కరివేపాకు సాగుదారులపై కర్ఫ్యూ ప్రభావం

ABN , First Publish Date - 2021-06-23T07:00:49+05:30 IST

మండలంలోని కరివేపాకు సాగుచేసిన రైతులపై కర్ఫ్యూ ప్రభావం తీవ్రంగా పడింది. నెల రోజుల క్రితం ధర టన్ను రూ.40వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.వెయ్యికి చేరింది.

కరివేపాకు సాగుదారులపై కర్ఫ్యూ ప్రభావం
ఏపుగా పెరిగిన తోట

నెల క్రితం టన్ను రూ 40వేలు పలికిన వైనం 

నేడు టన్ను రూ వెయ్యికి పడిపోయిన ధర

ముండ్లమూరు, జూన్‌ 22 : మండలంలోని కరివేపాకు సాగుచేసిన రైతులపై కర్ఫ్యూ ప్రభావం తీవ్రంగా పడింది.  నెల రోజుల క్రితం ధర టన్ను రూ.40వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.వెయ్యికి చేరింది.  కరోనా వైరెస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడం వలన ధర అమాంతం పడి పోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కొంత మంది రైతులు తోటలను వదిలి వేస్తున్నారు. మరి కొంత మంది రైతులు కూలీలను పెట్టి కరివేపాకును కోసి వేస్తున్నారు. మండలంలోని పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, పెద ఉల్లగల్లు, పోలవరం, సింగన్నపాలెం, పలుకురాళ్ళ తండా, నూజెళ్ళపల్లి గ్రామాల్లో విస్తారంగా కరివేపాకు తోటలు సాగు చేశారు. కరివేపాకు తోటలు సాగు చేసిన రైతులు రెండు సంవత్సరాల నుంచి లాభాల బాట పట్టడంతో వారిని చూసిన రైతులు ఈ ఏడాది అధిక మొత్తంలో సాగు చేశారు. తీరా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతం కావడం, లాక్‌డౌన్‌ విధించటం వలన ఎగుమతి పూర్తిగా నిలిచి పోయింది. దీంతో వ్యాపారస్తులు రాకపోవటం ఒక ఎత్తు అయితే కొవిడ్‌ ప్రభావం చూపి దళారులు పూర్తిగా ధరను దిగజార్చారు. చేసేదేమి లేక కొంత మంది రైతులు తోటలను అలానే వదిలేశారు. మరి కొంత మంది రైతులు ప్రత్యామ్నాయంగా పంటలను సాగు చేసేందుకు తోటలను దున్ని వేస్తున్నారు. మొత్తం మీద నెల రోజుల వ్యవధిలోనే ధరలు ఆకాశం నుంచి నేలకు చూశాయి.

Updated Date - 2021-06-23T07:00:49+05:30 IST