నోట్లు.. దొంగ ఓట్లు!

ABN , First Publish Date - 2020-12-01T04:20:41+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్ని కల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు తమ మద్దతుదారుల గెలుపుకోసం సరికొత్త ఎత్తు గడలు వేస్తున్నారు.

నోట్లు.. దొంగ ఓట్లు!

  • శివార్ల నుంచి భారీగా ఓటర్ల తరలింపు 
  • గ్రేటర్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నేతలే కీలకం
  • నోట్ల పంపిణీలోనూ వీరిదే ‘పైచేయి’


గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. ఉమ్మడి జిల్లా నేతలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నగరంలో తిష్టవేసి మరీ జోరుగా ప్రచారం చేశారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. ఓటుకు నోటు పంచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సొంత డబ్బును ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. మరికొందరు నేతలు దొంగ ఓటర్లను సృష్టించి శివార్ల నుంచి నగరానికి తరలిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్ని కల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు తమ మద్దతుదారుల గెలుపుకోసం సరికొత్త ఎత్తు గడలు వేస్తున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ నగరంలోనే తిష్టవేసి తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు పన్నుతున్నారు. ఓట్ల కొనుగోలులోనూ కొందరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు దొడ్డిదారిన ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర శివార్ల నుంచి ఆయా పార్టీలకు చెందిన వేలాది మంది నేతలు నగరంలో మకాం వేసి తమ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు శివార్లలోని తమ కేడర్‌ మొత్తాన్ని గ్రేటర్‌ ఎన్నికల కోసం దించిన విషయం తెలిసిందే. ప్రచారం ముగిసిన తరువాత బయట వ్యక్తులు నగరం విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించినప్పటికీ ఎవరూ ఖాతరు చేయడం లేదు. అనేకమంది బంధువుల ఇళ్లలో తిష్టవేసి ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్‌, షాద్‌నగర్‌, మెయినాబాద్‌, చేవేళ్ల, కుత్బుల్లాపూర్‌, బాచుపల్లి, మేడ్చల్‌, కీసర, ఘట్‌కేసర్‌, శామీ ర్‌పేట, మూడుచింతలపల్లి, మేడి పల్లి, దుండిగల్‌ మండలాలకు చెందిన నేతలకు ఆయా పార్టీలు గ్రేటర్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలతోపాటు ద్వితీయ శ్రేణి నేతలంతా గ్రేటర్‌ ఎన్నికల్లో తలమునకలయ్యారు. భవిష్యతులో రాజకీయ అవకా శాలు మెరుగు పరుచుకునేందుకు తమకు అప్పగించిన బాధ్య తలను నెరవేర్చే యత్నం చేస్తున్నారు. కొందరైతే గ్రేటర్‌లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సొంత డబ్బును కూడా ఖర్చు పెడుతున్నారు.  కొందరు ఇప్పటికే గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల కోసం  రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు.  ఉమ్మడిజిల్లాకు చెం దిన కొందరు నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని  తాము బాధ్యతలు తీసుకున్న ప్రాంతంలో తమ అభ్యర్థుల గెలుపు కోసం ధారాళంగా ఖర్చుచేస్తున్నారు. డబ్బుతోపాటు మద్యం కూడా ఈ ప్రాంతాల నుంచే భారీగా తరలించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించడంతో సోమ వారం శివా రు ప్రాంతాల నుంచి హైదరా బాద్‌కు భారీగా మద్యం తరలివెళ్లింది.


గ్రేటర్‌లో ఓట్ల నమోదు

ఆయా పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు ముందుచూపుతో నగర శివార్లలోని కొందరిని తమ డివిజన్లలో ఓటర్లుగా నమోదు చేయించారు. ఎన్నికలరోజు తొలి రెండు, మూడుగంటల్లో వీరి ఓట్లు పోలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేయించేందుకు కూడా ప్లాన్‌చేశారు. శివారు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రేటర్‌ వార్డులకు సంబంధించిన అనేకమంది అభ్యర్థులు ఇదే పంథా అనుసరించారు. ఒక్కో అభ్యర్థి కనీసం రెండు వేల నుంచి మూడు వేల ఓట్లు ఇతర ప్రాంతాలకు చెందిన వారి పేర్లతో నమోదు చేయించారు. ఓ పార్టీ అయితే గెలుపుపై అనుమానం ఉన్న డివిజన్లలో ఈ ప్లాన్‌ అమలు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. నగర శివార్లలోని అనేక మండలాలకు చెందిన వేలాది మంది నేడు జరిగే గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ...ఈ పార్టీ.. అని లేకుండా తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఈ తరహా ఎత్తుగడ వేశారు.

Updated Date - 2020-12-01T04:20:41+05:30 IST