పచ్చి మామిడితో మజా!

ABN , First Publish Date - 2021-05-01T06:41:38+05:30 IST

పచ్చి మామిడికాయలను చూస్తే చాలు నోరూరుతుంది. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే వీటితో చేసిన పులిహోర లొట్టలేయిస్తుంది. అలాగే పచ్చి మామిడికాయతో తయారు చేసిన ఆమ్‌ కీ లౌంజీ, పచ్చడి, రసం, పప్పు లాంటివి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

పచ్చి మామిడితో మజా!

పచ్చి మామిడికాయలను చూస్తే చాలు నోరూరుతుంది. 

ఈ సీజన్‌లో మాత్రమే దొరికే వీటితో చేసిన పులిహోర 

లొట్టలేయిస్తుంది. అలాగే పచ్చి మామిడికాయతో తయారు చేసిన

ఆమ్‌ కీ లౌంజీ, పచ్చడి, రసం, పప్పు లాంటివి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. 

ఇంకెందుకాలస్యం మీరూ ఈ  రుచులను తనివితీరా ఆస్వాదించండి.


100 గ్రాముల పచ్చిమామిడిలో..

క్యాలరీలు - 60

ప్రోటీన్‌ - 0.8గ్రా

కార్బోహైడ్రేట్లు - 15గ్రా


పచ్చి మామిడి లాభాలివి!

డీహైడ్రేషన్‌ బారినపడకుండా కాపాడుతుంది. 

మార్నింగ్‌ సిక్‌నెస్‌, మలబద్ధకం వంటివి తగ్గిపోతాయి. 

వీటిలోని నియాసిన్‌ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

పచ్చి మామిడికాయలు తినడం వల్ల ఎంజైముల విడుదల సవ్యంగా జరుగుతుంది.  జీర్ణసమస్యల బాధ తప్పుతుంది.

దంత సమస్యలు దూరమవుతాయి. నోటి దుర్వాసన మాయమవుతుంది. 

పచ్చిమామిడిలోని విటమిన్‌-ఎ, విటమిన్‌ - సి చర్మ, శిరోజాల సంరక్షణలో తోడ్పడతాయి.  

వీటిని తింటే తగినంత ఫైబర్‌ లభిస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మామిడిలో పాలీఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కేన్సర్‌ రాకుండా కాపాడతాయి.


మామిడికాయ పచ్చడి

కావలసినవి

మామిడికాయలు - మూడు, పచ్చిమిర్చి - నాలుగైదు, చింతపండు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, వేరుశనగలు - 200గ్రాములు, ఎండుమిర్చి - ఆరు, నూనె - కొద్దిగా.

 

తయారీ విధానం 

మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.

పచ్చిమిర్చి కట్‌ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి.

ఒకపాత్రలో మామిడికాయ ముక్కలను, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత అందులో చింతపండు రసం కలిపి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగించాలి. 

ఈ మిశ్రమాన్ని పచ్చడిలో పోసి కలియబెట్టాలి. అంతే... నోరూరించే మామిడికాయ పచ్చడి రెడీ.



మామిడికాయ పప్పు 

కావలసినవి

కందిపప్పు - ఒకకప్పు, మామిడికాయ - ఒకటి, నూనె - సరిపడా, కారం - ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు పసుపు - చిటికెడు, నిమ్మరసం - కొద్దిగా, నెయ్యి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

ముందుగా కందిపప్పును కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. 

మామిడికాయ పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒకపాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉడికించిన కందిపప్పును అందులో వేయాలి. 

కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి, కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించుకోవాలి. 

తరువాత మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.

ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించాలి. 

ఈ పోపును మామిడికాయ మిశ్రమంలో వేసి కలిపి మరికాసేపు ఉడికించి దింపాలి. అన్నంలో లేదా చపాతీలో మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. 


కైరీ కర్రీ

రాజస్థాన్‌లో చేసుకునే సంప్రదాయ వంటకం ఇది. ఈ రెసిపీ తయారుచేయడానికి...


కావలసినవి

మామిడికాయలు - రెండు, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, ఇంగువ - అర టీస్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, బెల్లం - కొద్దిగా, కొత్తిమీర - అలంకరణ కోసం.


తయారీ విధానం 

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఆవాల నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు వేయాలి. 

తర్వాత పసుపు, ఇంగువ, కారం, ధనియాలపొడి, శనగపిండి వేసి కలపాలి.

ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి, అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి.

తగినంత ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. 

బెల్లం వేసి కరిగే వరకు ఉంచాలి. 

చివరగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేసుకోవాలి.


మామిడికాయ రసం

కావలసినవి

మామిడికాయ - ఒకటి, టొమాటోలు - రెండు, ఆవాలు - ఒక టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా, ఎండుమిర్చి - ఒకటి, మిరియాలు - నాలుగైదు, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌,  అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా. 


తయారీ విధానం 

ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్రను వేగించి పొడి చేసుకోవాలి.

పచ్చి మామిడికాయను నీళ్లలో వేసి ఉడికించాలి. మామిడికాయ బాగా ఉడికిన తరువాత గుజ్జుగా(మ్యాంగో ప్యూరీ) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కందిపప్పును ఉడికించాలి. కాసేపటి తరువాత టొమాటోలు, అల్లం వెలుల్లి, మిరియాల పొడి వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. 

తరువాత మ్యాంగో ప్యూరీ వేసి కలపాలి. 

ఒకపాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగించాలి. కరివేపాకు, పసుపు వేయాలి. దీన్ని టొమాటో మిశ్రమంలో కలపాలి. రుచికి తగిన ఉప్పు వేస్తే సరి నోరూరించే మామిడికాయ రసం రెడీ. 



ఆమ్‌ కీ లౌంజీ

కావలసినవి

మామిడికాయలు - రెండు, నూనె - సరిపడా, ఎండు మిర్చి - రెండు, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, మెంతులు - ఒక టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, బెల్లం - అరకప్పు, ఇంగువ - చిటికెడు.


తయారీ విధానం

ముందుగా మామిడికాయలను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

స్టవ్‌పై పాత్రను పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత మెంతులు వేయాలి. ఇంగువ వేసుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోయాలి.

నీళ్లు మరిగిన తరువాత మామిడికాయ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి.

కాసేపయ్యాక పుసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

చివరగా బెల్లం వేయాలి. మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. 

అన్నంతో లేక చపాతీతో సర్వ్‌ చేయాలి. దోశలోకి కూడా రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-05-01T06:41:38+05:30 IST