తవ్వుకో.. తరలించుకో!

ABN , First Publish Date - 2021-04-10T05:57:49+05:30 IST

జిల్లాలో గ్రావెల్‌ అక్రమ రవాణా అధికమైంది. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

తవ్వుకో.. తరలించుకో!
గుర్రాజుకుంటలో గ్రావెల్‌ను ట్రాక్టర్‌కు లోడింగ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌ (ఇన్‌సెట్‌లో) గిద్దలూరు సమీపంలో కొండమట్టిని ట్రాక్టర్‌కు నింపుతున్న అక్రమార్కులు

జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

కొండలు, తిప్పలను పిండిచేస్తున్న అక్రమార్కులు 

అనుమతులు లేకుండానే అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

రియల్‌ వెంచర్లలో మెరకలకు తోలకం

ఒకవైపు ఉపాధి పనులు.. మరోవైపు యంత్రాలతో క్వారీయింగ్‌

జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను, తిప్పలను అక్రమంగా తవ్వి యథేచ్ఛగా గ్రావెల్‌ వ్యాపారం చేస్తోంది. జిల్లాలో అద్దంకి, మార్టూరు, గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్‌ క్వారీయింగ్‌ నడుస్తోంది. ప్రభుత్వ రోడ్లతోపాటు ప్రైవేటు వెంచర్లకు, ఇతర అవసరాలకు కొండమట్టి (గ్రావెల్‌) అవసరం కాగా, కొంతమంది ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా కొండలను పిండిచేస్తున్నారు. అనంతరం గ్రావెల్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో మాత్రమే రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారే తప్ప వీరి వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. అక్రమార్కులంతా దాదాపు అధికారపక్షానికి చెందిన వారు కావడంతో అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది మట్టి తవ్వకాలు జరిపే సమయంలో అక్కడకు వెళ్లిగానీ, తవ్వకాలు చేస్తున్న వారికి ఫోన్లు చేసి గానీ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ జేబులు నింపుకొంటున్నారు.


గిద్దలూరు/అద్దంకి, ఏప్రిల్‌ 9 : జిల్లాలో గ్రావెల్‌ అక్రమ రవాణా అధికమైంది. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అలాగే అద్దంకి, మార్టూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు ప్రాంతాల్లో మట్టి మాఫియా నడుస్తోంది. గిద్దలూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని దుప్పలతిప్పలాంటి రెండు మూడు కొండలకు మాత్రమే గ్రావెల్‌ తవ్వకాలపై కొంతమందికి అనుమతులు ఉన్నాయి. దూరం నుంచి గ్రావెల్‌ తీసుకు రావాలంటే రవాణా ఖర్చులు రెట్టింపు అవుతాయన్న భావనతో అక్రమార్కులు సమీప కొండలను పిండిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి కొండ మట్టిని ట్రాక్టర్లలో నింపి దూరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.700 వరకూ వసూలు చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ట్రాక్టర్‌కు రేటును బట్టి రూ.100 నుంచి రూ.200 దాకా అక్రమార్కులకు మిగులుతుండటంతో వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. పట్టణంలోని రాజానగర్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కొండవెంట చదును చేసి ఇచ్చిన విషయం తెలిసిందే. కొందరు మట్టి మాఫియా వ్యక్తులు అర్ధరాత్రులు ఇళ్ల ప్లాట్లకు ఇచ్చిన స్థలాలలో కూడా ఎక్స్‌కవేటర్ల ద్వారా గుంతలు చేసి గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. 


అంబవరంలో..

ఇటీవల మండలంలోని అంబవరం సమీప కొండ దగ్గర మట్టిని కొందరు అక్రమంగా తవ్వుతున్నారు. రెండు ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి 15 ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ కొండపై ఏసుక్రీస్తు శిలువ ఉండగా ఆ ప్రాంతంలో కూడా తవ్వకాలు చేపట్టడంతో పాలెంవాసులు అర్ధరాత్రి కొండ దగ్గరకు వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి రెవెన్యూ అధికారులు వెళ్లి రెండు ఎక్స్‌కవేటర్లను, 15 ట్రాక్టర్లను రెవెన్యూ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్లు ఎవరికివారు తప్పించుకొన్నారు. కేవలం ఒక ఎక్స్‌కవేటర్‌, 2 ట్రాక్టర్లు మాత్రమే కార్యాలయానికి చేరుకున్నాయి. దాంతో అంబవరం పాలెంవాసులు అర్ధరాత్రి పూట రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని మీరు పట్టుకుంటేనే దిక్కులేదు, కనీసం మాకు చెప్పి ఉంటే అన్ని వాహనాలను అక్కడే బంధించేవారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. అంబవరం కొండపై మట్టి తవ్వకాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, విచారించి మిగతా వారిని కూడా  గుర్తించి కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ హామీ ఇవ్వడంతో పాలెంవాసులు ఆందోళన విరమించారు. 


గుర్రాజుకుంట నుంచి యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ రవాణా 

అద్దంకి పట్టణ పరిధిలో గుర్రాజుకుంట నుంచి గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ఎక్స్‌కవేటర్‌ను పెట్టి మరీ మట్టిని తోడేస్తున్నారు. రియల్‌ వెంచర్లలో మెరకలకు దాన్ని అమ్ముకొన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్తర అద్దంకి రెవెన్యూ  పరిధిలోని కాకానిపాలెం నుంచి బొమ్మనంపాడు వెళ్లే రోడ్డులో  351 సర్వే నెంబరులో  గుర్రాజుకుంట 12.36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటికే కొంత మేర అది ఆక్రమణకు గురైంది. మిగిలిన దానిలో కొందరు అక్రమంగా గ్రావెల్‌ను తవ్వుతున్నారు. బొమ్మనంపాడుకు చెందిన కూలీలు ఈ కుంటలో ఒకవైపు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. మరోవైపు అక్రమార్కులు ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసి గ్రావెల్‌ను తవ్వి పట్టణంలోని పలు వెంచర్లకు తరలిస్తున్నారు.  యంత్రాల ద్వారా  లోతుగా తవ్వడం వలన  తమ కూలి డబ్బులు నిలిచిపోతాయన్న ఆందోళన కూలీలలో నెలకొంది. రైతులు పురుగు ముందుల పిచికారీకి గుర్రాజుకుంటలోని నీటిని వినియోగిస్తుంటారు. అదే సమయంలో వేసవిలో పశువుల దాహార్తిని కూడా ఇది తీర్చుతుంది. ప్రస్తుతం అక్రమార్కులు 20 అడుగుల లోతున తవ్వకాలు చేయటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


ఎక్స్‌కవేటర్‌, ఐదు ట్రాక్టర్లు స్వాధీనం 

గుర్రాజుకుంట నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలిసున్నట్లు తహసీల్దార్‌ ప్రభాకరరావుకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో ఆయన ఆర్‌ఐ విష్ణు, వీఆర్వో బాషాలను అక్కడకు పంపారు. కుంటలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్న ఒక ఎక్స్‌కవేటర్‌ను, ఐదు ట్రాక్టర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులకు అప్పగించారు. 


గ్రావెల్‌ క్వారీయింగ్‌ను అడ్డుకున్న బొబ్బేపల్లి గ్రామస్థులు

మార్టూరు, ఏప్రిల్‌ 9 : మండలంలోని బొబ్బేపల్లిలో గ్రావెల్‌ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నిసార్లు అధికారులు అడ్డుకున్నా వారు వెనక్కి తగ్గడం లేదు.  అక్రమంగా ఎక్సకవేటర్లతో తవ్వి భారీ ఎత్తున గ్రావెల్‌ను తరలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది గ్రామస్థులు మట్టిని తీస్తున్న మిషన్‌ను, వారి వాహనాలను అడ్డుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మైనింగ్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారితో గ్రామస్థులు వాగ్వివాదానికి దిగారు. దీంతో మైనింగ్‌ ఆర్‌ఐ రాజు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మార్టూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.


జరిగిన తీరు..

గ్రామ మాజీ సర్పంచ్‌ దండా వీరాంజనేయులు ఆధ్వర్యంలో కొంతమంది గ్రామస్థులు శుక్రవారం గ్రామశివార్లో గంగా వారి చెరువులో అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులకు కూడా తెలియచేశారు. దీంతో అక్కడకు మైనింగ్‌ ఆర్‌ఐ రాజు, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అటెండరుతో కలిసి వచ్చారు. కొంతకాలంగా అక్రమంగా గ్రావెల్‌ను తరలించడం ద్వారా గ్రామపంచాయతీకి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతోందని గ్రామస్థులు ఆరోపించారు. అనుమతులు లేనిచోట మట్టి తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో గ్రామస్థులు, మైనింగ్‌ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.


నాలుగేళ్లుగా తవ్వకాలు..

బొబ్బేపల్లి గ్రామ పంచాయతీ పరిఽధిలో 387 సీ 11 సర్వేనంబరులో 300ఎకరాలు గ్రావెల్‌ కొండ ఉంది. అందులో 140 ఎకరాల్లో సన్న, చిన్నకారు రైతులకు సాగుకు పట్టాలు ఇచ్చారు. ఇంకా 150ఎకరాలకుపైగా కొండ ఉంది. అందులో గత నాలుగేళ్ల నుంచి 30ఎకరాల్లో కొంత అధికారికంగా, మరికొంత అనధికారికంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. తద్వారా తవ్వకాలు జరిపిన వారు కోట్లు వెనకేసుకున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏడాది క్రితం గ్రావెల్‌ కొండపై కొత్త వ్యక్తుల పెత్తనం పెరిగింది. ఇద్దరు వ్యక్తులు రంగంలోకి రావడం, వారికి స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లు, అప్పటి ప్రజాప్రతినిధులు సహకరించడంతో గ్రావెల్‌ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాస్తవంగా అనుమతులు పొందిన కొండ స్థలంలో గ్రావెల్‌ అడుగంటింది. దాంతో నిర్వాహకులు కొండ సమీపంలోని పొలాలను కొనుగోలు చేసి, వాటిలో గ్రావెల్‌ను తరలించి అమ్ముకుంటున్నారు. అందులోభాగంగానే గంగా వారి చెరువులో 30 ఏళ్ల క్రితం నుంచి పట్టాలు, పాస్‌బుక్‌లు లేకుండా రైతుల ఆధీనంలో ఉన్న ఉన్న భూములను కొని అందులో గ్రావెల్‌ను తోడుతున్నారు. 

 




Updated Date - 2021-04-10T05:57:49+05:30 IST