గ్రేటర్‌.. టార్గెట్‌గా..!

ABN , First Publish Date - 2020-02-02T05:53:00+05:30 IST

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పక్కా ప్లాన్‌గా రంగంలోకి దిగుతోంది. ఎన్నికలు జరుగుతాయో.. లేదో..? అన్న అనుమానాల్లో ప్రతిపక్షాలు ఉండగానే అస్త్ర శస్ర్తాలు సిద్ధం చేసుకొని అధికార పార్టీ కదన రంగంలోకి దూకుతోంది. పుర పోరులోనూ పక్కా ప్లాన్‌ అమలు చేసింది.

గ్రేటర్‌.. టార్గెట్‌గా..!

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పక్కా ప్లాన్‌గా రంగంలోకి దిగుతోంది. ఎన్నికలు జరుగుతాయో.. లేదో..? అన్న అనుమానాల్లో ప్రతిపక్షాలు ఉండగానే అస్త్ర శస్ర్తాలు సిద్ధం చేసుకొని అధికార పార్టీ కదన రంగంలోకి దూకుతోంది. పుర పోరులోనూ పక్కా ప్లాన్‌ అమలు చేసింది. ఊహించిన స్థాయిలో ఓట్లు రాకున్నా.. ఒకటి, రెండు తప్ప దాదాపు అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు దక్కించుకుంది. ఇక్కడే అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఎన్ని సీట్లు గెలిచామన్న దాని కంటే ఎన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామన్న దానికే ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆ దిశగానే టీఆర్‌ఎస్‌ పావులు కదిపింది. స్వతంత్రులు, విపక్షాల సభ్యులను తమ వైపు తిప్పుకోవడంతోపాటు.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్స్‌ అఫీషియో ఓట్లతో మెజార్టీ మేయర్‌, చైర్మన్‌ పదవులను దక్కించుకుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌ పక్కన ఉన్న పురపాలక సంస్థలపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. యేడాదిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న మునిసిపాల్టీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగిరితే... ఆ ప్రభావం మహానగర ఎన్నికలపై పడుతుందని, ఇదే వేవ్‌ కొనసాగుతుందన్నది అధికార పార్టీ రాజకీయ వ్యూహంగా చెబుతున్నారు.

తగ్గిన ఓట్లు.. దక్కిన పీఠాలు....

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి 47.47 శాతం ఓట్లు వచ్చాయి. శివారు నియోజకవర్గాల్లో సగటు ఓటింగ్‌ శాతమూ రమారమిగా అంతే ఉంది. మునిసిపల్‌ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం 45 శాతంలోపే ఉందని అంచనా. మొత్తంగా గెలుచుకున్న వార్డులు కూడా 50 శాతంలోపే ఉండగా.. దక్కించుకున్న మేయర్‌, చైర్మన్‌ పదవులు 90 శాతానికిపైగా ఉన్నాయి. స్థానిక సంస్థల్లో రికార్డు స్థాయి విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. వచ్చిన ఓట్లు.. గెలిచిన వార్డుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తే అనుకున్న స్థాయిని చేరుకోలేకపోయామని అంతర్గత సంభాషణల్లో చర్చిస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో కారు జోరు కనిపించ లేదు. కాంగ్రెస్‌ కొంత చతికిలపడగా.. బీజేపీ ఓటింగ్‌లో పెరుగుదల కనిపిస్తోంది. గ్రేటర్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లకుగానూ అన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఏడు మునిసిపాల్టీల్లో ఐదు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లు అయ్యారు. అన్ని కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు గెలుచుకోవడం ద్వారా తమకు ఎదురులేదన్న సందేశం ఇవ్వడంలో అధికార పార్టీ వంద శాతం సక్సెస్‌ అయ్యింది. ఇదే అంశాన్ని ప్రచారం చేస్తూ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గ్రేటర్‌పైనా గులాబీ జెండా పాతాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా చెబుతున్నారు.

ఆ నియోజకవర్గాల్లో...

బోడుప్పల్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్లను దక్కించుకోవడం వల్ల గ్రేటర్‌ ఎన్నికల్లో పక్కనే ఉన్న ఉప్పల్‌ నియోజకవర్గంలో తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జవహర్‌నగర్‌లో విజయం ప్రభావం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉంటుందన్నది వారి అంచనా. నిజాంపేట కార్పొరేషన్‌, దుండిగల్‌, కొంపల్లి మునిసిపాల్టీల్లో విజయం.. కుత్బుల్లాపుర్‌లో ఎక్కువ డివిజన్లు గెలిచేందుకు దోహదపడుతుందనుకుంటున్నట్టు సమాచారం. నార్సింగి, బండ్లగూడ జాగీర్‌లో గెలుపుతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీస్తాయన్నది నేతల యోచనగా చెబుతున్నారు. మీర్‌పేట, బడంగ్‌పేటలో విజయాలు పక్కన ఉండే ఎల్‌బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందన్నది వారి భావన. ఈ విజయాల ప్రభావం గ్రేటర్‌ ఎన్నికలపై ఎంత మేర ఉంటుందో కానీ.. మేయర్‌, చైర్మన్‌ పీఠాలు దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏ‘మార్చా’రు...

పెద్దఅంబర్‌పేటలో 24 స్థానాలకుగానూ 13 వార్డులు గెలచుకున్న కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవి కైవసం చేసుకోవాల్సి ఉండగా.. ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరును అవకాశంగా మార్చుకున్న టీఆర్‌ఎస్‌ ఓ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకొని చైర్మన్‌ పీఠం దక్కించుకుంది. మద్దతిచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఒకరికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.

మీర్‌పేటలో కేవలం 19 స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకొని 16 చోట్ల గెలిచిన బీజేపీకి చెక్‌ పెట్టింది.

18 వార్డులున్న నార్సింగిలో ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌, ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకున్న టీఆర్‌ఎస్‌ మునిసిపాల్టీని దక్కించుకుంది.

బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో 28 స్థానాలకుగానూ టీఆర్‌ఎస్‌ 14 చోట్ల గెలిచింది. రెబెల్స్‌గా గెలిచిన పలువురితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓటుతో ఇక్కడ ఆ పార్టీ పీఠం కైవసం చేసుకుంది.

Updated Date - 2020-02-02T05:53:00+05:30 IST