మహిళా ప్రాంగణం భవన సముదాయం
వెలవెలబోతున్న మహిళా ప్రాంగణం
ఆనవాలే లేని రోడ్లు భవనాల శాఖ బంగ్లా
కామవరపుకోట, జనవరి 25: ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన భవనాలు గత వైభవానికి సాక్షీబూతంగా శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా తడికలపూడి నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత పేరిట మహిళలు, బాలికలకు శిక్షణ కేంద్రంగా దశాబ్దాల తరబడి సేవలందిన భవనం శిథిలావస్థలో కునారిల్లు తోంది. రోడ్డు భవనాల శాఖ బంగ్లా, స్థలం బూత్ బంగ్లాను తలపిస్తున్నాయి.
తడికలపూడిలో 1985లో తెలుగు బాల మహిళ ప్రాంగణం పేరిట పది ఎకరాల స్థలంలో లక్షలాది రూపాయలతో భవనాలు నిర్మించారు. అనంతరం ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రంగా మార్పు చేశారు. మహిళలు, బాలలకు శిక్షణ కార్యక్రమాలతో సందడిగా ఉండే ప్రాంగణం ప్రస్తుతం నిర్జీవంగా మారింది. శిక్షణ కార్యక్రమాలు లేకపోవడమే కాదు భవ నాలు, క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయి. ప్రాంగణం ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. ప్రాంగణంలోని రోడ్లు సక్రమంగా లేవు, ముఖద్వారంలో కూడా రాళ్లు రప్పలే దర్శనమిస్థాయి. అధికారులు, పాలకు లు స్పందించి మహిళా సాధికారత, గత వైభవం తీసుకురావాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. శిక్షణ కార్యక్రమాలపై ప్రాంగణం అధికారి బట్టు రెబికను వివరణ కోరగా ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదన్నారు. గత ఏడాది 1020 మంది ఆశా కార్యకర్తలు, 490 మంది ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామన్నారు.
ఆర్ అండ్ బి బూత్ బంగ్లా
తడికలపూడిలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన భవనాల్లో ఆర్‌అండ్‌బి బంగ్లాను, వంట షెడ్లు నిర్మించారు. దాదాపు ఎకరం స్థలంలో ఈ భవనాలు ప్రస్తుతం అచ్చంగా బూత్ బంగ్లాను తలపిస్తున్నాయి. కొంతకాలం పాటు ఈ భవనాలు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సంచారంతో కళకళ లాడేవి. నిర్వహణ గాలికొదిలేయడంతో పదేళ్లుగా ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 90 శాతం దెబ్బతిన్న భవనాలు ఏ నిమిషాన అయినా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. పాలకులు, అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకురావాలని, ఆక్రమణకు గురికాకుండా ఈ స్థలాల ను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
పూర్తిగా శిథిలమైన రోడ్లు, భవనాల శాఖ భవనం