గ్రీన్‌ కాఫీ తాగుదామా?

ABN , First Publish Date - 2021-07-29T17:56:13+05:30 IST

మీరు సరిగ్గానే చదివారు. గ్రీన్‌ టీ కాదు... గ్రీన్‌ కాఫీనే! గ్రీన్‌ టీతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు దీంతో కూడా పొందవచ్చు. గ్రీన్‌ కాఫీ, దాని ఉపయోగాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

గ్రీన్‌ కాఫీ తాగుదామా?

ఆంధ్రజ్యోతి(29-07-2021)

మీరు సరిగ్గానే చదివారు. గ్రీన్‌ టీ కాదు... గ్రీన్‌ కాఫీనే! గ్రీన్‌ టీతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు దీంతో కూడా పొందవచ్చు. గ్రీన్‌ కాఫీ, దాని ఉపయోగాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!


కాఫీ గింజలు సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే పచ్చి కాఫీ గింజలను వేయించడం వల్ల వాటికి ఆ రంగొస్తుంది. అలా వేయించకుండా, పూర్తి పచ్చిగా ఉండే ఆకుపచ్చని కాఫీ గింజలే గ్రీన్‌ కాఫీ. వీటిని విత్తనాలుగానే కొని సాధారణ కాఫీ మాదిరిగానే గ్రీన్‌ కాఫీ తయారు చేసుకోవచ్చు. అయితే గ్రీన్‌ కాఫీ సాధారణ కాఫీ డికాక్షన్‌ రుచిని పోలి ఉండదు. దీని రుచి కాఫీకి బదులుగా హెర్చల్‌ టీని మరిపిస్తుంది.


అన్ని కాఫీ విత్తనాల మూలాలు ఒకటే అయినా, రోస్టెడ్‌ కాఫీతో పోలిస్తే మిగతా కాఫీ గింజల్లోని రసాయన పరిమాణాలు భిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గ్రీన్‌ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్లు ఎక్కువ. వీటితో దక్కే ఆరోగ్య ప్రయోజనం కూడా ఎక్కువే! రోస్టెడ్‌ కాఫీ విత్తనాలను వేయించే క్రమంలో, వాటిలోని ఈ సుగుణాలు నశిస్తూ ఉంటాయి.


అధిక బరువు తగ్గిస్తుందా?

2012లో ఓ అమెరికన్‌ సెలబ్రిటీ ఫిజీషియన్‌, అధిక బరువును తగ్గించే మంత్రదండం అంటూ గ్రీన్‌ కాఫీకి విపరీత ప్రచారం కల్పించాడు. అయితే గ్రీన్‌ కాఫీలో అలాంటి గుణాలేవీ లేవని వైద్య నిపుణులు నిర్ధారించినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచవ్యాప్త మార్కెట్లలో గ్రీన్‌ కాఫీకి బరువు తగ్గిస్తుందనే మంచి పేరుంది. చిట్టెలుకల మీద చేపట్టిన ప్రయోగాల్లో వాటి పూర్తి శరీర బరువు, పేరుకున్న కొవ్వు తగ్గడమే ఇందుకు కారణం. అయితే అధిక బరువును మించి గ్రీన్‌ కాఫీతో దక్కే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి. 


గ్రీన్‌ కాఫీలోని క్లోరోజెనిక్‌ యాసిడ్‌ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన మధుమేహం, హృద్రోగాలను అదుపు చేస్తుంది. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర కలిగి ఉండడం లాంటి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కలిగి ఉండడం మూలంగా మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే వీలున్న 50 మంది మీద చేపట్టారు. ఈ ప్రయోగాల్లో భాగంగా వీరికి రోజుకు రెండు సార్లు 400 మిల్లీ గ్రాముల కెఫీన్‌ తొలగించిన గ్రీన్‌ కాఫీ సారాన్ని అందించడం జరిగింది. తర్వాత జరిపిన పరీక్షల్లో వీళ్లలో చక్కెర, రక్తపోటు, నడుము చుట్టకొలతలు తగ్గినట్టు తేలడం విశేషం.


Updated Date - 2021-07-29T17:56:13+05:30 IST