Gpsతో ఖనిజ అక్రమ రవాణాకు చెక్‌

ABN , First Publish Date - 2022-04-22T17:46:31+05:30 IST

ఖనిజాల అక్రమాలు నియంత్రించే దిశలో, రాయల్టీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ‘వన్‌ స్టేట్‌ - వన్‌ జీపీఎస్‌’ వ్యవస్థను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని

Gpsతో ఖనిజ అక్రమ రవాణాకు చెక్‌

- చేజారుతున్న రాయల్టీని దక్కించుకునే యత్నం 

- భూగర్భ గనులశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ మనోహర్‌ 


బెంగళూరు: ఖనిజాల అక్రమాలు నియంత్రించే దిశలో, రాయల్టీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ‘వన్‌ స్టేట్‌ - వన్‌ జీపీఎస్‌’ వ్యవస్థను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని భూగర్భగనులశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి రాంప్రసాద్‌ మనోహర్‌ నగరంలో గురువారం మీడియాకు తెలిపారు. ఇసుకతో సహా అన్ని రకాల ఖనిజాల రవాణా పారదర్శకంగా జరిగేలా చూడడమే ఈ వ్య వస్థ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జీపీఎస్‌ వ్యవస్థను అన్ని జిల్లాల్లోనూ కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేపట్టామన్నారు. ఖనిజాల రవాణాపై డేగక న్ను వేస్తామన్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో వాటిల్లుతున్న నష్టాన్ని కొంతమేరకు నివారించే ప్రయత్నం చేస్తామన్నారు. గ్రానైట్‌, ఇసుక, ఇతర లోహ ఖనిజాల తవ్వకాల ప్రక్రియలో లక్షకుపైగా లారీలు, ట్రక్కులు పాల్గొంటున్నట్టు ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఈ వాహనాలన్నింటికీ జీపీఎస్ ను అమర్చడం ద్వారా నిర్ణీత ప్రమాణంకంటే ఎక్కువ మోతాదులో రవాణా అయినా, నియమాల ఉల్లంఘన జరిగినా ప్రభుత్వానికి తక్షణం సమాచారం అందుతుందన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈమేరకు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు వన్‌ స్టేట్‌ - వన్‌ జీపీఎస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చాయని ఏడాది చివరినాటికి కర్ణాటకలోనూ పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా అక్రమరవాణాకు తెరదించే దిశలో కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా విధానాలు రూపొందిస్తామన్నారు.


Updated Date - 2022-04-22T17:46:31+05:30 IST