ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం!

ABN , First Publish Date - 2020-07-13T20:21:50+05:30 IST

అక్కన్నపేట మండలం గండిపల్లిలో ప్రాజెక్టు నిర్మిస్తుండడంతో ఆ సమీపంలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడింది.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం!

గండిపల్లి ప్రాజెక్టు సమీపంలోని గుట్టలను తవ్వి సాగుచేస్తున్న వైనం

 రూ.122.25 కోట్ల విలువ చేసే భూములు కబ్జాదారుల చేతుల్లోకి

ముడుపులు తీసుకుని పట్టాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు!


అక్కన్నపేట(మెదక్): అక్కన్నపేట మండలం గండిపల్లిలో ప్రాజెక్టు నిర్మిస్తుండడంతో ఆ సమీపంలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడింది. గుట్టలను చదును చేసి దున్నుకుంటున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ముడుపులు తీసుకుని పట్టాలు చేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. 


అక్కన్నపేట మండలం గండిపల్లి  రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 579 లో 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలతో పాటు మరికొంతమందికి 2004 నుంచి 2012వరకు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 685 ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఈ సర్వే నంబర్‌లో 815 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడి భూములకు ఎకరానికి రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పలుకుతోంది. సుమారుగా రూ.122.25 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు బినామీలతో పెద్ద పెద్ద యంత్రాలతో గుట్టలను చదును చేస్తూ పంటలు సాగు చేస్తున్నారు.  కొందరు భూస్వాములు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని మాముళ్లు అందజేసి పట్టాలు పొందుతున్నారు. అనంతరం వాటిని విక్రయిస్తున్నారు. 


దళితులకు మూడెకరాల భూ పంపిణీ అంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక్కడ ఒక గుంట కూడా కేటాయించిన పాపానపోలేదు. నిరంతరాయంగా పెద్దపెద్ద మిషన్లతో గుట్టలను చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్‌ భూములు అమ్మడానికి వీలు లేకున్నా కూడా రెవెన్యూ సిబ్బంది అవకాశం కల్పిస్తుండడంతో భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 


కబ్జా చేస్తే కఠిన చర్యలు: వేణుగోపాల్‌రావు, తహసీల్దార్‌, అక్కన్నపేట

ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కన్నపేట మండలంలో కొంతమంది అసైన్డ్‌ భూములను అమ్ముకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారికి నోటీసులు సైతం జారీ చేశాం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తాం. 

Updated Date - 2020-07-13T20:21:50+05:30 IST