మహా అవినీతి

ABN , First Publish Date - 2021-04-23T05:36:58+05:30 IST

బిల్లు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పబ్లిక్‌ వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహా అవినీతి
ఏసీబీకి పట్టుబడిన ఈఈ వెంకటరావు




ఏసీబీ వలలో జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

కాంట్రాక్టర్‌ వద్ద రూ.34 వేలు 

లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంరఽధజ్యోతి): బిల్లు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పబ్లిక్‌ వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోన్‌-8 పరిధిలో గల ప్రహ్లాదపురంలోని విరాట్‌నగర్‌ వెంకటాద్రి రెసిడెన్సీ నుంచి నాగావళి లేఅవుట్‌ వరకూ రూ.38 లక్షలతో వరదనీటి డ్రెయిన్‌ నిర్మాణానికి టెండర్లు పిలవగా రొంగలి అప్పలనాయుడు, అల్లు జగదీశ్‌ అనే ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. వర్కు పూర్తయ్యింది. ఆ జోన్‌లో ఈఈగా పనిచేస్తున్న యూవీ వెంకటరావు పరిశీలించి బిల్లు చెల్లింపునకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే వర్కు విలువలో రూ.నాలుగు లక్షలు జీఎస్టీ కింద పోగా మిగిలిన రూ.34 లక్షలకు ఒక శాతం చొప్పున రూ.34 వేలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్లను వెంకటరావు డిమాండ్‌ చేశాడు. లంచం ఇవ్వకపోతే బిల్లు చెల్లింపునకు సిఫారసు చేయబోనని తేల్చిచెప్పాడు. దీంతో అప్పలనాయుడు సరేనని ఒప్పుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఈఈ వెంకటరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వెంకటరావు నివాసం వుంటున్న కేఆర్‌ఎం కాలనీలోని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌ కోసం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్టు ఇన్‌చార్జి డీఎస్పీ తెలిపారు. కాగా ఏసీబీకి పట్టుబడిన వెంకటరావు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. మరో ఎనిమిది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న తరుణంలో లంచం కోసం డిమాండ్‌ చేయడం విశేషం. ఈ దాడుల్లో సీఐ రమేష్‌, కిషోర్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T05:36:58+05:30 IST