఎస్‌పీవోలకు ఏడాది పాటు మైనింగ్‌ శాఖ జీతాలు చెల్లించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టును జేపీ సంస్థకు కట్టబెట్టింది. దీంతో మైనింగ్‌ శాఖకు కాపలాదారుల అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖలు ఎస్‌పీవోలకు చెరిసగం జీతాలు చెల్లించాలని జీవోలో ఉంది. ఇకనుంచి ఎస్‌పీవోలకు జీతాలు మీరే ఇవ్వాలని గతేడాది ఎక్సైజ్‌ శాఖకు మైనింగ్‌ శాఖ అప్పజెప్పింది. అయితే.. 2021 మార్చి నుంచి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ ఎక్సైజ్‌ శాఖ ఎస్‌పీవోలకు జీతాలు ఇవ్వలేదు. మద్యం షాపుల కలెక్షన్‌ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళుతుండటంతో అబ్కారీ అధికారులు చేతులెత్తేశారు.


ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పదే పదే వీడియో కాన్ఫరెన్స్‌లలో సెబ్‌ అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. నెలలు గడుస్తున్నా జగన్‌ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఎస్‌పీవోలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌పీవోల్లో నిరుద్యోగ యువతతో పాటు మాజీ సైనికులు కూడా ఉండటంతో బహిరంగంగానే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమను ఆకలి, పస్తులతో మాడ్చడం అన్యాయమని వాపోతున్నారు. బంధువులు, మిత్రులు, పరిచయం ఉన్న వారందరితో అప్పులు చేశామని తమ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. ఇప్పుడు అప్పలు ఇచ్చేవారు లేకపోగా, ఇచ్చిన వారి ఒత్తిడి పెరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణా షాపుల్లో సరుకులు ఇవ్వడం లేదని, పాత బకాయిల వసూలు కోసం ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు. ఇంతటి దుర్భర జీవితం అనుభవిస్తామని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పుడైనా తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-03-14T08:32:28+05:30 IST