పరిహారానికి పచ్చజెండా

ABN , First Publish Date - 2021-06-17T06:14:48+05:30 IST

నిర్మల్‌ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న సదర్‌మాట్‌ బ్యారేజీ పనులకు ఇక ఆ టంకాలు దాదాపుగా తొలగిపోయినట్లేనంటున్నారు.

పరిహారానికి పచ్చజెండా
గోదావరిపై నిర్మిస్తున్న సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం పనులు

సదర్‌మాట్‌ నిర్వాసితులకు ఊరట 

జిల్లా నేతలకు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టమైన హామీ 

రెండేళ్ల నుంచి నెలకొన్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం 

పనులకు తొలగనున్న ఆటంకం 

నిర్మల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న సదర్‌మాట్‌ బ్యారేజీ పనులకు ఇక ఆ టంకాలు దాదాపుగా తొలగిపోయినట్లేనంటున్నారు. గత రెండేళ్ల నుంచి ఈ బ్యారేజీనిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం డబ్బుల కోసం ఆందోళనలు చేయడమే కాకుండా నిర్మాణ పనులను సైతం నిలిపివేశారు. భూనిర్వాసితుల ఆందోళనలతో సదరు కాంట్రాక్టర్‌ పనులు చేయలేక సతమతమయ్యారు. పరిహారం డబ్బులను ఇప్పిస్తామని జిల్లా ప్రజాప్రతినిధులు సంబందిత నిర్వాసిత రైతులకు హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. దీంతో జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక నాయకులు రాంకిషన్‌రెడ్డి, గండ్రత్‌ ఈశ్వర్‌ తదితరులు మరోసారి రాష్ట్ర రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును గత రెండు రోజుల క్రితం కలిసి సమస్య తీవ్రతను వివరించారు. రైతులకు రూ. 53 కోట్ల మేర పరిహారం డబ్బులు చెల్లించాల్సి ఉందని ఇప్పటి వరకు రూ.65 కోట్లను రైతులకు పరిహారంగా అందించామని వీరు మంత్రి హరీష్‌రావుకు వివరించారు. కొంతమందికి పరిహారం డబ్బు లు ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం స్థానికంగా వివాదాస్పదమవుతుందని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పరిహారం విషయంలో అపార్థాలు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. ప్రధానంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పరిహారం డబ్బుల మంజూరు విషయమై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మంత్రి హరీష్‌రావు అప్పటికప్పుడే రూ.40 కోట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత ఆర్థికశాఖకు సిఫారసు చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ పరిహారానికి సంబందించిన డబ్బులు విడుదలకానుండడంతో ఇక్కడి ముంపు రైతులకు సంబందించి పరిహారం డబ్బులు చేతికి అందే అవకాశాలు ఏర్పడనున్నాయి. గత నాలుగైదేళ్ల నుంచి ఈ పరిహారం డబ్బుల కోసం రైతులు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. తాము తక్కువ ధరకే భూములను ఇచ్చామని, భూములు కోల్పోయిన తమకు పరిహారం అందక ఉపాధికి కూడా దూరం అయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులను కూడా రైతులు పలుసార్లు పరిహారం డబ్బుల విషయమై నిలదీశారు. అయితే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  జిల్లాకు చెందిన పలువురు నేతలను వెంట పెట్టుకొని హరీష్‌రావుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మంత్రి హరీష్‌రావు పరిహారం డబ్బుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

జిల్లాలో 18వేల ఎకరాలకు అదనపు సాగునీరు

జిల్లాలోని మామడ, ఖానాపూర్‌ ప్రాంతాల్లో అదనంగా 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారు. మామడ మండలంలోని పొన్కల్‌ వద్ద ఈ బ్యారేజీ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. దీని కోసం గానూ ప్రభుత్వం రూ. 520 కోట్లను కేటాయించింది. భూసేకరణ కోసం ఇందులో నుంచి రూ. 110 కోట్లను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు పరిహారానికి సంబందించి రూ. 65 కోట్లను మాత్రమే నిర్వాసిత రైతులకు చెల్లించారు. మొత్తం బ్యారేజీ నిర్మాణం కోసం 1170 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో నుంచి ఇప్పటి వరకు 605 ఎకరాలకు సంబందించి మాత్రమే భూసేకరణ జరిపి పరిహారం చెల్లించారు. బ్యారేజీగేట్ల నిర్మాణం కోసం రూ. 130 కోట్లను వ్యయం చేయనున్నారు. ఇలా నిర్మల్‌ జిల్లాకే కాకుండా పొరుగున ఉన్న జగిత్యాల జిల్లాలోని మరో 6వేల ఎకరాలకు కూడా ఈ సదర్‌మాట్‌ బ్యారేజీ ద్వారా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరువైపులా కూడా భూ సేకరణ జరిపి కొంతమందికి మాత్రమే భూములకు సంబంధించి పరిహారాన్ని చెల్లించారు. భూములు కోల్పోయిన మిగతా రైతులకు మాత్రం ఐదారు సంవత్సరాల నుంచి పరిహారాన్ని చెల్లించకపోవడం వివాదానికి కారణమయ్యిం ది. రైతుల ఆందోళనలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా పొన్కల్‌ గ్రామానికి చెందిన రైతులు ప్రజా ప్రతినిధులను నిలువరించి ఆందోళనలు చేపట్టారు. పరిహారం డబ్బుల చెల్లింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలున్నట్లు ప్రజా ప్రతినిధులు పసిగట్టారు.

పట్టుబట్టిన మంత్రి అల్లోల

కాగా సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులందరికి దశల వారీగా పరిహారం అందించే విషయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మొదటి నుంచి పట్టుదలతో ఉన్నారు. సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రూ.520 కోట్లను మంజూరు చేయించారు. మొత్తం దీని కోసం గానూ 1170 ఎకరాల భూసేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 605 ఎకరాల భూమిని సేకరించారు. దీనికి సంబంధించి 110 కోట్లను పరిహారం కింద రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 65 కోట్లను మాత్రం చెల్లించారు. మిగతా రూ.53 కోట్ల కోసం నిర్వాసిత రైతులు యేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ నిధుల విడుదల కోసం మంత్రి పలుసార్లు సంబంధిత మంత్రితో పాటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా పరిహారానికి సంబందించిన రూ.53 కోట్ల నిధుల విడుదలలో జాప్యం జరుగుతూనే ఉంది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం రూ.53 కోట్లను విడుదల చేయకపోవడంతో భూములు కోల్పోయిన రైతులు తమదైన రీతిలో ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీరియస్‌గా సంప్రదింపులు జరపడం, అ లాగే సమస్య తీవ్రత ను వివరించడం, సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచ డమే కాకుండా మంత్రి హరీష్‌రావును లక్ష్యంగా చేసుకొని తన ఒత్తిడిని తీవ్రం చేశారు. దీంతో సర్కారు ఎట్టకేలకు పరిహారం డబ్బుల చెల్లింపుల కోసం దిగి రాక తప్పలేదు. మంత్రి స్థానిక నేతలైన మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ తదితరులతో కలిసి గత రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి నిధుల విడుదలకు స్పష్టమైన హామీని సా ధించారు. 

అదనపు ఆయకట్టే లక్ష్యం

జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుతం ఉన్న ఆయకట్టుకు తోడుగా మరింత ఆయకట్టును పెంపొందించాలన్న లక్ష్యంతో వివిధ రకాల ప్రతిపాదనలు రూపొందింపజేశారు. ఇందులో భాగంగానే మొదట కాళేశ్వరం ప్రాజె క్ట్‌ పరిధిలో ప్యాకేజీనంబర్‌ 27,28 హైలెవల్‌ కాలువలకు ప్రతిపాదనలు రూపొందింపజేశారు. ఈ రెండు కాలువల కింద దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం పెద్దమొత్తంలో భూములను సేకరించారు. సేకరించిన భూములకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం వివాదాలకు కారణమయ్యింది. పరిహారం కోసం రైతులు ఆందోళనలు చేయడమే కాకుండా పనులను అడ్డుకున్నారు. 27వ ప్యాకేజీ హైలెవల్‌ కాలువ పను లు పూర్తయితే నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఇరిగేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే నిధుల కొరత కారణంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం డబ్బులను సక్రమంగా చెల్లించకపోవడమే కాకుండా పూర్తయిన పనులకు సైతం బిల్లులను ఇవ్వలేదు. దీంతో పనులు నిలిచిపోవడంతో పాటు అదనపు ఆయకట్టు లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అలాగే దాదాపు 18వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణ పనుల విషయంలో కూడా ఇలా పరిహారం డబ్బుల చెల్లింపు కారణంగా అవరోధాలు ఎదురయ్యాయి. పరిహారం డబ్బులు ఎప్పటికప్పుడు భూములు కోల్పోయిన రైతులకు చెల్లించకపోవడంతో ఆశించిన గడువులోగా పనులు పూర్తిచేయలేని పరిస్థితి తలెత్తింది. నిర్వాసిత రైతులు పనులను ఎప్పటికప్పుడు అడ్డుకోవడంతో జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు మంత్రి అల్లోల చొరవ కారణంగా ఒక్కో సమస్య పరిష్కారానికి నోచుకుంది.


Updated Date - 2021-06-17T06:14:48+05:30 IST