శిఽథిల భవనాలు.. బిక్కుబిక్కుమంటూ విధులు..!

ABN , First Publish Date - 2021-11-15T04:01:38+05:30 IST

వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే ఉరుస్తుండడం, పెచ్చులూడడం, తేమ ఊరుతున్నాయి.

శిఽథిల భవనాలు.. బిక్కుబిక్కుమంటూ విధులు..!
శిథిలావస్థకు చేరి కూలిన ఎంపీడీవో సమావేశ మందిరం

ఉదయగిరి రూరల్‌, నవంబరు 14: వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే ఉరుస్తుండడం, పెచ్చులూడడం, తేమ ఊరుతున్నాయి. పది రోజులుగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయగిరిలోని తహసీల్దారు, సబ్‌ ట్రెజరీ, మండల పరిషత్‌, జలవనరుల శాఖ కార్యాలయాలు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తహసీల్దారు, సబ్‌ ట్రెజరీ భవనాలు బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన భవనాలు కావడంతో పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విధులు నిర్వహించేందుకు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఇటీవల వీచిన గాలులకు ట్రెజరీ భవనంపై ఉన్న స్థూపం నేలకొరిగింది. తహసీల్దారు కార్యాలయ పైకప్పు నెర్రెలుబారి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. సిబ్బంది విధుల నిర్వహించే సమయంలో శ్లాబు పెచ్చులూడి పైనపడుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్ల క్రితం మరమ్మతుల కోసం నిధులు మంజూరైనా తూతూమంత్రంగా పనులు చేశారు. అలాగే 1965లో మండల సమితి కార్యాలయానికి నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయం ఉంది. ఈ భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరి చెట్ల వేర్లు శ్లాబు, గదుల్లోకి చొచ్చుకొచ్చాయి. శ్లాబు మొత్తం దెబ్బతిని పెచ్చులూడి పైనపడుతున్నాయి. చిన్నపాటి వర్షానికి కార్యాలయంలో అన్ని గదులు ఉరుస్తుండడంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 2017లో కార్యాలయ సమావేశ మందరం కుప్పకూలింది. నాటి నుంచి దాని నిర్మాణం గురించి పట్టించుకోకపోవడంతో సమావేశాలు, సభలు నిర్వహించుకొనేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక జలవనరుల శాఖ కార్యాలయాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. పాతంకాలం నాటి రేకులషెడ్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించి పరిపాలన సౌలభ్యం కలిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

నూతన భవనాల నిర్మాణానికి చర్యలు

మండల పరిషత్‌ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపడతాం.  శిథిలావస్థకు చేరిన ఇతర కార్యాలయాల భవన నిర్మాణాలకు సైతం శ్రీకారం చుడతాం. 

- మూలె పద్మజ, ఎంపీపీ



Updated Date - 2021-11-15T04:01:38+05:30 IST