గ్రీన్‌ ‘కాకతీయ’

ABN , First Publish Date - 2021-07-16T05:34:53+05:30 IST

గ్రీన్‌ ‘కాకతీయ’

గ్రీన్‌ ‘కాకతీయ’
కేయూలో వెర్బన్‌ ప్లాంటేషన్‌ చిహ్నం, వర్సిటీలో మొక్కలకు నీళ్లు పోస్తున్న సిబ్బంది, వర్సిటీలోని వెర్బల్‌ ప్లాంటేషన్‌

హరిత క్యాంపస్‌ దిశగా అడుగులు

కేయూలో పకడ్బందీగా మొక్కల పెంపకం

మొక్కల రక్షణకు ప్రత్యేక కమిటీలు

అనుబంధ కళాశాలల్లోనూ గ్రీనరీకి ప్రత్యేక చర్యలు


కేయూ క్యాంపస్‌, జూలై 15: కాకతీయ యూనివర్సిటీ గ్రీన్‌ క్యాంపస్‌ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా కేయూను హరితవనంగా తీర్చిదిద్దేందుకు వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నేతృత్వంలో అధ్యాపకులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన హరితహారంలో యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో ప్రణాళికాబద్దంగా మొక్కలు నాటారు. అధ్యాపకులు, అధికారులు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు, విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. కేయూలో వెర్బన్‌ ప్లాంటేషన్‌ ఏర్పాట్లకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పటికే రెండున్నర ఎకరాల్లో చేపడుతున్న మొక్కల పెంపకానికి అదనంగా మరో ఐదెకరాల స్థలంలో వెర్బన్‌ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. బాటనీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్‌మెంట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటేషన్‌లో అన్ని రకాల ఔషధ మొక్కలను పెంచుతారు. యూనివర్సిటీలో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా తిప్పతీగ, గుంటగలగర, కుందేటి కొమ్ము, సర్పగంఽధ,(పాతాళగరిడి), చెంగల్వకోస్తు, నాభి, వావిలి, గుట్టిపాలు, కలస జాతి మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  


అనుబంధ కళాశాలల్లో...

కేయూ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో అన్ని డిగ్రీ, పీజీ ఇతర ప్రొఫెషనల్‌ కళాశాలల్లో తప్పనిసరిగా మొక్కల పెంపకం చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత ప్రొఫార్మాలో నాటిన మొక్కలు వాటి సంరక్షణ వివరాలను యూనివర్సిటీకి పంపాలి. మొక్కల పెంపకంలో అలసత్వం వహించే కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం వివరాలను పొందుపరుస్తారు. ప్రతీ కళాశాల వెయ్యి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు అదేశించారు. విరివిగా మొక్కలను పెంచి కాకతీయ యూనివర్సిటీని ఆక్సిజన్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించనున్నారు. కేయూలో అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం రూ.5లక్షలు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 


అయితే ఆ నిధులు అవెన్యూ ప్లాంటేషన్‌ ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయని తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణ కోసం యూనివర్సిటీలోని నలుగురు ఉద్యోగులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీరోజు చెట్లకు నీళ్లు పెట్టడడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. యూనివర్సిటీలో సమీప ప్రాంతాలకు చెందిన పశువులు క్యాంప్‌సలో చొరబడి మొక్కలను ధ్వంసం చేస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేయూ అధికారులు పశువుల యాజమానులకు జరిమానాలు విధిస్తున్నారు. 


ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం : వీసీ రమేశ్‌ 

కేయూలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మొక్కల పెంపకానికి కార్యాచరణ ప్రకటిస్తాం. మొక్కల పెంపకాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. యూనివర్సిటీలో మొక్కల పెంపకానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. 



Updated Date - 2021-07-16T05:34:53+05:30 IST