గ్రీన్‌ అంబాసిడర్ల.. గగ్గోలు

ABN , First Publish Date - 2022-07-01T05:50:55+05:30 IST

గ్రీన్‌ అంబాసిడర్లు .. వారు లేకపోతే ఎక్కడి చెత్త అక్కడే. వీధులు, నివాస ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతాయి. ఏ రోజుకారోజు చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించి నిర్ధేశిత ప్రాంతానికి తరలిస్తూ పర్యావరణ పరిశుభ్రతకు కృషి చేస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పర్యవేక్షకులు. ప్రతిరోజూ వేకువజామునే ఇల్లిల్లూ, వీధివీధీ తిరిగి చెత్తను సేకరిస్తుంటారు.

గ్రీన్‌ అంబాసిడర్ల.. గగ్గోలు
బ్రాహ్మణపల్లి గ్రామాల్లో చెత్తను సేకరిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

వేతనాలు అడిగితే బెదిరింపులు

8 నెలలుగా జీతాలు రాక పస్తులు

వర్క్‌డౌన్‌కు సిద్ధమవుతున్న కార్మికులు

పిడుగురాళ్ల, జూన్‌ 30: గ్రీన్‌ అంబాసిడర్లు .. వారు లేకపోతే ఎక్కడి చెత్త అక్కడే. వీధులు, నివాస ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతాయి. ఏ రోజుకారోజు చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించి నిర్ధేశిత ప్రాంతానికి తరలిస్తూ పర్యావరణ పరిశుభ్రతకు కృషి చేస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పర్యవేక్షకులు. ప్రతిరోజూ వేకువజామునే ఇల్లిల్లూ, వీధివీధీ తిరిగి చెత్తను సేకరిస్తుంటారు. గ్రామాలు, వీధులన్నీ శుభ్రంగా ఉంటున్నాయంటే వారే కారణం.  అలాంటి గ్రీన్‌ అంబాసిడర్లు ఎనిమిది నెలలుగా జీతాలు లేక గగ్గోలు పెడుతున్నారు. కుటుంబం గడవక, మరో ఉపాధి మార్గంలేక సతమతమవుతున్న కార్మిక వర్గ కుటుంబాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సుమారు 250 మంది గ్రీన్‌ అంబాసిడర్లను నియమించుకున్నారు. ప్రతినెల రూ.6 వేల జీతాన్ని ఠంచన్‌గా చెల్లిస్తామని చెప్పి పనిలో నియమించుకున్నారు. అయితే ఎనిమిది నెలల నుంచి జీతం కోసం  కార్మికులు ఎదురుచూస్తున్నారు. జీతాలు అడిగితే కొత్తవారిని పనిలో పెట్టుకుంటామని 


బెదిరిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఉపాధి పోతుందేమోనన్న భయంతో ఉన్నారు. పనికి ఆలస్యంగా వచ్చినా, గైర్హాజరైనా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అదే జీతం గురించి మాత్రం పట్టించుకోరని గ్రీన్‌ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని వారాలు చూసీ జీతాలు ఇవ్వకపోతే వర్క్‌డౌన్‌ సిద్ధమవుతామని పలువురు కార్మికులు చెప్తున్నారు. 

ఎలా బతకాలి 

నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. జీతాలు ఎప్పుడు అడిగినా ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప చెల్లించడం లేదు. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మావంతు పాత్ర పోషిస్తున్నా కుటుంబం గడవని స్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. -దాసరి జగన్నాథం 

జరుగుబాటు కష్టం 

జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. మరో పనికి వెళ్లలేక అలవాటైన పనిని తప్పనిసరై చేయాల్సి వస్తుంది. మరికొద్ది రోజులు జీతాలు చెల్లించకుంటే ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం.  -తాళ్లూరి మల్లేశ్వరి, బ్రాహ్మణపల్లి 


జీతాలు ఇవ్వకుంటే మానేస్తాం 

ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎట్లా బతికేది. ఇప్పటికే అనేక సార్లు జీతాలు అడిగాం. గ్రామాల్లో పరిశుభ్రత ఉంది. జీవితాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. - ఆలేటి అక్కమ్మ, బ్రాహ్మణపల్లి 


Updated Date - 2022-07-01T05:50:55+05:30 IST