తక్షణ నియామకాలకు సై

ABN , First Publish Date - 2020-07-07T07:42:57+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరేవారికి సేవలందించేందుకు తగ్గట్లుగా సిబ్బంది ఉండటం లేదు. వైరస్‌ భయంతో చాలామంది డ్యూటీలకు హాజరుకావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తక్షణ నియామకాలకు సై

హైదరాబాద్‌, జులై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరేవారికి సేవలందించేందుకు తగ్గట్లుగా సిబ్బంది ఉండటం లేదు. వైరస్‌ భయంతో చాలామంది డ్యూటీలకు హాజరుకావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ, చెస్ట్‌, కింగ్‌కోఠీ, టిమ్స్‌తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో   అవసరాలకు తగినట్లుగా వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను తక్షణమే నియమించుకునే అధికారాన్ని అయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు అప్పగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వ్యులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుంది. నిబంధనల ప్రకారం భర్తీ ప్రక్రియ చేపట్టాలంటే చాలా సమయం పడుతోంది. అందుకే వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తరహాలో అర్హతలున్నవారిని తక్షణమే నియమించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అవసరాలకు తగ్గట్లుగా నర్స్‌లు,  పారిశుధ్య సిబ్బంది లేరు. అక్కడ ప్రస్తుతం 700 మంది ఇన్‌పేషంట్లు ఉంటే... 210 మంది మాత్రమే నర్సులున్నారు. షిఫ్టుకు 70 మంది నర్సులకు డ్యూటీ వేస్తుండగా అందుకే 45-55 మంది మాత్రమే విధులకు హాజరౌతున్నారు. వాస్తవానికి షిఫ్టుకు కనీసం 140 మంది అయినా నర్సులు అవసరం ఉంటుంది. అలాగే పారిశుధ్య సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు.  దీంతో తక్షణ నియామకాలకు అనుమతినిచ్చారు.


వైద్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు

కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైద్య సిబ్బందికి 10 శాతం ప్రత్యేక ప్రోత్సాహకమిస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. అయితే అది కేవలం ఏప్రిల్‌, మే నెలలకే పరిమితమయింది. దాన్ని కొనసాగించాలని సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోద ముద్ర పడగానే అధికారికంగా ఉత్తర్వ్యులు జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.


శాశ్వత ప్రాతిపదికన నియమించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీతోపాటు కొవిడ్‌ సేవలందిస్తున్న ఇతర ఆస్పత్రుల్లో  తాత్కాలిక నియామకాలు చేపట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఉద్యోగ భద్రత లేనప్పుడు ప్రాణాలకు రిస్కు తీసుకొని తాత్కాలిక ఉద్యోగాలను ఎవ్వరూ చేయరు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలి. 

- గాంధీలోని ఓ నర్స్‌

Updated Date - 2020-07-07T07:42:57+05:30 IST