ధాన్యం కొనం

Published: Fri, 25 Mar 2022 03:58:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ధాన్యం కొనం

 • దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం.. 
 • పంజాబ్‌, తెలంగాణల్లోనూ అదే అమలు
 • తెలంగాణ సర్కారు ధాన్యం కొనాల్సిందే
 • ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు అదనపు 
 • ముడి బియ్యం నిల్వలను కూడా సేకరిస్తాం
 • నూకలను మీ ప్రజలకు అలవాటు చేయండి
 • కేంద్రంలో అధికారంలోకి వస్తామంటున్నారుగా
 • అప్పుడు సేకరణ విధానాన్ని మీరు మార్చండి
 • తెలంగాణ మంత్రులతో పీయూష్‌ వ్యాఖ్యలు
 • దేవుడు దయదలిస్తే అధికారంలోకి..: వేముల
 • ఆహ్వానించినా సమావేశానికిరాని కిషన్‌ రెడ్డి
 • 45 నిమిషాలపాటు వాడివేడిగా జరిగిన భేటీ
 • రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌
 • ఎంత ముడి బియ్యం ఇస్తారో చెప్పడం లేదు
 • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 
 • పదే పదే ఢిల్లీకి: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌


న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నేరుగా ధాన్యాన్ని సేకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రుల బృందానికి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చి చెప్పారు. పంజాబ్‌లోనూ, తెలంగాణలోనూ ఒకే విధానం అమల్లో ఉందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఎన్నడూ ధాన్యం కొనలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల పట్ల వివక్ష లేదని, పంజాబ్‌లో సేకరించినట్లే తెలంగాణలోనూ నాణ్యత ఆధారంగా సేకరిస్తామని తెలిపారు. ఎఫ్‌సీఐ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉంటే, తెలంగాణ నుంచి అదనంగా కూడా ముడి బియ్యం సేకరిస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎంపీలు కె.కేశవ రావు, నామా నాగేశ్వర రావు ధాన్యం కొనుగోలుపై గురువారం మధ్యాహ్నం పీయూష్‌ గోయల్‌తో పార్లమెంటు భవనంలో దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. 


ఈ సమావేశం వాడివేడిగా జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత, ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రులు వినతి పత్రం సమర్పించారు. దానిని పరిశీలించిన కేంద్ర మంత్రి.. ఈ విజ్ఞప్తిని నెరవేర్చలేమని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ముడి బియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని స్పష్టం చేశారు. దాంతో, తెలంగాణలో యాసంగిలో పండే ధాన్యం ద్వారా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, బాయిల్‌ చేయకపోతే బియ్యం నూకలు అవుతాయని, వాటిని ఏం చేయమంటారని రాష్ట్ర మంత్రులు ప్రశ్నించగా.. ‘‘మీరే ఏదో ఒకటి చేయండి. ఆ నూకలు తినడాన్ని మీ ప్రజలకు అలవాటు చేయండి. ఏది అమ్ముడుపోతుందో దానినే మేం కొంటాం. దేశ ప్రజలు తినేదే మేం సేకరిస్తాం’’ అని పీయూష్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పంజాబ్‌లో ఎఫ్‌సీఐనే కొనుగోలు చేస్తుందని, ఆ విధానాన్నే తెలంగాణకు వర్తింపజేయాలని, దేశమంతా ఒకే విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులు వాదించగా.. ‘‘మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్నారుగా! మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాన్ని మార్చండి’’ అని పీయూష్‌ గోయల్‌ హేళనగా అన్నట్లు సమాచారం. దానికి స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. ‘‘భగవంతుడి దయతో ఇంత దూరం వచ్చాం. దేవుడు దయదలిస్తే తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తాం. మీరు కూడా ఇద్దరితో మొదలయ్యే ఇంత దూరం వచ్చారు కదా...’’ అని జవాబిచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.


కేంద్ర, రాష్ట్ర మంత్రుల పరస్పర ఆరోపణలు

ధాన్యం సేకరణపై గతంలో ఎవరెవరు ఏమేం మాట్లాడారనే అంశంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గతంలో మాట్లాడిన మాటలను వినిపించుకున్నారు. యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తే.. వరి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతులకు స్పష్టం చేశారని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో బండి సంజయ్‌ మాట్లాడిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఆయనకు చూపించారు. దీనిని ముందే ఊహించిన పీయూష్‌ గోయల్‌.. తన దగ్గరకు వచ్చిన రాష్ట్ర మంత్రులు గతంలో ఏం మాట్లాడారన్న వివరాలను ముందే సేకరించి పెట్టుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఏం మాట్లాడితే, దానికి ప్రతిగా బీజేపీ నేతలు జవాబిచ్చారనే అంశాన్ని తన దగ్గర ఉన్న వివరాల నుంచి చదివి వినిపించారు.


తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రం నుంచి ముడి బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర మంత్రుల బృందంతో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాలో మాట్లాడారు. ‘‘ముడి బియ్యం సేకరణపై గత నెల 25న అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రబీ సీజన్‌లో ఎంతమేర ముడి బియ్యం ఇస్తుందో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు. 25 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పింది. 10 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇస్తామని ఒడిసా చెప్పింది. ఇలా అన్ని రాష్ట్రాలూ ఎంతమేర ముడి బియ్యం ఇస్తామో తెలిపాయి. తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. నిర్దిష్ట నమూనాలో రాసి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఈనెల 8న జరిగిన సమావేశంలోనూ అడిగాం. అయినా, రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించడం లేదు’’ అని తప్పుబట్టారు. కేవలం ముడి బియ్యాన్నే ఇస్తామని గతంలో రాతపూర్వకంగా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను భ్రమింపజేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటే నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. రాతపూర్వకంగా ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలని, తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను తప్పదోవ పట్టించవద్దని హితవు పలికారు.


కిషన్‌ రెడ్డి ఎందుకు రాలేదు?

తెలంగాణ మంత్రులతో సమావేశానికి రావాలంటూ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని పీయూష్‌ గోయల్‌ ఆహ్వానించారు. కానీ, కిషన్‌ రెడ్డి రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ దాదాపు 15నిమిషాలపాటు సమావేశాన్ని ఆపా రు. అయినా, రాకపోవడంతో కిషన్‌కు గోయల్‌ ఫోన్‌ చేశారు. ‘‘ఎందుకు రావడం లేదు? రావడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?’’ అని కిషన్‌ రెడ్డిని పీయూష్‌ ప్రశ్నించినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పారు.


పంజాబ్‌ విధానమే అన్ని రాష్ట్రాల్లోనూ..

ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సేకరిస్తుందని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి బియ్యం సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలుకు 2014-15లో రూ.3,391 కోట్లు వెచ్చించగా.. ఈ ఏడాది వర్షాకాల కొనుగోళ్లకు రూ.26,610 కోట్లు వెచ్చించామని తెలిపారు. గత ఆరేళ్లలో 700 శాతం పెరిగిందన్నారు. ‘‘పంజాబ్‌కు వర్తించే విధానమే తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఎఫ్‌సీఐతో కుదుర్చుకున్న డీపీసీ ప్రకారమే రాష్ట్రాలు ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌ డిమాండ్‌, వినియోగం ఆధారంగా కేంద్రం ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలు తమ అవసరాల కోసం ఉంచుకొని మిగతా బియ్యాన్ని కేంద్రానికి ఇస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లో ఉంటుంది’’ అని వివరించారు. ఒప్పందంలోని పలు వాక్యాలను చదివి వినిపించారు. డీపీసీ కేటాయింపులకు మించి రాష్ట్ర ప్రభుత్వం సేకరించే బియ్యం నిల్వలు ఉంటే.. అధిక నిల్వలను ఎఫ్‌సీఐకి అప్పగించాలి. రాష్ట్ర వినియోగానికి సరిపడా ఉంచుకున్న తర్వాత ఎఫ్‌సీఐ నిర్దేశిత ప్రమాణాల మేరకు తెలంగాణలో అధికంగా ఉన్న ముడి బియ్యం నిల్వల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని వివరించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే టీఆర్‌ఎస్‌ పార్టీ ఇలా వ్యవహరిస్తోందని, పదే పదే మంత్రులు ఢిల్లీ వస్తున్నారని తప్పుబట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.