గ్రామ పాలనలో గందరగోళం

ABN , First Publish Date - 2020-11-30T06:06:01+05:30 IST

అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపడితే నిధుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఉపాధి హామీ పథకం కింద ఎన్ని పనులు చేసుకుంటే అన్ని నిధులు ఇస్తామంటూ కేంద్రం అనుమతించింది.

గ్రామ పాలనలో గందరగోళం
గ్రామ పంచాయతీ

400మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు 

చేతులెత్తేస్తున్న సర్పంచులు 

నిధులు లేక నిలిచిపోతున్న పనులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపడితే నిధుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఉపాధి హామీ పథకం కింద ఎన్ని పనులు చేసుకుంటే అన్ని నిధులు ఇస్తామంటూ కేంద్రం అనుమతించింది. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇదే అదునుగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, శ్మశాన వాటికలు, తడి, పొడి చెత్త వేరు చేసే (సెగ్రిగేషన్‌ షెడ్‌)నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో లేబర్‌(కూలీల) కోటా బాధ్యత గ్రామ కా ర్యదర్శులకు, నిర్మాణాల బాధ్యత సర్పంచులకు అప్పగించింది.డబ్బులు మిగిలే అవకాశం ఉందని సర్పంచులు మొదట ముందుకొచ్చి పనులు చేపట్టారు.కూలీలు అందుబాటులోకి వచ్చారు. ఆమేరకు కొన్నిచోట్ల పనులు పూర్తయ్యాయి. అయితే కేంద్రం అనుకున్న మేరకు నిధులు విడుదలచేయగా వాటిని రాష్ట్రం ఇతర అవసరాలకు మ ళ్లించడం, వాయిదాల పద్ధతిలో ఉపాధి కూలీల డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టడంతో సమస్య ఉత్పన్నమైంది. 


ఆందోళనలో సర్పంచులు 

కొన్ని చోట్ల పనులు పూర్తి చేసిన సర్పంచులకు నేటికీ బిల్లులు రాలేదు. శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.12 లక్షలు, డంపింగ్‌ యార్డుకు రూ.2.50 లక్షలు, పల్లె ప్రకృతి వనాలకు రూ.5.7 లక్షలు, రైతు వేదికల నిర్మాణానికి రూ.22లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అవకాశం వచ్చింది కదా అని సర్పంచులు అప్పులు చేసి మరీ పనులు చేస్తుండగా, ఇప్పటి వరకు రైతు వేదికలకు మాత్రమే మొదటి దశ నిధులు విడుదల అయ్యాయి. 90 శాతం రైతు వేదికల పనులు పూర్తయినా నిధులు మా త్రం పూర్తిగా రాలేదు. ఇదిలా ఉంటే ఇతర పనులు పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తుండగా సర్పంచులు చేతులెత్తేస్తున్నారు. అధికారులపై నమ్మకంతో సర్పంచులు పనులు చేపట్టగా నిధులు లేకపోవడంతో పంట కల్లాల టార్గెట్‌ 8,280 కాగా ఇప్పటికీ 215 మాత్రమే పూర్తిచేశారు. శ్మశాన వాటికలు 838 మంజూరు చేయగా, 12 పూర్తి చేశారు. సెగ్రిగేషన్‌ షెడ్లు 834 మంజూరు కాగా, 3 మాత్రమే పూర్తయ్యాయి. అదే రైతు వేదికల విషయానికొస్తే 136 మంజూరు కాగా 90 శాతం పూర్తి చేశారు. 


టార్గెట్‌ పూర్తి చేయలేదంటూ కార్యదర్శులకు నోటీసులు

నల్లగొండ జిల్లాలో 841 పంచాయతీలు ఉండగా టార్గెట్లు పూర్తి చేయలేదంటూ 400 పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీచేశారు. వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ పనులు పెద్దఎత్తున సాగుతున్నాయి. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో భవన నిర్మాణం, ఇతర పనుల్లో వేగం పెరిగి కూలీల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది. ఏ పనికి వెళ్లినా మహిళలకు రూ.600, పురుషులకు రూ.800 రోజు కూలి దొరుకుతోంది. ఈ పరిస్థితుల్లో రూ.200 వచ్చే ఉపాధి కూలీకి గ్రామీణ కార్మికులు వచ్చే పరిస్థితిలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించిన ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులు మందగించాయి. అనుకున్న కాలంలోపు పనులు పూర్తిచేయడంలో విఫలం అయ్యారంటూ జిల్లాలోని 400మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీచేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇవ్వకుండా తమకే ఇవ్వడం ఏమిటని పలువురు కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచులు వదిలేసిన పనులతోపాటు ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనులు కూడా చేస్తున్నామన్నారు. చేసిన పనులకు కూలి డబ్బులు రావడంలేదని, సెలవులు కూడా దొరకవని, ఇన్ని అడ్డంకులు పెట్టి టార్గెట్లు పూర్తి చేయలేదంటూ తమకు నోటీసులు ఇవ్వడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. 


పనులు చేసి అప్పుల పాలవుతున్నాం: జూలూరు ధనలక్ష్మి, సర్పంచుల  సంఘం జిల్లా అధ్యక్షురాలు, నల్లగొండ 

రైతు వేదికల నిర్మాణానికి రూ.22 లక్షలు అన్నారు, 45 రోజుల్లో పూర్తి చేయాలన్నా రు. పునాదుల నుంచి స్లాబ్‌ వరకు 45 రోజుల్లో అవుతుందా.అలా కడితే భవనం ఉంటదా? అయినా పూర్తి చేశా. నాకు రూ.13 లక్షల బిల్లు వచ్చింది. మిగిలిన రూ.9 లక్షలు ఎప్పుడు వస్తాయో తెలియదు. నిర్మాణం పూర్తి చేసి నెల రోజులైంది. సెగ్రిగేషన్‌ షెడ్లకు ఎం.బీ. కూడా మొదలుపెట్టలేదు. మేం తీర్మానాలు ఇచ్చినా ఏఈలు సహకరించడం లేదు. పల్లె ప్రకృతి వనాలకు ఫెన్సింగ్‌ వేయమన్నారు, ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. మా గౌరవ వేతనం రూ.5 వేలు, అవి సాధారణ ఖర్చులకు సరిపోవు. పల్లె ప్రకృతి వనాలకు భూమి చూపించరు, చూపించినా గొడవలు ఉన్న భూమి చూపిస్తారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 

Updated Date - 2020-11-30T06:06:01+05:30 IST