ప్రభుత్వం బాగా నడుస్తోంది: Maharastra Crisis నేపథ్యంలో పవార్

ABN , First Publish Date - 2022-06-21T20:30:19+05:30 IST

గడిచిన రెండున్నరేళ్లలో ఇలా జరగడం మూడోసారి. ఇంతకు ముందు మా ఎమ్మెల్యేలను హర్యానాలో ఉంచారు. ఆ తర్వాత మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మహా వికాస్ అగాఢీలో ప్రధాన బాధ్యత శివసేనదే. కానీ వారు ఎవరికి మద్దతు ఇస్తారనేది వారి వ్యక్తిగత విషయం. కానీ, ఉద్ధవ్ నాయత్వం విషయంలో..

ప్రభుత్వం బాగా నడుస్తోంది: Maharastra Crisis నేపథ్యంలో పవార్

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం నడుమ మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం బాగా నడుస్తోందని, గడిచిన రెండున్నరేళ్లలో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయని, అయితే తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేపోయాయని ఆయన అన్నారు. అయితే మూడు పార్టీల భాగస్వామ్యంలో ప్రధాన బాధ్యత శివసేనదేనని, కానీ వారు ఎవరికి మద్దతు ఇస్తారనేది వారి వ్యక్తిగత అంశమని పవార్ అన్నారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవార్ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ ‘‘గడిచిన రెండున్నరేళ్లలో ఇలా జరగడం మూడోసారి. ఇంతకు ముందు మా ఎమ్మెల్యేలను హర్యానాలో ఉంచారు. ఆ తర్వాత మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మహా వికాస్ అగాఢీలో ప్రధాన బాధ్యత శివసేనదే. కానీ వారు ఎవరికి మద్దతు ఇస్తారనేది వారి వ్యక్తిగత విషయం. కానీ, ఉద్ధవ్ నాయత్వం విషయంలో ఎలాంటి మార్పులు అవసరం లేదు’’ అని అన్నారు. వాస్తవానికి తాను రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై ఢిల్లీకి వచ్చానని, ఈ విషయమై ముంబై వచ్చాక మరింత స్పష్టంగా స్పందిస్తానని అన్నారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో తాము కలిసే ఉన్నామని చెప్పిన ఆయన.. ఈ సాయంత్రమే మహారాష్ట్ర వెళ్లి ఎమ్మెల్యేలతో చర్చిస్తానని పేర్కొన్నారు.


మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) 21 మంది ఎమ్మెల్యేలను(మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు) వెంటబెట్టుకుని గుజరాత్‌(Gujarath)కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని మెరీడియన్  హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackerey) ప్రభుత్వంలో అలజడి మొదలైంది. రిపోర్టుల ప్రకారం.. ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ‘అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ(NCP) ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ.. మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందన్నారు.

Updated Date - 2022-06-21T20:30:19+05:30 IST