ధాన్యం మిల్లులు ఫుల్‌

ABN , First Publish Date - 2022-05-19T06:51:54+05:30 IST

జిల్లాలో ధాన్యం కొంటున్నా.. మిల్లుల్లో జాగా లేదు. గోడౌన్‌లలో సందు లేదు. గత వానాకాలం ధాన్యానికి తోడు ఈ యాసంగి ధాన్యం కూడా వచ్చి చేరుతుండడంతో మిల్లర్‌లు చేతులెత్తేస్తున్నారు. సరిపడా జాగా లేకపోవడంతో మిల్లుల ఆరుబయటనే ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.

ధాన్యం మిల్లులు ఫుల్‌
రైస్‌ మిల్లులో భారీగా ధాన్యం

జిల్లాలో ఎక్కడికక్కడ ధాన్యం బస్తాలతో నిండిపోయిన మిల్లులు

మెజార్టీ ధాన్యం మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు లేని జాగా

ప్రైవేట్‌, ప్రభుత్వ గోదాంములలోనూ నిల్వ చేసేందుకు ప్రయత్నాలు

ఎలాగైనా 15 రోజుల్లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు

ప్రస్తుతం అన్ని మిల్లుల్లో ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ

ఈ సీజన్‌లో మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ!!

ధాన్యం నిల్వకు ఆయా మిల్లర్లతో జిల్లా అధికారుల చర్చలు

జిల్లావ్యాప్తంగా 270 వరకు పారాబాయిల్డ్‌, బాయిల్డ్‌, ఇతర రైస్‌ మిల్లులు

నిజామాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొంటున్నా.. మిల్లుల్లో జాగా లేదు. గోడౌన్‌లలో సందు లేదు. గత వానాకాలం ధాన్యానికి తోడు ఈ యాసంగి ధాన్యం కూడా వచ్చి చేరుతుండడంతో మిల్లర్‌లు చేతులెత్తేస్తున్నారు. సరిపడా జాగా లేకపోవడంతో మిల్లుల ఆరుబయటనే ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండడంతో నిల్వచేసే సామర్థ్యం మిల్లుల్లో లేకపోవడం గమనార్హం. దీంతో ప్రైవేట్‌ గోడౌన్‌ల కోసం సంబంధిత శాఖల అధికారులు వెతుకులాడుతున్నారు. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ గోడౌన్‌లలో నిల్వచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా 15 రోజుల్లోపు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ధాన్యాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

చేతులెత్తేస్తున్న మిల్లుల యజమానులు

జిల్లాలోని మిల్లులన్నీ ధాన్యంతో ఫుల్‌ అయ్యాయి. యాసంగి ధాన్యం కొనుగోలు చేసి వాహనాల ద్వారా తరలించినా.. మిల్లులో జాగాలేకపోవడం వల్ల ధాన్యం బస్తాలు దించుకోవడం ఆలస్యమవుతోంది. ఉన్న జాగాలోనే ఎక్కువ మొత్తంలో ఽధాన్యం నిల్వ చేస్తున్నా.. కొన్ని మిల్లుల యజమానులు చేతులెత్తేస్తున్నారు. ధాన్యం నిల్వచేసే సామర్థ్యం లేదని అధికారులకు విన్నవిస్తున్నారు. అన్ని మిల్లులు ఫుల్‌కావడంతో జిల్లా అధికారులు ఇప్పటి వరకు తక్కువ ధాన్యం  కేటాయింపులు చేసిన మిల్లులపైన దృష్టి పెట్టారు. ఆ మిల్లులకు కేటాయింపులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఆ మిల్లులకు తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు. 

జిల్లాలో మొత్తం 270 మిల్లులు

జిల్లాలో 270 వరకు పారాబాయిల్డ్‌, బాయిల్డ్‌, ఇతర రైస్‌మిల్లులు ఉన్నాయి. వానాకాలంతో పాటు యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని ఈ మిల్లులకు కేటాయింపులను చేస్తున్నారు. ఈ మిల్లుల్లో మర ఆడించిన తర్వాత ఎఫ్‌సీఐకి బియ్యాన్ని తరలిస్తున్నారు. జిల్లాలోని ఈ మిల్లులతో పాటు గోడౌన్‌ల మొత్తం కెపాసిటి ఆరు లక్షల టన్నుల వరకే ఉంది. అంతకుమించి మిల్లుల్లో నిల్వ చేసే సామర్థ్యం లేదు. గత వానాకాలం సీజన్‌లోనే అధికారులు తిప్పలుపడి మిల్లుల్లో లోపల, బయట సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల  వరకు ధాన్యాన్ని నిల్వ చేశారు. వానాకాలంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించి కస్టం మిల్లింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని మిల్లుల్లో కలిపి ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకు నిల్వ చేశారు. దీనిలో గత వానాకాలంలో సేకరించిన నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండగా.. ఈ సీజన్‌లో సేకరించిన నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉంది. ఒకేసారి భారీగా ధాన్యం సేకరణ జరగడంతో ఏ మిల్లులోనూ నిల్వ చేసే సామర్థ్యం లేదు. ప్రతీ మిల్లులో దాని కెపాసిటికి అనుగుణంగా మొదట ధాన్యాన్ని కేటాయించినా.. గత వానాకాలం ధాన్యం నిల్వ ఉండడంతో ప్రస్తుతం మిల్లులు అన్నీ నిండిపోయాయి. ఎఫ్‌సీఐ వరుస తనిఖీలు చేస్తుండడంతో గన్నీ బ్యాగులను లెక్కపెట్టే విధంగా మొదట నిల్వ చేసిన ధాన్యం ఎక్కువ వస్తుండడంతో అన్ని మిల్లుల్లో సందులేకుండా ధాన్యాన్ని నింపుతున్నారు. 

మిల్లర్లతో అధికారుల చర్చలు

ఈ సీజన్‌లో మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం ఉండడంతో వచ్చే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉంచాలో? అనే విషయంపైన మిల్లర్‌లతో అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బుధవారం మిల్లర్‌లతో మాట్లాడారు. ఇప్పటి వరకు తక్కువ నిల్వలు ఉన్న మిల్లులకు కొంత ధాన్యాన్ని కేటాయించడంతో పాటు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రైవేట్‌, ప్రభుత్వ గోడౌన్‌ల లో తాత్కాలికంగా ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మొత్తం ధాన్యాన్ని త్వరగా సేకరించడంతో పాటు వర్షాలు పడకముందే తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా కేటాయింపులు పూర్తికాని మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మిల్లులల్లో కేటాయింపులు పూర్తికాగానే ఇతర గోడౌన్‌లను పరిశీలించి వాటిలో నిల్వ చేస్తామన్నారు. కొనుగోలులో రైతులకు ఇబ్బందులు జరగకుండా చూస్తూనే.. వెంటవెంటనే ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఽధాన్యం ఎక్కువగా ఉన్నచోట వాహనాలను పెంచి తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకేసారి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడం, గత సీజన్‌ ధాన్యం ఉండడం వల్ల ఎక్కువ మిల్లులు జాగా లేక నిండిపోయాయని అదనపు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-19T06:51:54+05:30 IST