ప్రభుత్వ ఆసుపత్రిలో వసూళ్ల దందా

ABN , First Publish Date - 2021-03-03T06:40:02+05:30 IST

బందరు జిల్లా కేంద్ర ప్రభుత్వా సుపత్రిలో ఉద్యోగుల అవినీతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో వసూళ్ల దందా

 ఇద్దరు కేటుగాళ్లు

వేతనం పెంపు పేరుతో మోసం

 పారిశుధ్య కార్మికుల ఫిర్యాదు


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బందరు జిల్లా కేంద్ర ప్రభుత్వా సుపత్రిలో ఉద్యోగుల అవినీతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. ఆర్‌ఎంవో కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వసూళ్ల దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న 110 మంది పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.16 వేల వేతనం ఇప్పిస్తామని ఆశ చూపి ఒక్కొక్కరినుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్న అంశంపై కార్మికులు మంగళ వారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాధవీలతకు ఫిర్యా దు చేశారు. దీంతో ఆసుపత్రిలో జరుగుతున్న  అక్రమ వసూళ్ల వ్యవహారం బయటకు వచ్చింది. గతంలోనూ ఈ  ఇద్దరు ఉద్యోగులు ఇదే తరహా వసూళ్లకు పాల్పడినట్లు పారిశుధ్య కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పేర్ని నానికి కూడా ఫిర్యాదు చేస్తామని  కార్మికులు  తెలిపారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఏజేల్‌ గ్రూప్‌ ద్వారా  110 మంది పారిశుధ్య కార్మికులుగా పని చేసు ్తన్నారు. వీరందరికీ నెలకు 16 వేల వేతనం ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని ఆసుపత్రి ఆర్‌ఎంవో కార్యాలయంలో పని చేస్తున్న  బి.కోటేశ్వరరావు, కె.అప్పారావు మాయ మాటలు చెప్పి నమ్మించినట్లు కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై కోర్టులో కేసు వేయాలని  ఒక్కొక్కరి నుంచి రూ.400 చొప్పున వసూలు చేశారని తెలిపారు. ఇప్పుడు హైకోర్టుకు వెళ్లాలని, ఖర్చుల నిమిత్తమని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారని  తెలిపారు. పారిశుద్ద్య కార్మికులకు డ్యూటీలు వేసే విషయంలోనే వారు జోక్యం చేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలిపారు. అటెండరు స్థాయి ఉద్యోగం చేస్తూ ఆర్‌ఎంవో కార్యాలయంలో చక్రం  తిప్పుతున్న వీరి పనితీరుపై నిఘా ఉంచాలని కోరారు. కోటేశ్వరరావు గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అయ్యాడని, తిరిగి ఇక్కడే పోస్టింగ్‌ తెచ్చు కున్నాడని కార్మికులు వివరించారు.  

Updated Date - 2021-03-03T06:40:02+05:30 IST