ఆక్సిజన్‌ లేక ఆగిన పరిశ్రమ.. గ్రానైట్‌ స్లాబ్స్‌, టైల్స్‌ ఫ్యాక్టరీలకు ప్రాణవాయు సరఫరా నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-11T05:52:52+05:30 IST

కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆ ప్రభావం గ్రానైట్‌ పరిశ్రమలపైనా పడుతోంది. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించడానికి ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుండటం తో.. గ్రానైట్‌ ఫ్టాక్టరీల్లో రాయి కటింగ్‌కు అవసరమైన ఆక్సి జన్‌ సిలిండర్ల సరఫరాను నిలిపేశారు.

ఆక్సిజన్‌ లేక ఆగిన పరిశ్రమ..  గ్రానైట్‌ స్లాబ్స్‌, టైల్స్‌ ఫ్యాక్టరీలకు ప్రాణవాయు సరఫరా నిలిపివేత
ఖమ్మంలో ఆగి ఉన్న స్లాబ్స్‌ ఫ్యాక్టరీ

 యంత్రాలకు బ్రేక్‌.. ఉపాధి కోల్పోయిన కార్మికులు

 ఇప్పటికే లాక్‌డౌన్‌తో నిలిచిన ఎగుమతులు

 గ్రానైట్‌ రంగానికి భారీ నష్టాలు 

ఖమ్మం ఖానాపురం హవేలీ, మే 10: కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆ ప్రభావం గ్రానైట్‌ పరిశ్రమలపైనా పడుతోంది. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించడానికి ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుండటం తో.. గ్రానైట్‌ ఫ్టాక్టరీల్లో రాయి కటింగ్‌కు అవసరమైన ఆక్సి జన్‌ సిలిండర్ల సరఫరాను నిలిపేశారు. దీంతో పరిశ్రమలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో 450స్లాబ్‌ పరిశ్రమలు, 120 టైల్స్‌ పరిశ్రమలు ఉండగా వాటిలో 150 వరకు స్లాబ్స్‌ పరిశ్రమలు, 50 టైల్స్‌ పరిశ్రమలున్నాయి. ప్రస్తుతం వాటికి ఆక్సిజన్‌ సిలిండర్లు అందకపోవడంతో.. యంత్రాలన్నీ ఆగి పోయాయి. ఆక్సిజన్‌ ఉంటేనే ఆయా ఫాక్టరీల్లో రాయి కటింగ్‌ సాధ్యమవుతుంది. లేదంటే ఇక అంతే. దేశవ్యాప్తం గా కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అవసరం పెరగడం, తద్వారా ప్రాణవాయువు కొరత ఏర్పడటంతో ప్రస్తుతానికి గ్రానైట్‌ పరిశ్రమలు ఆగిపోయాయి. దీంతో కార్మికులు తమ కు పనులు లేకపోవ డంతో వారి స్వరాష్ట్రా లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఆగిన బ్రేజింగ్‌ పనులు..

గ్రానైట్‌ రాళ్లను క్వారీలనుంచి తీసుకొచ్చిన అనం తరం వాటిని కట్‌చేసేందుకు వాడే కట్టర్లకు పలు రకాల సిగ్మెంట్లను అతికించి బ్రేజింగ్‌ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ఆక్సిజన్‌ అవసరం ఉండగా, ఒక్కో గ్రానైట్‌ కట్టర్‌కు నెలకు నాలుగు సిలిండర్లు, స్లాబ్‌ ఫ్యాక్టరీలో ఒక్కో కట్టర్‌కు నెలకు రెండు సిలిండర్లు అవసరం అవు తాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభు త్వం ప్రైవేట్‌ ఆసు పత్రుల్లోనూ చికిత్సకు అనుమతివ్వ డంతో ఆక్సిజన్‌ సిలిం డర్లు అటువైపు పంపుతున్నారు. దీంతో గ్రానైట్‌ పరిశ్రమలకు ఆక్సిజన్‌ అందడం లేదు.

నిలిచిన ఎగుమతులు

పక్క రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో విధించడంతో ఇక్కడ నుంచి గ్రానైట్‌ ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. ఇక్కడి గ్రానైట్‌ అధిక శాతం ఆయా రాష్ట్రాలకే ఎగుమతవుతుండ గా లాక్‌డౌన్‌తో.. అక్కడి బయ్యర్లు ప్రస్తుతం వారి స్వరాష్ట్రాలకు వెళ్లడంతో ఎగుమతులకు అడ్డంకులు ఎదుర వుతున్నాయి. సుమారు నెల రోజులుగా ఇదేపరిస్థితి ఉండటంతో పరిశ్రమల యాజ మాన్యాలు నష్టాలు చవిచూస్తున్నాయి. కార్మికులకు వేతనాలు, కరెంటు బిల్లులు, రాయల్టీ చెల్లించే పరిస్థితి లేక యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మరో నెల రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పరి శ్రమలు పూర్తిగా మూత పడే ప్రమాదం ఉంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అధిక శాతం మంది ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒరిసా రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండగా వారంతా స్వస్థలాలలకు వెళ్లిపోతుండటంతో మళ్లీ గ్రానైట్‌ రంగం కుదేలు కానుంది. ఇప్పటికే గతేడాది లాక్‌డౌన్‌లో ఫ్యాక్టరీలు పూర్తిగా స్తంభించడంతో యాజ మాన్యాలు తీవ్ర నష్టాలు మూటగట్టుకోగా.. మధ్యలో లాక్‌డౌన్‌ సడలింపులతో పనులు ప్రారంభించారు. క్రమంగా పరిస్థితి కుదుటపడుతోందనుకున్న సమయా నికి మళ్లీ కరోనాసెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఖమ్మం జిల్లాలో ఆ రంగం మూతపడే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే నెలకు ఆదాయం రూ.రెండు కోట్లకు పడిపోగా.. ఇకపై ఆ నష్టం మరింత పెరగనుంది. 


కరెంటు బిల్లులు, రాయల్టీ చెల్లింపునకు సమయమివ్వాలి 

తమ్మినేని వెంకట్రావు, ఖమ్మం జిల్లా గ్రానైట్స్‌ శ్లాబ్స్‌, ఫ్యాక్టరీల అసోసియేషన్‌ అధ్యక్షుడు

గ్రానైట్‌ ఫాక్టరీలకు పారిశ్రామిక ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో పరిశ్రమల్లో పనులు ఆగిపోయా యి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు బిల్లులు, రాయల్టీ చెల్లింపు చేసే పరిస్థితి లేదు. వీటి చెల్లింపునకు కొంత సమయం ఇవ్వాలి.  గ్రానైట్‌ ప్రొడక్షన్‌ చేయాలంటే బ్రేజింగ్‌ తప్పని సరి. కట్టర్‌ను బట్టి రెండు వేల నుంచి మూడు వేల అడుగులకు సిగ్మెంట్స్‌ అరిగిపోయాయి. ఆయా సమయాల్లో బ్రేజింగ్‌ చేయాలి. దానికి తప్పనిసరిగా ఆక్సిజన్‌ కావాలి. పనులు నిలిచిపోవడం తో కార్మికులు వెళ్లిపోతు న్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే గ్రానైట్‌ రంగం కుదేలయ్యే ప్రమాదముంది.


Updated Date - 2021-05-11T05:52:52+05:30 IST