జరిమానాలకు.. జంకరు

ABN , First Publish Date - 2021-10-05T04:49:07+05:30 IST

కొండను కొల్లగొడుతున్నారు. అరకొర అనుమతులతో అక్రమంగా తవ్వేస్తున్నారు.

జరిమానాలకు.. జంకరు
లాం కొండపై గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్న ఎక్స్‌వేటర్లు

లాంలో ఆగని గ్రావెల్‌ తవ్వకాలు

తూతూమంత్రంగా అధికారుల చర్యలు 


లాం(తాడికొండ), అక్టోబరు 4: కొండను కొల్లగొడుతున్నారు. అరకొర అనుమతులతో అక్రమంగా తవ్వేస్తున్నారు. ప్రకృతి సంపదను అప్పనంగా దోచుకుంటూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా.. మీడియాలో కథనాలు ప్రచురితమైనా.. జరిమానాలు విధిస్తున్నా.. అక్రమ తవ్వకాలు ఆగడంలేదు. అధికారుల తూతూమంత్రంగా తీసుకుంటున్న చర్యలకు అక్రమార్కులు ఏమాత్రం జంకడంలేదు. మండలంలోని లాం కొండ గ్రావెల్‌ తవ్వకాలకు కేంద్రంగా మారింది. రాజధాని ప్రాంతానికి కూత వేటు దూరంలో, గుంటూరు నగర సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో వెంచర్లు వెలిశాయి. వెంచర్ల అభివృద్ధికి అవసరమైన గ్రావెల్‌ కోసం లాం కొండను తవ్వేస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ అండ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఎక్స్‌కవేటర్లతో ఇష్టం వచ్చినట్లుగా గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నారు. అనుమతులు కొంత ప్రాంతానికి తీసుకుని కొండంతా తవ్వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మీడియాలో కథనాలు వస్తేనే అధికారులు స్పందిస్తున్నారు. అది కూడా అరకొరగా ఉంటున్నాయనే విమర్శలున్నాయి. సెప్టెంబరు 11న మైనింగ్‌, విలిజెన్స్‌ అధికారులు దాడులు చేసి వేబిల్లులు లేవని రూ.30,091లు జరిమానా విధించారు. సెప్టెంబరు 20న దాడులు చేసిన అధికారులు రూ.37 వేలు జరిమానా విధించి, ఒక టిప్పర్‌, మూడు ట్రాక్టర్లు, ఎక్స్‌వేటర్‌ను సీజ్‌ చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ రెండు మూడు రోజులకే యథావిధిగా తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెలను తవ్వేశారు. గ్రావెల్‌ అమ్మకాలకు సంబంధించి నియోజకవర్గంలోని ఓ ముఖ్య నేతకు వాటాలు వెళ్తున్నట్లు సమాచారం. అక్రమ తవ్వకాలతో కొండ చరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని స్థానికులు భయభ్రాంతులకు గురౌతున్నారు.  

Updated Date - 2021-10-05T04:49:07+05:30 IST