నేడు నల్లగొండ జిల్లాలో ధాన్యం టెస్ట్‌ మిల్లింగ్‌

ABN , First Publish Date - 2022-05-29T05:58:50+05:30 IST

నల్లగొండ జిల్లాలో 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలోని 113 మిల్లులకు తరలించారు.

నేడు నల్లగొండ జిల్లాలో ధాన్యం టెస్ట్‌ మిల్లింగ్‌
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌లో పరిశీలిస్తున్న అధికారులు

హాలియా, మే 28: నల్లగొండ జిల్లాలో 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలోని 113 మిల్లులకు తరలించారు. యాసంగిలో వచ్చే ధాన్యం సాధారణంగా ఉప్పుడు బియ్యానికి ఉపయోగపడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఉప్పుడు బియ్యానికి బదులుగా రారైస్‌ బియ్యాన్ని ఇవ్వాలని కోరింది. దీంతో మిల్లర్లు యాసంగిలో పండిన ధాన్యం రారైస్‌ చేసినట్లయితే నూక శాతం ఎక్కువ అవుతుందని, ఆనష్టాన్ని తాము భరించలేమని, బియ్యం 20 నుంచి 30 శాతం లోపే వచ్చి మిగతా మొత్తం 30 నుంచి 40 శాతం వరకు నూక అవుతుందని, ప్రభుత్వ నిబంధనలేమో 25 శాతం వరకే నూకలకు అనుమతి ఉండడంతో తాము పెట్టలేమని, అవసరమైతే టెస్ట్‌ మిల్లింగ్‌ చేయించాలంటూ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌ సోమే్‌షకుమార్‌ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమిటీ నూకల శాతాన్ని తేల్చడానికి మైసూరుకు చెందిన సీఎ్‌ఫటీఆర్‌ఐకి చెందిన శాస్త్రవేత్త సత్యేంద్రరావుకు అప్పగించింది. దీంతో ఆయన బృందం రాష్ట్రంలోని పలు మిల్లుల నుంచి టెస్టింగ్‌ మిల్లింగ్‌ కోసం ధాన్యం సేకరించనుంది. ఈబృందం జిల్లాల వారీగా పర్యటించి ఏ జిల్లాకు ఆ జిల్లాలోని ధాన్యం నిల్వలను సేకరించి టెస్ట్‌ మిల్లింగ్‌ నిర్వహించి నూకల శాతాన్ని తేల్చనున్నారు. 


ఎనిమిది మిల్లుల్లో సేకరణ

నల్లగొండ జిల్లాలో ధాన్యం ఎక్కువగా దిగుమతి అయిన ఎనిమిది మిల్లుల నుంచి ఆదివారం మైసూరుకు చెందిన సీఎ్‌పటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక బృందం టెస్ట్‌ మిల్లింగ్‌ నిర్వహించనున్నారు. హాలియాలో 2, చిట్యాలలో 2, నల్లగొండలో 1, మునుగోడులో 1, నకిరేకల్‌లో 2 మిల్లుల నుంచి ధాన్యం నిల్వలను సేకరించి వాటిని టెస్ట్‌ మిల్లింగ్‌ చేయనున్నారు. 


మిల్లర్ల నిరీక్షణ

యాసంగిలో ధాన్యం దిగుమతులు తుదిదశకు చేరినా టెస్టింగ్‌ మిల్లింగ్‌ పూర్తికాకపోవడంతో మిల్లర్లు అయోమయంలో ఉన్నారు. వాస్తవంగా బియ్యం, నూకలు కలిపి 68శాతం రావాల్సి ఉండగా ప్రస్తుతం పండిన ధాన్యం 60 నుంచి 65లోపే మొత్తం కలిపిరావడం. రారైస్‌ మాత్రమే తీసుకుంటామని ప్రభుత్వం తేల్చడంతో టెస్ట్‌ మిల్లింగ్‌ నిర్ధారణ కోసం మిల్లర్లు నిరీక్షిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక అకాల వర్షానికి ధాన్యం తడవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆఽ దాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం, ఆ ధాన్యం నూకశాతం మరింత ఎక్కువ అవుతుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2022-05-29T05:58:50+05:30 IST