పంచాయతీ పోరుకు పచ్చజెండా!

ABN , First Publish Date - 2021-01-22T08:24:15+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు పడిన ‘బ్రేక్‌’ తొలగిపోయింది. వచ్చేనెలలో నాలుగు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.

పంచాయతీ పోరుకు  పచ్చజెండా!

హైకోర్టు తీర్పు  రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు  

‘షెడ్యూలు రద్దు’ ఆదేశాలు కొట్టివేత.. ఎన్నికల నిర్వహణ అధికారం కమిషన్‌దే

సుప్రీం తీర్పులు, రాజ్యాంగం చెప్పింది ఇదే.. కరోనా సమయంలోనూ పలుచోట్ల ఎన్నికలు

వాటిని హైకోర్టులు, సుప్రీం సమర్థించాయి.. సర్కారుతో సంప్రదింపులు జరపలేదనలేం

వ్యాక్సినేషన్‌నూ పరిగణనలోకి తీసుకున్నారు.. ఎన్నికలు, టీకా.. రెండూ ముఖ్యమే

ఎస్‌ఈసీ, ప్రభుత్వం విజయవంతం చేయాలి.. సీజే నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశం


సుప్రీంకోర్టుకు సర్కారు.. ఎస్‌ఎల్‌పీ దాఖలు

వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతీ అంశాన్ని 

ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ అభిప్రాయాలతో ఎస్‌ఈసీ 

ఏకీభవించకపోవచ్చు. కానీ... సంప్రదింపుల ప్రక్రియ మాత్రం 

జరిగింది. పోలింగ్‌ ఎప్పుడు నిర్వహించాలనే స్వేచ్ఛ ఎన్నికల కమిషన్‌దే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 

అధికరణ 243(కె)(3) మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర హోదా ఉంటుంది.

- హైకోర్టు ధర్మాసనం


అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు పడిన ‘బ్రేక్‌’ తొలగిపోయింది. వచ్చేనెలలో నాలుగు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల షెడ్యూలును రద్దుచేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పక్కనపెట్టింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ గురువారం సంచలన తీర్పు చెప్పింది. కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ప్రజలకు ముఖ్యమే. ఎన్నికలు సజావుగా జరగాలి. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా జరగాలి’’ అని తెలిపింది. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.


కరోనా తీవ్రతలోనూ ఎన్నికలు...

ఫిబ్రవరిలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 8వ తేదీన ఎస్‌ఈసీ షెడ్యూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని రద్దు చేస్తూ ఈ నెల 11న సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని  సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. దానికి విచారణార్హత లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరాం చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్‌ జడ్జి లోతైన విచారణ జరపకుండా, ఇరుపక్షాల హక్కులు, బాధ్యతలు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చారని  ఎస్‌ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు చేసిన వాదనతో ఏకీభవించింది.  ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎన్నికల సంఘం హక్కులను ప్రభావితం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగిసిపోవడంతో కమిషనర్‌ తనకున్న చట్టబద్ధమైన అధికారాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించారు. కరోనా తీవ్రత ఉన్న సమయంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది’’ అని ధర్మాసనం వెల్లడించింది.


సంప్రదింపులు జరిగాయి...

ఎన్నికల షెడ్యూలు విషయంలో ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని... తగిన సంప్రదింపులు జరపలేదని ప్రభుత్వం చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని పరిశీలిస్తే.. వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ అభిప్రాయాలతో ఎస్‌ఈసీ ఏకీభవించకపోవచ్చు. కానీ.. సంప్రదింపుల ప్రక్రియ మాత్రం జరిగింది. సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనట్లు సంప్రదింపుల ప్రక్రియ జరగలేదని చెప్పలేం’’ అని ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాల్లో ఎస్‌ఈసీ దేనిని, ఎలా పరిగణనలోకి తీసుకోలేదో సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో చెప్పలేదని తెలిపింది. ‘‘పంచాయతీ ఎన్నికలు జరపాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం టీకా ప్రక్రియకు ఎలా ఆటంకం కలిగిస్తుందో సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ప్రభుత్వం అందజేసిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రెండూ సమన్వయంతో నిర్వహించవచ్చని ఎస్‌ఈసీ భావించింది. కేటగిరీ-1, కేటగిరీ-2లో పరిమితమైన సంఖ్యలోనే వ్యాక్సిన్‌ ఇస్తారని... ఇది ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదనే నిర్ణయానికి వచ్చింది. కేటగిరీ-3లో ఉన్న వారికి టీకా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు పూర్తి చేయాలని భావించింది’’ అని పేర్కొంది.


సీఈసీ అధికారాలే ఎస్‌ఈసీకి...

ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, అడ్డంకులు కలగకుండా కోర్టులు కమిషన్‌కు రక్షణగా నిలవాలని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఉన్న అధికారాలే ఎస్‌ఈసీకి కూడా ఉంటాయని కిషన్‌సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ‘‘పోలింగ్‌ ఎప్పుడు నిర్వహించాలనే స్వేచ్ఛ పూర్తిగా ఎన్నికల కమిషన్‌దేనని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని 243(కె)(3)  అధికరణ మేరకు ఎస్‌ఈసీకి స్వతంత్ర హోదా ఉంటుంది. అందువల్ల, 8న ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయడం సరికాదు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొంది. ఎన్నికల నిర్వహణ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లోని పలు వివరాలను ధర్మాసనం తన తీర్పులో పొందుపరిచింది. ‘‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 7న లేఖ రాశారు. ప్రభుత్వ యంత్రాంగమంతా టీకా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలూ, వ్యాక్సినేషన్‌ ఒకేసారి నిర్వహించడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారని తెలిపారు. 


అయితే... వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి ఎస్‌ఈసీ తన ఉత్తర్వుల్లో  స్పష్టంగా వివరించారు. మొదటి కేటగిరీలో  3.7లక్షల ఆరోగ్య కార్యకర్తలు, రెండో కేటగిరీలో 7 లక్షల ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు మాత్రమే టీకా ఇస్తారని... ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపకుండానే వీరికి వ్యాక్సినేషన్‌ అందించవచ్చని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఎస్‌ఈసీ గుర్తు చేశారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిపారు. అంతేకాదు... వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం కావడంలో దిగువ స్థాయి నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందని... స్థానిక సంస్థల ఎన్నికలతోనే నాయకత్వ లోటును పూడ్చగలమని తెలిపారు’’ అని ధర్మాసనం వివరించింది.

Updated Date - 2021-01-22T08:24:15+05:30 IST