నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా

ABN , First Publish Date - 2022-07-18T08:48:22+05:30 IST

ముంపు గ్రామాల ప్రజలను తప్పకుండా ఆదుకుంటామని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. వరద నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు. ఆదివారం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని

నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా

రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా..

బాధితులను తప్పక ఆదుకుంటాం: గవర్నర్‌


కొత్తగూడెం, జూలై 17(ఆంధ్రజ్యోతి): ముంపు గ్రామాల ప్రజలను తప్పకుండా ఆదుకుంటామని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. వరద నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు. ఆదివారం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ముంపు గ్రామాలు పాములపల్లి, చింతిర్యాలలో పర్యటించారు. అశ్వాపురం ఎస్‌కేటీ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీ, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమకూర్చిన సామగ్రిని పంపిణీ చేశారు. పునరావాస కేంద్రంలో ఉన్న పలువురికి తమిళిసై స్వయంగా చికిత్స అందించారు. అక్కడి నుంచి హెవీవాటర్‌ ప్రాజెక్టు కాలనీలో తరంగిణి ఫంక్షన్‌ హాలు, దోసపాటి రంగారావు ఫంక్షన్‌ హాళ్లలో ఏర్పా టు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. మెడికల్‌ కిట్లను అందించారు. నిర్వాసితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అమ్మగారిపల్లి గ్రామంలో గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఇంద్రియాల గ్రామానికి వెళ్లారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు.   అయితే, బాధితులు కొద్ది సేపు గవర్నర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు అన్ని వసతులు కల్పించేలా హామీ ఇవ్వాలని పట్టుపట్టారు. పోలీసుల బాధితులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం గవర్నర్‌ కేంద్ర హోంశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


రైలు మార్గంలోనే

వరద బాధితులను పరామర్శించేందుకు గవర్నర్‌ సికింద్రాబాద్‌ నుంచి రైల్లో బయల్దేరారు. ఆదివారం ఉదయమే మణుగూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హెవీవాటర్‌ ప్రాజెక్ట్‌ అతిథి గృహానికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 10.45 గంటలకు కొత్తగూడెం నుంచి రైలు మార్గంలోనే ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు.

Updated Date - 2022-07-18T08:48:22+05:30 IST