Group-1 ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-06-25T17:05:28+05:30 IST

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది...

Group-1 ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌

షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియకు హైకోర్టు ఓకే 

ఫలితాలు ప్రకటించవద్దన్న అప్పీలును తిరస్కరించిన హైకోర్టు


అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1(Group-1) ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు(Interviews) నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు(High Court) అనుమతిచ్చింది. ఫలితాలు ప్రకటించవద్దంటూ అప్పీలుదారులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఫలితాల ప్రకటన, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చినట్లైతే.. అవి ప్రధాన వ్యాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ విషయాన్ని పోస్టింగ్‌ ఆర్డర్స్‌లో ప్రస్తావించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. అలాగే కోర్టు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకోవాలని పేర్కొంది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలలో ప్రతివాదులుగా చేరాలంటే ఎంపికైన అభ్యర్థులు చేరవచ్చని స్పష్టం చేసింది. 


జూలై మొదటి వారంలోగా సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న ప్రధాన వ్యాజ్యాలలో కౌంటర్‌ వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. రిప్లై వేయాలనుకుంటే జూలై 13లోగా దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో పాల్గొన్న అభ్యర్థల జవాబు పత్రాలను భద్రపరచాలని,డిజిటల్‌ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు మాన్యువల్‌ విధానంలో వారు సాధించిన మార్కుల వివరాలనూ సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)కు అందజేయాలని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. అలాగే మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం ద్వారా ఇంటర్యూలకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా రిజిస్ట్రార్‌ వద్ద ఉంచాలని పేర్కొంది. రిట్‌ అప్పీళ్లను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సింగిల్‌ జడ్జి వద్ద ప్రధాన వ్యాజ్యాలపై జూలై 14న తుది విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం తామిచ్చే ఉత్తర్వులు ఇరువర్గాల ప్రయోజనాలను కాపాడతాయనిధర్మాసనం తీర్పులో పేర్కొంది. 


ఈ మేరకు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. మాన్యువల్‌ విధానంలో జరిగిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాలను విచారించిన సింగిల్‌ జడ్జి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతిచ్చారు. అయితే అభ్యర్థుల తుది ఎంపిక ఫలితాలు కోర్టు ఇచ్చే తుదితీర్పుకి లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాన్యువల్‌ మూల్యాంకనంలో అర్హత సాధించని కొందరు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేయగా.. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

Updated Date - 2022-06-25T17:05:28+05:30 IST