‘గ్రేటర్‌’ ఎఫెక్ట్‌!

ABN , First Publish Date - 2020-11-30T06:15:34+05:30 IST

ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలు జిల్లా రాజకీయాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. గత వారం రోజుల నుంచి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా రాజధానిలో తమ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు.

‘గ్రేటర్‌’ ఎఫెక్ట్‌!
బంజారాహిల్స్‌లో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

జిల్లాపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావం

అక్కడి ప్రచారంలో బిజీబిజీగా స్థానిక నేతలు 

జిల్లాకు తిరుగు పయనం 

‘గ్రేటర్‌’ ఎన్నికల ఫలితాల అనంతరం తారుమారుకానున్న  జిల్లా రాజకీయాలు

పార్టీ ఫిరాయింపులకు సిద్ధమవుతున్న పలువురు నేతలు

నిర్మల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలు జిల్లా రాజకీయాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. గత వారం రోజుల నుంచి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా రాజధానిలో తమ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే అక్కడి ప్రచార పర్వం, అలాగే రాజకీయ పార్టీల ప్రాబల్య పోరు, నేతల వ్యూహాలు లాంటి అంశాలన్ని జిల్లాకు చెందిన రాజకీయ శ్రేణులపై ఎఫెక్ట్‌ చూపే అవకాశాలున్నాయంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీజేపీలో చేరేందు కు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్‌ నేతలతో పాటు టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తి నాయకులు, గత కొంతకాలం నుంచి పార్టీ లో నిరాధరణకు గురవుతున్న వారు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారంటున్నారు. దుబ్బాక ఎన్నిక ఫలితం క్రేజ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొనసాగించిన దూకుడు, ఆ పార్టీకి జనంలో పెరుగుతున్న క్రేజ్‌ లాంటి పరిణామాలు జిల్లా రాజకీయాలను తలకిందులు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డి, మున్సి పల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేంధర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌తో పాటు గాఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము టీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం నిర్వహించా రు. అలాగే బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, కేంద్ర విత్తన పరిశోధన సంస్థ డైరెక్టర్‌ అయ్యన్నగారి భూమయ్య, గోదావరి కృష్ణ జలాల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రావుల రాంనాథ్‌, తదితరులు ముమ్మరంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలంతా తమ పార్టీ అభ్యర్థుల తరపున హైదరాబాద్‌ లో వారం రోజుల నుంచి మకాం వేయగా.. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు మాత్రం తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. తమ పార్టీకి చెంది న సీనియర్‌ నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార న్న ప్రచారం ఆ పార్టీలో అయోమయానికి తెర లేపింది. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరబోనున్నారన్న ప్రచారం అక్కడి పార్టీ మైనార్టీ కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. మైనార్టీ వర్గంలో బలమైన పట్టున్న మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరినట్లయితే ఆ వర్గం దూరమయ్యే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు బాహటంగా పేర్కొంటున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసు కునే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ బీజేపీ మెజార్టీ కార్పొరేటర్‌ స్థానాలను గెలుచుకున్నట్లయితే, ప్రస్తుతం ఆ పార్టీలో చేరాలని భావిస్తు న్న నాయకులు, వారి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రెట్టింపయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే జరిగితే చాలా మంది బీజేపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకునే అవకాశాలు ఉందన్న ప్రచారం మొదలైంది. బీజేపీ పట్ల యూత్‌లో పెరుగుతున్న క్రేజ్‌, కాంగ్రెస్‌ పార్టీలో నిర్మల్‌ మినహా ముథోల్‌, ఖానాపూర్‌ సెగ్మెంట్‌లలో సరైన నాయకత్వం అందుబాటులో లేని కారణంగా ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. వీరితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీలో కూడా చాలా మంది సీనియర్‌ కేడర్‌ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల నిరాధారణ కారణంగా తమకు పదవులు గాని, ఇతరత్రా ప్రాధాన్యత గాని లభించడం లేదని చాలామంది కార్యకర్తలు బహిరంగంగానే వాపోతున్నారు. ముఖ్యంగా ముథోల్‌, ఖానాపూర్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులే కాకుండా కార్యౄకర్తలు సైతం తమ నేతలపై అసంతృప్తితో రగిలిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి రాజకీ య పరిణామాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావంతో లోకల్‌ రాజకీయాల లు తలకిందులయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

జిల్లాకు తిరుగు పయనమైన నేతలు

కాగా, గత పది రోజుల నుంచి హైదరాబాద్‌లో మకాం వేసి తమ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారంలో పాల్గొన్న అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ఆదివారం రాత్రి జిల్లాకు తిరుగుపయనమయ్యారు. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ సెగ్మెంట్‌లకు చెందిన ఈ రెండు ప్రధాన పార్టీల కేడర్‌ నిర్మల్‌కు చేరుకోగానే కొత్త తరహా రాజకీయ చర్చకు తెరలేపబోనున్నారంటున్నారు. అక్కడి ప్రచారంలో తమకు ఎదురైన చేదు అనుభవనాలు, పార్టీ పట్ల వెల్లడైన సానుకూలత లాంటి అంశాలపై జోరుగా చర్చ మొదలుకానుంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ  ఎన్నికల ప్రచారం జిల్లా అంతటా హాట్‌ టాఫిక్‌ అయిన సంగతి తెలిసిందే. అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ కేడర్‌ తమ పార్టీ నేతల ప్రచారాన్ని తిలకించేందుకు టీవీలు, సోషల్‌ మీడియాను ఆశ్ర యించారు. ముఖ్యంగా శనివారం జరిగిన కేసీఆర్‌ బహిరంగ సభ, ఆది వారం జరిగిన అమిత్‌షా రోడ్‌ షోలను ఆయా పార్టీల కేడర్‌ ఆసక్తిగా తిలకించడం గమనార్హం. అయితే వీరిలో చాలా మంది తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో తమ అభ్యర్థుల పరిస్థితిని వారి గెలుపోటముల అవకాశాలను స్థానికంగా విశ్లేషించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఫలితాలు 4వ తేదీన వెలువడనుండడంతో అప్పటి వరకు ఓ తరహా చర్చ, ఆ తరువాత మరో తరహా చర్చ జరిగే అవకాశాలున్నాయి. క్రమంగా రాజకీయాల్లో ఈ చర్చల ప్రభావం సైతం ఉండే అవకాశం ఉందంటున్నారు. 

ఇక సోషల్‌ మీడియా అస్త్రంగా..

ఇదిలా ఉండగా.. మొన్నటి దుబ్బాక ఎన్నికలు, ఈనెల 1న జరగను న్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషించిందన్నది బహిరంగ రహస్యమే. దుబ్బాక ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల నేతల రోడ్‌షోలు, బహిరంగ సభలు, డిబెట్‌లు లాంటి కార్యక్రమాలకు వారివారి పార్టీల నుంచే కాకుండా సాధారణ వ్యక్తులు సైతం ఆసక్తిగా ఫాలో అయ్యారు. ఈ రెండు ఎన్నికల ప్రభావంతో ఇక నుంచి అన్ని పార్టీలు సోషల్‌ మీడియానే అస్త్రంగా మలుచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ ఆయన అనుచరులు పెద్దఎత్తున సోషల్‌ మీడియా ద్వారా ప్రచారాన్ని వైరల్‌ చేశారు. మహేశ్వర్‌ రెడ్డి అనుమతి లేకుండానే బీజేపీ వైపు ఆకర్షితులవుతున్న ఆయన అనుచరు లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కొత్త తరహా ప్రచారానికి తెర లేపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలను సైతం ఇక్కడి  టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు ప్రతిరోజూ సోషల్‌ మీడియా ద్వారా పెద్దఎత్తున వైరల్‌ చేశాయి. ఇలాంటి పరిణామాల కారణంగా భవిష్యత్‌ లో సోషల్‌ మీడియాను టీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ ప్రధాన అస్త్రంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 

పార్టీ ఫిరాయింపులకు పలువురు నేతలు సిద్ధం!!

దుబ్బాక ఎన్నికల ఫలితం, జీహెచ్‌ఎంసీలో ప్రచార జోరు కారణంగా బీజేపీ వైపు కాంగ్రెస్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌లోని కొంతమంది అసంతృప్త కేడర్‌ ఎదురుచూస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే నిర్మల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, పెంబి మండల జడ్పీటీసీ సభ్యురాలు జానుభాయి, ముథోల్‌కు చెందిన మోహన్‌రావు పటేల్‌తో పాటు తదితరులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే వారి అనుచరులు కూడా దీనిని ధ్రువీకరిస్తూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలంతా తమ తమ అనుచరులతో ఇప్పటికే మంతనాలు కూడా మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఓ దశలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది సీనియర్‌ నేతలంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరబోతున్నారన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. జీహెచ్‌ఎంసీ ప్రచారానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు వీరిని తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఆదివారం వరకు ఏ ఒక్క అగ్రనేత కూడా జిల్లా నేతలతో చర్చించడం గానీ, చేరికల విషయంలో గ్రీన్‌ సిగ్నల్‌ జారీ చేయడం గానీ లాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. అయితే రాబోయే ఫిబ్రవరి వరకు ఈ నాయకులంతా వేచి చూసే ధోరణిని పాటించి, ఆ తరువాత బీజేపీలో చేరే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

Updated Date - 2020-11-30T06:15:34+05:30 IST