Har Ghar Jal Utsav : ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా శ్రమపడనక్కర్లేదు... : మోదీ

ABN , First Publish Date - 2022-08-19T21:24:32+05:30 IST

దేశం గురించి పట్టించుకోనివారు, ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల

Har Ghar Jal Utsav : ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా శ్రమపడనక్కర్లేదు... : మోదీ

న్యూఢిల్లీ : దేశం గురించి పట్టించుకోనివారు, ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు.  పనజీలో శుక్రవారం జరిగిన ఇంటింటా తాగునీటి ఉత్సవం (Har Ghar Jal Utsav)లో ఆయన వర్చువల్ విధానంలో పాల్గొని, మాట్లాడారు. 


జల జీవన్ మిషన్ (Jal Jeevan Mission) క్రింద గత మూడేళ్ళలో తన ప్రభుత్వం దాదాపు ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, నీటి కనెక్షన్లను ఇచ్చిందని చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 10 కోట్ల కనెక్షన్లను ఇచ్చినట్లు చెప్పారు. 


దేశ నిర్మాణానికి శ్రమించడం తప్పనిసరి

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా శ్రమపడవలసిన అవసరం లేదని, అయితే దేశాన్ని నిర్మించడానికి కఠోర శ్రమ తప్పనిసరి అని తెలిపారు. తాము దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు. అందుకే తాము ప్రస్తుత, భవిష్యత్తు సమస్యలను, సవాళ్ళను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. దేశం గురించి పట్టించుకోనివారు దేశం ఎదుర్కొంటున్న, ఎదుర్కొనబోతున్న సవాళ్ళను కూడా పట్టించుకోరని తెలిపారు. అలాంటివారు నీటి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, ఆ మాటలను అమలు చేసేందుకు గొప్ప దార్శనికతతో పనిచేయరని అన్నారు. 


గోవాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు (నూటికి నూరు శాతం కుటుంబాలకు) కొళాయి నీటిని అందజేయాలన్న లక్ష్యం సాకారమైనందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వీడియో లింక్ ద్వారా మోదీ మాట్లాడారు.  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant), కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ (Gajendra Singh Shekhawat) పనజీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T21:24:32+05:30 IST