చెరువులకు మహర్దశ!

ABN , First Publish Date - 2021-06-06T03:53:40+05:30 IST

చెరువులకు మంచి రోజులు రానున్నాయి. దశాబ్దాలుగా సరైన నిర్వహణ లేక.. ఆక్రమణల బారిన పడిన చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు - మన చెరువు’ పేరిట ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

చెరువులకు మహర్దశ!
కంచరాంలో చుట్టువాని చెరువు


‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి

జిల్లావ్యాప్తంగా 620 చెరువులు గుర్తింపు

ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

(రాజాం)

చెరువులకు మంచి రోజులు రానున్నాయి. దశాబ్దాలుగా సరైన నిర్వహణ లేక.. ఆక్రమణల బారిన పడిన చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు - మన చెరువు’ పేరిట ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గిరిజన ప్రాంతాలు తప్పించి మిగతా అన్నిచోట్ల చెరువులను బాగు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 620 చెరువులను గుర్తించారు. విస్తీర్ణం, ఆయకట్టు పరిగణనలోకి తీసుకొని రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకూ మంజూరయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 


 ఎట్టకేలకు..

సాగులో చెరువులదే ప్రధాన భూమిక. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉన్నాయి. వీటిపై బ్యారేజీలు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా కాలువలు ఉన్నా, నీటిని నిల్వ చేయడానికి చెరువులు అవసరం. కానీ దశాబ్దాలుగా సరైన నిర్వహణ లేక చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. ఆక్రమణల బారిన పడి కుచించుకుపోయాయి. దీంతో కనిష్ట నీటి నిల్వ చేయలేని స్థితిలోకి మారాయి. గత ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ పథకంలో భాగంగా చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండే ళ్లయినా ఎటువంటి పనులు చేపట్టలేదు. దీనిపై రైతుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. చెరువులు బాగు చేయాలని సంకల్పించింది. మరో వారం రోజుల్లో పనులకు సంబంధించి అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 


 ఆక్రమణలపై దృష్టి పెట్టాలి

ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి. అటువంటి వాటిని సర్వేచేసి అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తినా... రాజకీయ, ఇతరత్రా ఒత్తిళ్లతో వెనుకడుగు వేశారు. ఇప్పటికైనా రికార్డులను అనుసరించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. చెరువులు అభివృద్ధి చేసిన తరువాత గట్లపై మొక్కలు నాటడం, పచ్చదనం పెంపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుండడంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 


వారంలో అనుమతులు

చెరువుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. వారం రోజుల్లో అనుమతులు వస్తాయి. వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. క్టస్టరు స్థాయి సమావేశాలు నిర్వహించి అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నాం.

- హెచ్‌ కూర్మారావు, డ్వామా పీడీ, శ్రీకాకుళం



Updated Date - 2021-06-06T03:53:40+05:30 IST