ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం !

ABN , First Publish Date - 2022-08-19T05:24:53+05:30 IST

అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని పథకం ప్రకారం కబ్జాచేయడానికి కొందరు చోటా నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం !
అక్రమణకు గురవుతున్న కుంట

 రాత్రికి రాత్రే మట్టితోలి చదును చేస్తున్న నాయకులు

 గంగవరం, ఆగస్టు 18: అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని పథకం ప్రకారం కబ్జాచేయడానికి కొందరు చోటా నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. పలమనేరు పట్టణానికి అనుకొని గంగవరం మండల పరిధిలో సర్వేనెంబరు 671లో సుమారు 22 సెంట్ల కుంటపరంబోకు స్థలం ఉంది. ఈ స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో మదనపల్లె జాతీయ రహదారి కూడా ఉంది. ఈ స్థలం చుట్టూ ఇప్పటికే భవనాలు సైతం నిర్మించేశారు. ప్లాట్ల ధరలు అధికంగా పలుకుతుండడంతో, ఇక్కడ భూములకు భారీగా డిమాండ్‌ ఉంది. దీంతో గంగవరం పంచాయతీ పరిధిలోని ఓ చోటా నాయకుడి కన్ను ఈ 22 సెంట్ల కుంటపై పడింది. అంతే మూడు రోజుల నుంచి రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో మట్టి తోలి కుంటను పూడ్చివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతమంది నాయకుల అండదండలతో ఈ పని చేస్తున్నా.. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ 22 సెంట్ల భూమి బహిరంగ మార్కెట్‌లో కోటి రూపాయలకు పైగానే ఉంది. దీనిపై గంగవరం తహసీల్దార్‌ మురళిని వివరణ కోరగా... ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఈ కుంట లో మట్టిని తరలించిన వారిని గుర్తించి చట్టపరచర్యలు తీసుకొనేలా నివేదిక సమర్పించాలని వీఆర్‌ఓను ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలేది లేదని చెప్పారు. 

Updated Date - 2022-08-19T05:24:53+05:30 IST