పోలీస్‌ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-04-26T05:59:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.

పోలీస్‌ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌

- నోటిఫికేషన్‌ విడుదలతో నిరుద్యోగుల్లో ఆనందం

- రామగుండం కమిషనరేట్‌ పరిధిలో 28 సివిల్‌ ఎస్‌ఐ, 4 ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టులు

- 273 సివిల్‌ కానిస్టేబుల్‌, 166 ఏఆర్‌ పోస్టుల ప్రకటన


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

 రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న పోస్టులను ఎట్టకేలకూ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించడంతో చాలా వరకు కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. ఆ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం పలువురు నిరుద్యోగులు ఐదారు నెలలుగా సంసిద్ధం అవుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షలు నిర్వహించనుండడంతో ఉదయం,. సాయంత్రం వేళల్లో క్రీడా మైదానాల్లో కసరత్తు చేస్తున్నారు. పొద్దంతా, రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,644 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, 554 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 273, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 166, ఇతరత్రా మరో 2 పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి సివిల్‌లో 28 పోస్టులు, ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టులు నాలుగు ప్రకటించారు. కాళేశ్వరం జోన్‌ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కుమరంభీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌, ములుగు జిల్లాలు ఉన్నాయి. జోనల్‌ స్థాయి పోస్టులకు ఐదు జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మే రెండు నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసేందుకు నిరుద్యోగ యువకులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు విద్యార్హత ఇంటర్‌, ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులన్నీంటిని రిజర్వేషన్‌ల ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఇందులో 33 శాతం మహిళలకు రిజర్వు చేశారు. దరఖాస్తుచేయడానికి  పోలిస్‌ కానిస్టేబుల్‌కు 25 ఏళ్లు, ఎస్‌ఐలకు 28 ఏళ్ల వయస్సు దాటరాదు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వర్గాలకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉతీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ఈసారి నెగెటివ్‌ మార్కులను చేర్చుతూ మార్పు చేశారు. గతంలో నెగెటివ్‌ మార్కులు లేవు. ఈ ప్రిలిమినరీ పరీక్షలో 30 శాతం మార్కులతో ఉతీర్ణులైన అన్ని కేటగిరీ వర్గాల వారికి శారీరక దారుఢ్య పరీక్షలకు అనుమతి ఇస్తారు. గతంలో ఉన్న పోలీసు నోటిఫికేషన్‌లోని శారీరక దారుఢ్య పరీక్షల్లో మార్పులు, చేర్పులు చేశారు. అంతకు ముందు పురుషులకు 100 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్‌, మహిళలకు కేవలం 100 మీటర్ల పరుగు నిర్వహించే వారు. ఈసారి పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరుగును నిర్ణీత సమయంలో తప్పనిసరిగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇవేకాకుండా పురుషులకు, మహిళలకు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ ఈవెంట్స్‌లో రాణించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, ఈవెంట్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత మేయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

- ఉచిత శిక్షణకు పోలీసుశాఖ సిద్ధం..

పోలీసు నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పోలీసు స్టేషన్ల వారీగా దరఖాస్తులను స్వీకరించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గల పోలీస్‌ శిక్షణ కేంద్రంలో జిల్లా నుంచి 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం పలువురు దరఖాస్తు చేసుకోగా కొందరికి ఎత్తు సరిపోక వాపస్‌ పంపించారు. 20 నుంచి 40 మంది వరకు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. పది రోజుల క్రితం మంథనిలో కూడా ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ సహకారంతో రామగుండంలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించామని పెద్దపల్లి డీసీపీ పులిగిళ్ల రవీందర్‌ తెలిపారు. నోటిఫికేషన్‌ రావడం వల్ల ఆసక్తి గల అభ్యర్థులను ప్రిలిమినరీ పరీక్షకు, శారీరక దారుఢ్య పరీక్షలకు, మెయిన్స్‌ రాత పరీక్షకు సిద్ధం చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.


Updated Date - 2022-04-26T05:59:35+05:30 IST