కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ‘yoga break’

ABN , First Publish Date - 2021-11-04T14:17:56+05:30 IST

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా బ్రేక్‌ను అమలు చేయాలని నిర్ణయించింది....

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ‘yoga break’

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా బ్రేక్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.యోగా వ్యాయామాల ద్వారా ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.దీనిలో భాగంగా ఉద్యోగుల ఉత్పాదకతను పెంచేందుకు కార్యాలయాల్లో యోగా బ్రేక్ ను అమలు చేయాలని కేంద్ర మంత్రిత్వశాఖలకు ఆయుష్ మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. దీంతో కేంద్ర రోడ్డు రవాణమంత్రిత్వశాఖ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసుల్లో యోగా బ్రేక్ ను ఈ నెల 2వతేదీ నుంచి అమలు చేస్తోంది.


 యోగా బ్రేక్ ను ప్రయోగాత్మకంగా గత ఏడాది జనవరిలో ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మొదటిసారిగా అమలు చేసినట్లు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారి చెప్పారు. వివిధ ఆసనాల ద్వారా ఐదు నిమిషాల విరామంలో కేంద్ర ఉద్యోగులకు యోగాను పరిచయం చేశారు.దేశంలోని ఆరు ప్రముఖ యోగా సంస్థల సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా 15 రోజుల ట్రయల్‌ను నిర్వహించింది.జీవనశైలి మార్పులు, కంప్యూటర్‌లపై ఎక్కువ గంటలు గడపడం వల్ల ఉద్యోగుల్లో పని ఒత్తిడి ఏర్పడుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. 


దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రసిద్ధ యోగా అభ్యాసకులతో కలిసి 2019లో యోగా బ్రేక్ ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసింది.ఈ యోగా బ్రేక్ లో ఉత్తానమందుకాసనం, కటి చక్రాసన, అర్ధ చక్రాసన, లోతైన శ్వాస, నాడిశోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, ధ్యానం ఉంటాయని కేంద్ర ఆయుష్ అధికారులు చెప్పారు.


Updated Date - 2021-11-04T14:17:56+05:30 IST