గ్రీన్‌ట్యాక్స్‌.. మోత!

ABN , First Publish Date - 2021-11-26T05:34:10+05:30 IST

అసలే కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా రవాణా రంగం కుదేలైంది. దీనికి తోడు డీజిల్‌, పెట్రోలు ధరలు భారీగా పెరిగాయి.

గ్రీన్‌ట్యాక్స్‌.. మోత!

కాలపరిమితి దాటిన వాహనాలపై బాదుడు

7నుంచి 15 ఏళ్ల కిందటి వాటికి పన్ను 

మరోవైపు భారీగా లైఫ్‌ ట్యాక్స్‌

కొత్త వాహనాల కొనుగోళ్లపై ప్రభావం

ద్విచక్ర వాహనాలనూ వదల్లేదు..

పన్నులతో కాలుష్య నియంత్రణ సాధ్యమేనా...?

ఆందోళనలో లారీల డ్రైవర్లు, వాహనదారులు

 

 మీ ఇంట్లో ఒక మూలన, పాడైపోయిన వాహనాలు ఉన్నాయా..? వెంటనే వాటి పత్రాలను పరిశీలించండి.. అవి ఎప్పుడు కొన్నామో జాగ్రత్తగా చూడండి.. వాహనం బాగా పాతదైతే సదరు వాహనాన్ని తుక్కు కింద మార్చినట్టు రవాణాశాఖ అధికారులు నుంచి అనుమతులు తెచ్చుకోండి.. లేకుంటే పన్నుల బారిన పడతారు జాగ్రత్త..! వాహన పరిమితిని బట్టి జరిమానాలూ ఉంటాయి.. ఎందుకంటే గ్రీన్‌ట్యాక్స్‌ పేరిట ప్రభుత్వం భారీగా వసూలు చేయనుంది. దీంతో పాటు కొత్త వాహనాలు కొన్నవారికి లైఫ్‌ట్యాక్స్‌లనూ పెద్దమొత్తంలో పెంచింది.  

 

గుంటూరు(తూర్పు), నవంబరు25: అసలే కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా రవాణా రంగం కుదేలైంది. దీనికి తోడు డీజిల్‌, పెట్రోలు ధరలు భారీగా పెరిగాయి. పైగా అధిక పెనాల్టీలు.. ఇవి సరిపోవన్నట్లు మూలిగే నక్కపై తాటికాయ.. చందంగా కొత్తగా గ్రీన్‌ ట్యాక్స్‌ భారం పడనుంది. జిల్లాలో సరుకు రవాణా చేసే వాహనాలు ఎక్కువశాతం ఏడేళ్ల కిందట కొనుగోలు చేసినవే ఉన్నాయి. ఇప్పటికే లైఫ్‌ట్యాక్స్‌లు, బ్రేక్‌లు, ఆంధ్రాట్యాక్సులు చెల్తిస్తూ సరుకు రవాణా చేస్తున్నారు. ఇప్పడు కొత్తగా వీటికి తోడైన గ్రీన్‌ట్యాక్స్‌తో పెనుభారం పడనుంది. ఉదాహరణకు ఒక 10టన్నుల పరిమితి సరుకు రవాణా చేసే లారీకి ఏడాదికి పన్నుల రూపంలో రూ.90వేల వరకు (గ్రీన్‌ట్యాక్స్‌తో కలిపి) చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పెద్ద లారీలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే నెలకు దాదాపు రూ.7,500 వరకు పన్నుల కింద ఖర్చవుతుంది.  


రూ.30 కోట్ల వరకు భారం

 మిర్చి, పొగాకు, పత్తి వ్యాపారాలకు ప్రధాన కేంద్రమైన జిల్లాకు అంతే స్థాయిలో వాటిపై ఆధారపడుతూ రవాణా రంగం కూడా ఉంది. ఈ రంగంలో రాష్ట్రంలో మన జిల్లా నాలుగో స్థానంలో ఉంది. పెంచిన పన్నుల కారణంగా జిల్లాపై రూ.30 కోట్ల వరకు భారం పడనుంది. 


కాలపరిమితి తీరినవి 70 శాతం 

 అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 16,50,000 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. వీటిలో రవాణేతర వాహనాలు బైక్‌లు, కార్లు ఇతర ప్రైవేటు వాహనాలు 14 లక్షల వరకు ఉండగా రవాణేతర రంగంలో మిగిలిన 2.5లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 7నుంచి 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన వాహనాల దాదాపు 70శాతం వరకు ఉన్నాయి. దీంతో ఇవన్నీ పెంచిన పన్నుల పరిధిలోకి వస్తాయి. 

 

ద్విచక్రవాహనాలపై కూడా..

జిల్లాలో 10 లక్షల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాలే అధికం. ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రీన్‌ట్యాక్స్‌ వీటిపై ఎక్కువుగా పడనుంది. ముఖ్యంగా కొంతమంది 15ఏళ్ల పైబడిన వాహనాలను నడుపుతుండగా, మరికొందరి వద్ద ఇవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు వీటికి రూ.5వేలు గ్రీన్‌ట్యాక్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని వాహనాలు అమ్మినా కూడా అంతరాదు. 

 

 కొత్తవాహనాల కొనుగోళ్లుపై ప్రభావం.. 

 కొవిడ్‌ తరువాత కొత్త వాహనాల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. లైఫ్‌ట్యాక్స్‌ పెంచడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందని షోరూం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు జిల్లాలో 500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌లు జరిగేవి. కొవిడ్‌ సమయంలో అవి సగానికిపైగా పడిపోయాయి. ప్రస్తుతం ఇంకా పడిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


కాలుష్య నివారణ సాధ్యమేనా..? 

కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రీన్‌ట్యాక్స్‌ను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో కూడా కాలుష్యం ప్రమాదకరంగానే నమోదు అవుతుంది. గుంటూరు నగరంలో నమోదయ్యే కాలుష్యానికి ప్రధాన కారణం కాలంచెల్లిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు. వీటిలో ఆటోలపై ఎటువంటి పన్నులను ప్రభుత్వం విధించలేదు. గ్రీన్‌ట్యాక్స్‌ ప్రభావం మాత్రం అధికశాతం లారీలపైనే పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.  



  ఆందోళనలు చేపడతాం

అధిక పన్నులు వేస్తే కాలుష్యం ఎలా తగ్గుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. తుక్కు వాహనాలను రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పిన రెండ్రోజులకే గ్రీన్‌ట్యాక్స్‌లను ప్రకటించడం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతుంది. అసలే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, కొవిడ్‌ కారణంగా కుదేలైన రవాణా రంగానికి ఉద్దీపనలు ప్రకటించాల్సింది పోయి, ఇంత భారీగా పన్నులు విధించడం అన్యాయం. దీనిపై  ఆందోళనలు చేపడతాం. 

- ఎన్‌.శివాజీ, ఆలిండియా రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి


  లారీలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదు.....

లోకల్‌గా పత్తిబోరాలు, గింజలు రవాణా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. డీజిల్‌ పెరగడంతో ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం సీజన్‌ ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఇటువంటి పన్నులు కట్టాలని చెబితే లారీలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదు.

- ఎ.వెంకట్రావు, లారీడ్రైవరు, గుంటూరు  

Updated Date - 2021-11-26T05:34:10+05:30 IST