పూర్‌ పోలింగ్‌

ABN , First Publish Date - 2020-12-02T05:37:59+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువగా 43శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది.

పూర్‌ పోలింగ్‌
ఓటర్లు ఎవరూ రాకపోవడంతో బోసిపోయిన శేరిలింగం పల్లిలోని పోలింగ్‌ బూత్‌

  • శివార్లలో భారీగా తగ్గిన ఓటింగ్‌
  • ఓటు వేయడానికి ఆసక్తి చూపని పట్టణ ఓటర్లు 
  • జోరుగా ప్రచారం చేసినా పెరగని ఓటింగ్‌ శాతం.. పార్టీల్లో టెన్షన్‌ 
  • గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..


గ్రేటర్‌ ఎన్నికల ఓటింగ్‌ శాతం భారీగా తగ్గింది. గత ఎన్నికల కంటే ఈసారి అతి తక్కువగా నమోదైంది.  శివారు ప్రాంతాల్లో కూడా భారీగా ఓటింగ్‌ తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగ్‌శాతం పెంచేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవేమీ పనిచేయలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేసినప్పటికీ పట్టణవాసులు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. నాలుగు రోజులు వరుస సెలవులు రావడం కూడా ఓటింగ్‌ శాతం నమోదుపై దెబ్బపడింది. 


(ఆంధ్రజ్యోతి,రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : గ్రేటర్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువగా 43శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ పెంచేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృత ప్రచారం చేసినప్పటికీ పట్టణ ఓటర్లు ఓటువేసేందుకు నిరాసక్తత చూపారు. దీంతో అనేకచోట్ల అత్యల్ప ఓటింగ్‌ నమోదైంది.  సాధా రణంగా అత్యధిక ఓటింగ్‌ జరిగే శివారు ప్రాంతాల్లో కూడా భారీగా ఓటింగ్‌ తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదైన రాజేంద్రనగర్‌ డివిజన్‌లో ఈసారి అత్యల్పంగా ఓటింగ్‌ నమోదుకావడం గమ నార్హం. అలాగే శివార్లలోని అనేక డివిజన్లలో ఓటింగ్‌ నామ మాత్రంగానే జరిగింది. ఓటింగ్‌శాతం పెంచేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవేమీ పనిచేయలేదు. ఈసారి పట్టణ ఓటరు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. మంగళవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌.. సాయం త్రం వరకు అలానే కొనసాగింది. సాయంత్రం ఆరుగంటల వరకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్‌లో 43శాతానికి పైగా ఓటింగ్‌ జరిగింది. ఇంకా తుది ఓటింగ్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈసారి శివార్లలో కూడా భారీగా ఓటింగ్‌ తగ్గింది. ఓటింగ్‌శాతం పెంచేందుకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో పోలింగ్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌ సౌకర్యం కల్పించారు. అలాగే యాప్‌ల ద్వారా ఓటు ఎక్కుడ ఉందో తెలుసుకునే సౌలభ్యం కలిగించారు. అయితే నగర ఓటర్లు మాత్రం బద్ధకం వీడలేదు. విద్యావంతులు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఎప్పటిలాగే గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ శాతం ఆశించినస్థాయిలో నమోదు కాలేదు. గత ఎన్నికల్లో  అత్యధికంగా 67.4శాతం ఓట్లు పోలైన రాజేంద్రనగర్‌ డివిజన్‌లో ఈసారి 49.04 శాతమే ఓటింగ్‌ జరగడం విశేషం. ఐటీ కంపెనీలు, బహుళ జాతీయ సంస్థల ఉద్యోగులకు నెలవైన ప్రాంతాల్లో భారీగా ఓటింగ్‌ తగ్గింది. ఇదిలాఉంటే శివార్లలో అనేకచోట్ల అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.  శివార్లలో ఓటింగ్‌ తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనేదానిపై రాజ కీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుం టున్నారు. యువత, ఉద్యోగులపై  ఆశలు పెట్టుకున్న బీజేపీ.. వీరి ఓటింగ్‌ అధికంగా జరిగిన చోట తమ గెలుపునకు ఢోకా ఉండదని చెబుతోంది. అలాగే బస్తీల్లో ఓటింగ్‌ అధికంగా జరిగిన చోట తమకు లాభిస్తుందని అధికార పార్టీ అంచనాలు వేసుకుంటోంది. అయితే ఓటింగ్‌ భారీగా తగ్గడం అన్ని పార్టీల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. కౌంటింగ్‌ వరకు ఈ టెన్షన్‌ భరించాల్సిందేనని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. 


శివార్లలోని డివిజన్లలో నమోదైన పోలింగ్‌ శాతం

రాజేంద్రనగర్‌             49.04

చర్లపల్లి             51.61

రామంతాపూర్‌             50.87

డాక్టర్‌ ఏఎస్‌.రావునగర్‌    46.31

అత్తాపూర్‌     55.38

గాజులరామారం     58.61

మచ్చబొల్లారం             52.11

హఫీజ్‌పేట     22.14

కొండాపూర్‌     24.18

హయత్‌నగర్‌             50.72

బీఎన్‌రెడ్డి నగర్‌             48.78

వనస్థలిపురం             47.93

హస్తినాపురం             49.20

చంపాపేట     48.31



Updated Date - 2020-12-02T05:37:59+05:30 IST