అంతర్గత రోడ్లు అధ్వానం

ABN , First Publish Date - 2022-01-20T17:01:42+05:30 IST

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అంతర్గత రోడ్లు అధ్వానం

 తొలగించని మట్టికుప్పలు, బురద

 రహదారుల్లో పారుతున్న మురుగు

 వెంకటాద్రినగర్‌ కాలనీవాసులకు తప్పని తిప్పలు

 పట్టించుకోని పాలకులు, అధికారులు


మౌలాలి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గౌతంనగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌, మీర్జాల్‌గూడలలో రెండు నెలల క్రితం భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు.  పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా.. అంతర్గత రోడ్లలో పేరుకుపోయిన మట్టి కుప్పలు, వ్యర్థాలను తొలగించడం లేదు. దీంతో వృద్ధులు, చిన్నారులు, పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


పొంగిన మురుగు..

భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయినా.. మట్టి కుప్పలు తొలగించకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి మురుగునీరు సక్రమంగా వెళ్లకుండా ఇళ్లలోకి చేరింది. ఇప్పటికే అంతర్గత రోడ్లలో పేరుకుపోయిన మట్టికుప్పలు, మురుగునీటి పారుదల, వరద నీటి నిల్వతో కాలనీ అంతర్గత రోడ్లన్నీ దుర్గంధంగా మారాయి. పరిసరాలు కంపుకొడుతున్నాయని కాలనీవాసు లు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారు లు స్పందించి మట్టికుప్పలు తొలగించడంతో పాటు మురుగు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.


వర్షం వచ్చిన ప్రతీసారి ఇబ్బందులు..

వర్షం కురిసిన ప్రతీసారి వరదనీటితోపాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రజాప్రతినిధులు పర్యటించడమే కాని సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించాలి. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. 

 - కృష్ణ, వెంకటాద్రినగర్‌

నడకకూ ఇబ్బందే..

భూగర్భ డ్రేనేజీ ఏర్పాటు చేసి నెలలు గడుస్తోంది. మట్టికుప్పలు తొలగించకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి ఇళ్ల ముందు మురుగునీరు, బురద చేరింది. దీంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను దూరంగా పార్క్‌ చేసి వస్తున్నాం. దోమలు, ఈగలు వృద్ధి చెంది కునుకు లేకుండా చేస్తున్నాయి. 

- విజయ్‌కుమార్‌, వెంకటాద్రినగర్‌ కాలనీ కార్యదర్శి

మట్టికుప్పలను తొలగిస్తాం..

వెంకటాద్రినగర్‌లోని అంతర్గత రోడ్లలో పేరుకుపోయిన మట్టికుప్పల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మట్టికుప్పలు తొలగించాలని కాంట్రాక్టర్‌లకు సూచించాం. మురుగునీటి పారుదల శాశ్వత పరిష్కారానికి త్వరలో బాక్స్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ఈ విషయమై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యను గుర్తించాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. 

- దీపక్‌, ఏఈ, గౌతంనగర్‌ డివిజన్‌

Updated Date - 2022-01-20T17:01:42+05:30 IST