Cervical Cancer Vaccine : 1000 రెట్లు అధిక సామర్థ్యంతో వ్యాక్సిన్.. సీరం ఇన్‌స్టిట్యూట్‌కి హక్కులు..

ABN , First Publish Date - 2022-06-17T00:07:51+05:30 IST

ఇండియాలో 15 - 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తున్న క్యానర్ల జాబితాలో సర్వైకల్ క్యాన్సర్(Cervical Cancer) 2వ స్థానంలో ఉంది.

Cervical Cancer Vaccine : 1000 రెట్లు అధిక సామర్థ్యంతో వ్యాక్సిన్.. సీరం ఇన్‌స్టిట్యూట్‌కి హక్కులు..

న్యూఢిల్లీ : ఇండియాలో 15 - 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తున్న క్యానర్ల జాబితాలో సర్వైకల్ క్యాన్సర్(Cervical Cancer) 2వ స్థానంలో ఉంది. భారతీయ మహిళలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్న ఈ క్యాన్సర్‌పై అత్యంత సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SSI) రూపొందించిన తొలి దేశీయ qHPV(క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పపిల్లోమావైరస్ వ్యాక్సిన్) ‘CERVAVAC(సెర్వావ్యాక్)’ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇందుకు సంబంధించి ఎస్ఐఐకి వ్యాక్సిన్ మార్కెట్ హక్కుల జారీకి DCGI(Drugs Controller General of India) నిపుణుల కమిటీ ప్రతిపాదన చేసింది. సీరం దరఖాస్తును పరిశీలించిన ఎస్ఈసీ(సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ) ఈ మేరకు ప్రతిపాదన చేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 


కాగా సెర్వావ్యాక్ మార్కెట్ హక్కుల అనుమతి కోరుతూ ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ జూన్ 8న డీసీజీఐకి దరఖాస్తు చేశారు. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మద్దతు దరఖాస్తు చేసుకుంది. దృఢమైన యాంటీబాడీల పరంగా సెర్వావాక్ అద్భుత పనితీరును కనబరిచింది. అన్నీ లక్షిత హెచ్‌పీవీ(హ్యూమన్ పపిల్లోమావైరస్ ఇన్ఫెక్షన్) రకాలు(టైప్స్), అన్ని డోసులు, అన్ని వయసుల సమూహాల్లో బేస్‌లైన్ వ్యాక్సిన్ల కంటే సుమారు 1000 రెట్లు అధిక పనితీరుని చూపించిందని దరఖాస్తులో సీరం ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ప్రతి ఏడాది భారత్‌లో లక్షలాది మంది భారతీయ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. మరణాల శాతం కూడా ఆందోళనకరంగానే ఉంది. అయినప్పటికీ ఇంకా విదేశీ మందులపైనే ఆధారపడాల్సి వస్తోందని సీరం ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

Updated Date - 2022-06-17T00:07:51+05:30 IST