పచ్చదనం కేరాఫ్‌ సత్తుపల్లి

ABN , First Publish Date - 2021-07-22T04:22:16+05:30 IST

పురపాలక సంఘం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ చెప్పారు.

పచ్చదనం కేరాఫ్‌ సత్తుపల్లి
జ్యోతినిలయం వద్ద హరితహారంలో భాగంగా పాలకవర్గంతో ఎమ్మెల్యే

 పలు పార్కుల ఏర్పాటుతో ఆహ్లాదం

 ముక్కోటి వృక్షార్చనకు ప్రకృతివనం సిద్ధం

 అప్పుడు లవ్‌ సత్తుపల్లి.. ఇప్పుడు గ్రీన్‌ సత్తుపల్లి

సత్తుపల్లిరూరల్‌, జూలై 21: పురపాలక సంఘం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. తామర, వేశ్యకాంతల చెరువుల వద్ద విద్దుదీపాలు, పార్క్‌లు, బోటింగ్‌, పిల్లలు ఆటకేంద్రాలతో ఆహ్లాదం పంచేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.


ఆహ్వానం పలుకుతున్న పచ్చదనం


సత్తుపల్లి పురపాలక సంఘంలో అడుగుపెట్టిన వెంటనే పచ్చదనం ఆహ్వానిస్తుంది. తూర్పున తాళ్లమడ గ్రామం తర్వాత సత్తుపల్లి అనే ఆంగ్లపదాలతో పట్టణంలోకి అడుగు పెట్టిన వెంటనే తమ్మిలేరు బ్రిడ్జీకి ఇరువైపులా మొక్కలు నాటి ప్లాస్టిక్‌ ఫెన్సింగ్‌ను రక్షణగా ఏర్పాటుచేశారు. జేవీఆర్‌ పార్క్‌ను ఆధునీకరిస్తు సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తూ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారికి మరికొద్దిరోజుల్లోనే అందించనుంది. హైలెవల్‌ బ్రిడ్జీ నుంచి 4కిలోమీటర్ల మేర విస్తరించిన డివైడర్‌పై అందమైన పూలమొక్కలు దర్శనమిస్తాయి. పట్టణ శివారులోని వెంగళరావుకాలనీ వద్ద లవ్‌ సత్తుపల్లి అనే అద్భుతమైన పార్క్‌ను కొద్దిస్థలంలోనే ఔరా అనిపించేలా సెల్ఫీ ప్రియుల కోసం విద్దుద్దీపాలతో వెలుగులతో ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటుచేశారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ అర్బన్‌ పార్క్‌ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.


ముక్కోటి వృక్షార్చనకు ప్రకృతివనం సిద్ధం


ఈనెల 24న మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. తహసీల్థార్‌, మునిసిపల్‌ కార్యాలయాల వద్ద పట్టణ ప్రగతిలో భాగంగా ప్రకృతివనాలు ఏర్పాటుచేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ కూసంపూడి మహేష్‌ తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పిల్లలకు ఆటస్థలం ప్రత్యేకంగా చేపట్టగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వాకింగ్‌ ట్రాక్‌తో పాటు మొక్కలను నాటి ఆహ్లాదం పంచనున్నట్లు తెలిపారు. మునిసిపల్‌ భవనం వద్ద 2ఎకరాల స్థలంలో 1500మొక్క నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.


ఖాళీస్థలాలు, కార్యాలయాల్లో: సుజాత, మునిసిపల్‌ కమిషనర్‌


పట్టణంలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. పచ్చదనం పంచడమే ధ్యేయంగా పురపాలక సంఘం పనిచేస్తుంది. డివైడర్‌పై స్తంభాలకు స్పింకర్ల బిగించాం. కార్యాలయం నుంచి సెంట్రల్‌ అడ్రెసింగ్‌ సిస్టం ద్వారా ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నాం. పట్టణ అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి.


Updated Date - 2021-07-22T04:22:16+05:30 IST