హైదరాబాద్‌కు ‘హరిత’ ఘాతం!

ABN , First Publish Date - 2022-05-25T06:11:36+05:30 IST

చెరువులకు చేటు చేయడం న్యాయమేనా? పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన న్యాయ సంస్థలు ప్రజలకు న్యాయం చేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ముందుగా రెండు జీవోల గురించి తెలుసుకోవల్సివున్నది....

హైదరాబాద్‌కు ‘హరిత’ ఘాతం!

చెరువులకు చేటు చేయడం న్యాయమేనా? పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన న్యాయ సంస్థలు ప్రజలకు న్యాయం చేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ముందుగా రెండు జీవోల గురించి తెలుసుకోవల్సివున్నది. మొదటిది జీవోఎమ్ఎస్ 111. 1996 మార్చి 3న జారీ చేసిన ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం జంట నగరాల తాగునీటి జలాశయాలు అయిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు పది కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న తటస్థ మండలంలో భవన నిర్మాణాలు నిషిద్ధం. రెండోది జీవో 69. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 12న జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్రస్తావిత తటస్థ మండలంలో భవన నిర్మాణాలపై ఆంక్షలను తొలగించింది. అయితే తన ఈ నిర్ణయానికి ఎటువంటి చట్టబద్ధ మద్దతును గానీ, నిపుణుల సంఘం ఆమోదాన్ని గానీ తెలంగాణ సర్కార్ నేటి వరకు నివేదించలేదు.


పాలకులు హద్దు మీరారని, చట్టోల్లంఘనలకు పాల్పడ్డారని నగర ప్రజలు భావించారు. సంభావ్య సమస్యల నివారణకై న్యాయవ్యవస్థను ఆశ్రయించారు. జీవో 111 నిషేధించిన చట్ట విరుద్ధ నిర్మాణాల విషయమై న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రిన్సిపల్ బెంచ్ 2018లో ఒక విచిత్ర, కాదు, విపరీత, అంతే కాదు, ఒక వికృత వైఖరిని వ్యక్తం చేసింది. పర్యావరణాన్ని కాపాడే విషయమై మన న్యాయ వ్యవస్థ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదా, లేదా అన్నదానిపై ఎన్‌జిటి వైఖరి మన మహానగర వాసులకు కనువిప్పు కలిగించే సంఘటనగా చెప్పక తప్పదు.


ఎందుకని? 2017లో చెన్నైలోని ఎన్‌జిటి దక్షిణాది బెంచ్ నుంచి తనకు బదిలీ చేసిన ఒక పిటిషన్ పట్ల ఎన్‌జిటి ప్రిన్సిపల్ బెంచ్ ప్రతి స్పందించిన తీరుతెన్నులు పరిశీలించడం ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుంది. దక్షిణాది బెంచ్ నుంచి ప్రిన్సిపల్ బెంచ్‌కు బదిలీ అయిన పిటిషన్ ప్రధాన అభ్యర్థన: ఇంచుమించు శతాబ్ది చరిత్ర గల ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ. మరింత స్పష్టంగా చెప్పాలంటే 1996 మార్చి 8న జారీ అయిన జీవో 111ని కచ్చితంగా అమలుపరచడమే. 


ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల ఆరగాణిలో పది కిలోమీటర్ల పరిధి ప్రాంతంలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయని ఆ ఉత్తర్వు మొదటి అనుబంధం పేర్కొంది. ఈ గ్రామాలలో మొత్తం 1.32 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి ఉంది. ఈ మొత్తం విస్తీర్ణంలో ఎటువంటి భవన నిర్మాణం చేపట్టకూడదని జీవో 111 నిర్దేశించింది. ఆ నిషిద్ధ పాంతంలోని చట్టవిరుద్ధ, అనధికారిక నిర్మాణాలను తొలగించాలని ఏడు అధికార సంస్థలను ఆదేశించాలని ఎన్‌జిటి దక్షిణాది బెంచ్‌ను 2016 మార్చి 17న ఒక అఫిడవిట్ ద్వారా అభ్యర్థించడం జరిగింది. ఆ ఏడు అధికారిక సంస్థలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం; హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్‌మెంట్ అథారిటీ; సరస్సుల పరిరక్షణ కమిటీ; రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తహసీల్దార్, జిల్లా పంచాయత్ అధికారి, పంచాయత్ కార్యదర్శి. మరి 2018, డిసెంబర్ 19న ఎన్‌జిటి ప్రిన్సిపల్ బెంచ్ అంతిమ తీర్పు చూడండి: ‘ఉన్నతాధికార సంఘం ఒకటి తనకు నివేదించిన పరిశీలనాంశాలపై త్వరితగతిన విచారణ నిర్వహించి ఆరు నెలలలోగా తన సిఫారసులను నివేదిస్తుంది’.


ఒకే కేసులో ఎన్‌జిటి దక్షిణాది బెంచ్ 2016లోను, ప్రిన్సిపల్ బెంచ్ 2018లోను జారీ చేసిన ఉత్తర్వులను నిశితంగా పరిశీలించండి. అవి భిన్నంగా లేవూ?! అనధికారిక నిర్మాణాల విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని, జీవో 111 నిర్దేశించిన పది కిలోమీటర్ల పరిధిలోని నిషిద్ధ తటస్థ మండల ప్రాంతాలలోని అక్రమ నిర్మాణాల సమగ్ర జాబితాను సమర్పించాలని అధికారిక ప్రతివాదులను దక్షిణాది బెంచ్ ఆదేశించింది. న్యూఢిల్లీలోని ఎన్‌జిటి ప్రిన్సిపల్ బెంచ్ న్యాయమూర్తులు 2018 డిసెంబర్ 15న అదే కేసులో జారీ చేసిన ఆదేశంలో ఇలా పేర్కొన్నారు: ‘ఈ అభ్యర్థన ప్రధానంగా ప్రభుత్వ విధాన పరిధిలోని వ్యవహారం. ప్రస్తుత దశలో ఈ వివాదంలోకి ఎన్‌జిటి ప్రవేశించడం నిష్ప్రయోజనమవుతుంది’.


దక్షిణాది బెంచ్ 2016 మార్చి 17న జారీ చేసిన ఒక ఆదేశంలో నొక్కి చెప్పిన ఒక అంశాన్ని ప్రిన్సిపల్ బెంచ్ గమనంలోకి తీసుకోలేదన్నది స్పష్టం. ఇదీ ఆ అంశం: ‘జీవో 111 చట్టబద్ధతను సుప్రీంకోర్టు 2000 డిసెంబర్ 22న ఎపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెర్సెస్ ప్రొఫెసర్ ఎమ్‌వి నాయుడు కేసులో వెలువరించిన తీర్పులో సమర్థించింది’. అదే ఏడాది మే 16న ఎన్‌జిటి దక్షిణాది బెంచ్ జారీ చేసిన మరో ఆదేశంలో ‘జీవో 111లో పేర్కొన్న సకల ప్రాంతాలలోనూ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని’ స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ అనేది ‘ప్రభుత్వ విధాన పరిధి’లోని వ్యవహారమని, దానిలో తాము జోక్యం చేసుకోవడమనేది నిష్ప్రయోజనమవుతుందని’ ప్రిన్సిపల్ బెంచ్ భావించడం మహానగర పౌరులను కలవరపెడుతోంది. మరింత కచ్చితంగా చెప్పాలంటే వారిని బాగా గందరగోళపరుస్తోంది. పర్యావరణ నిపుణుల నివేదికలను నిరాకరించేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రిన్సిపల్ బెంచ్ అనుమతించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సహజన్యాయసూత్రాలకు అనుగుణంగా ప్రిన్సిపల్ బెంచ్ వ్యవహరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఎన్‌జిటి ప్రిన్సిపల్ బెంచ్ తన కర్తవ్య పాలనను సక్రమంగా నిర్వర్తించలేదు. దక్షిణాది బెంచ్ ఆదేశాలపై అక్రమ కట్టడాల విషయమై అధికారులు నెల రోజులలోగా సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ప్రిన్సిపల్ బెంచ్ అశ్రద్ధ మరింత కొట్టిచ్చినట్టు కనిపిస్తుందనడంలో సందేహం లేదు. 2016 మార్చి 17న దక్షిణాది బెంచ్ జారీ చేసిన ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయత్ అధికారి సంబంధిత నిషిద్ధ ప్రాంతంలోని అక్రమకట్టడాల విషయమై సర్వే నిర్వహించి అదే ఏడాది ఏప్రిల్ 23న వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. లే అవుట్‌లు, కట్టడాల విషయమై సమగ్ర సమాచారాన్ని వారు అందించారు. ఆ నిషిద్ధ ప్రాంతంలో మొత్తం 426 లే అవుట్‌లు, 12,332 కట్టడాలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వీటిలో చట్టవిరుద్ధమైనవి, అక్రమమైనవి ఉన్నాయని అధికారులు లిఖిత పూర్వకంగా నివేదించినప్పుడు అక్రమకట్టడాలను తొలగించాలని ప్రిన్సిపల్ బెంచ్ ఎందుకు ఆదేశించలేదు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం గానీ, 2000 డిసెంబర్ 26న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశం ప్రకారం గానీ, జీవో 111 నిర్దేశాల ప్రకారం గానీ ప్రిన్సిపల్ బెంచ్ ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు? 


ప్రిన్సిపల్ బెంచ్‌ను ఎన్‌జిటి చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడే విషయంలో దానికి విస్తృత అధికారాలు చట్టబద్ధంగా సంక్రమించాయి. మరి 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు సమర్థించినా, 2016లో ఎన్‌జిటి దక్షిణాది బెంచ్ ఆమోదించినా, అనధికారిక నిర్మాణాలు జరిగాయని 2016లో ప్రతివాదులైన అధికారులు అంగీకరించినా 2018లో జీవో 111 అమలు అంటే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ ‘ప్రభుత్వ విధాన పరిధి’లోని అంశమెలా అయిందో హైదరాబాద్ ప్రజలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. తన విధ్యుక్త ధర్మ నిర్వహణను ఒక ‘నిరర్థక చర్య’గా ఆ జాతీయ పర్యావరణ న్యాయపీఠం ఎలా ప్రకటించింది? ఇది, ప్రిన్సిపల్ బెంచ్ తన కర్తవ్య నిర్వహణను పూర్తిగా ఉపేక్షించడమేకాదా? 2018లో ప్రిన్సిపల్ బెంచ్ వ్యవహరించిన తీరు వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 విధించిన ఆంక్షలు అన్నిటినీ తొలగించేందుకు సాహసించిందనడం సత్యంకాదా? ఏమైనా ప్రిన్సిపల్ బెంచ్ వ్యవహరించిన తీరు హైదరాబాద్ ప్రజలకు తీవ్ర ఆశా భంగం కలిగించిందనడంలో సందేహం లేదు. 

డాక్టర్ లూబ్నా సార్వత్

రాష్ట్ర అధ్యక్షురాలు, వాటర్ రీసోర్సెస్ కౌన్సిల్

ఉమెన్స్ ఇండియన్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

Updated Date - 2022-05-25T06:11:36+05:30 IST