ఘనంగా మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T05:57:06+05:30 IST

ఘనంగా మొహర్రం వేడుకలు

ఘనంగా మొహర్రం వేడుకలు
వికారాబాద్‌ : శివారెడ్డిపేటలో పీర్ల ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు

  • భక్తిశ్రద్ధలతో పీర్ల ఊరేగింపు 
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు,  నాయకులు

వికారాబాద్‌/బషీరాబాద్‌/మోమిన్‌పేట్‌/నవాబుపేట/పూడూర్‌/కొడంగల్‌రూరల్‌/బొంరాస్‌పేట్‌/కులకచర్ల/ఘట్‌కేసర్‌రూరల్‌/కీసర/ఘట్‌ కేసర్‌/కీసర రూరల్‌, ఆగస్టు 9 : మొహర్రం సందర్భంగా వికారాబాద్‌ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామంలో ఊరేగించి ఉత్సవాలను జరుపుకోగా కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.

వికారాబాద్‌ పట్టణంలోని శివారెడ్డిపేటలో పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రతి సంవత్సరం ననిర్వహించగా ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు. పీర్లను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున శివారెడ్డిపేటకు వచ్చారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలంలో కుల, మాతాలకతీతంగా సోమవారం రాత్రంతా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మసీద్‌లలో ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు ఆయా గ్రామాల్లో  భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు. పలు గ్రామాల్లో రాత్రివేళ మహిళల ఆటపాటలతో బొడ్డెమ్మలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. హిందువులు, ముస్లీంలు కలిసికట్టుగా పీర్ల ఎదుట డప్పుల చప్పుడులతో ఆడిపాడిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజామున మొహర్రం వేడుకల్లో భాగంగా పీర్ల సవారీతో గ్రామ వీధుల్లోకి రాగా భక్తులు దారిపోడవునా నీరుపోసి మొక్కులు తీర్చుకున్నారు. పర్వత్‌పల్లిలో నవాంద్గీ పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, శరత్‌కళ దంపతులు, బషీరాబాద్‌లో వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌ తదితరులు దర్శించుకున్నారు. ఈ పీరీల వేడుకల్లో  వివిధ పార్టీల నాయకులు పలువురు పాల్గొన్నారు.

మోమిన్‌పేట్‌ మండల పరిధిలోని టేకులపల్లి, మోమిన్‌పేట్‌, ఎన్కతల, రామన్‌నాథ్‌గూడుపల్లి తదితర గ్రామాల్లో పీర్ల పండగ ఉత్సవాలను జరుపుకున్నారు. మోమిన్‌ఫేట్‌లో జరిగిన మొహర్రం ఉత్సవాల్లో వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు. నవాబుపేట మండల పరిధిలోని ఘనగాపూర్‌, అక్నాపూర్‌ గ్రామాల్లో పీర్ల పండగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పూడూర్‌ మండల పరిధిలోని కంకల్‌, కొడంగల్‌ మండలం హస్నాబాద్‌, బొంరాస్‌పేట్‌ మండల కేంద్రంలో హిందు-ముస్లిం సోదరులు పీర్ల పండగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల పరిధిలో మంగళవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. కులకచర్ల, పుట్టపహాడ్‌, ఇప్పాయిపల్లి, చౌడాపూర్‌, వీరాపూర్‌ గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. ఈ ఊరేగింపులో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల గుండా ఊరేగించి  నిమజ్జనంకు సమీప చెరువులకు తరలించారు. పీర్ల ఊరేగింపు ముందు యువకులు, మహిళలు ఆటా, పాటలతో అలరించారు.

అలాగే ఘట్‌కేసర్‌ మండలంలో పీర్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అవుశాపూర్‌, అంకుషాపూర్‌, మర్రిపల్లిగూడ, ఎదులాబాద్‌, కొర్రెముల, ప్రతాప్‌సింగారం, కాచవానిసింగారం తదితర గ్రామాలలో కులమతాలకు అతీతంగా వేడుకలు జరుపుకున్నారు. ఉదయం పీర్ల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామాలలో పీర్లను ఊరేగించారు. యువకులు అలావ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసి పాటలు పాడారు. పీర్లు ఎత్తుకున్నవారు పీర్ల ఊరేగింపులో పూనకాలతో ఊగిపోయారు. భక్తులు పీర్లకు దట్టీలు, ప్యాతాలు సమర్పించారు. సాయంత్రం పీర్లను నిమజ్జనం చేశారు. సర్పంచ్‌లు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కీసర, భోగారం, యాద్గార్‌పల్లి, చీర్యాల్‌, గోధుమకుంట, తదితర గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. ఈ మేరకు గ్రామస్థులు పీర్లకు దట్టీలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కీసరలో ఊరేగించే బీబీకా అలాం, హస్సన్‌, హుస్సెన్‌ల ఊరేగింపు తిలకించేందుకు వందల మంది తరలిం వచ్చారు. ఆనంతరం హసన్‌, హుస్సేన్‌లపై విషాదగీతాలను ఆలపిస్తు ముస్లింలు రక్తతర్పణం చేశారు.

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా వార్డుల్లో పీర్లను ఉరేగించారు. దీంతో కాలనీల్లో సందడి నెలకొంది. చీకటి పడిన తర్వాత పీర్లను బావుల్లో నిమజ్జనం చేశారు. అదేవిధంగా నాగారం, దమ్మాయిగూడలో ముస్లింలు మొహర్రంను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడలో పీర్ల ఊరేగింపును నిర్వహించారు. అషూర్‌ఖానా(పీర్ల కొట్టం) ముందున్న ఆల్వా వద్ద జనాలు నృత్యాలు చేసారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కౌన్సిలర్లు, తదితరులు మొహర్రం కార్యక్రమంలో పాల్గొని పీర్లకు దట్టీలు సమర్పించారు.

Updated Date - 2022-08-10T05:57:06+05:30 IST