వకుళమాతకు వందనం

ABN , First Publish Date - 2022-06-19T07:06:10+05:30 IST

ఒకప్పుడు 50 ఎకరాల విశాలమైన బండ ఇది. క్వారీల్లో సగానికి పైగా కరిగిపోయింది. 100 అడుగుల ఎత్తున్న ఈ గుట్టమీదకు చేరుకోవడానికి ప్రస్తుతం రెండు దారులు ఏర్పాటు చేశారు. 150 మెట్లతో పూర్తిగా మెట్లదారి ఒకటి, సగం దాకా వాహనాల్లో వెళ్లి 35 మెట్లు ఎక్కే మార్గం ఇంకొకటి ఉన్నాయి. పేరూరు బండకు చేరుకోవడానికి విశాలమైన రోడ్డు వేశారు. కాంక్రీటు స్వాగత తోరణం నిర్మించారు.

వకుళమాతకు వందనం
పాత ఆలయం

అరుదైన ఏకశిలాగుట్ట మీద కిరీటంలా మెరిసే ఆలయం. ఆలయాన్ని తాకుతూ నీలాకాశంలో తేలాడే మబ్బులు. గుట్ట చుట్టూ పరచుకున్న పచ్చదనం.. బెంగుళూరు-తిరుపతి జాతీయ రహదారి నుంచి కనిపించే దృశ్యం ఇది. ఇరవై యేళ్ల సుదీర్ఘ పోరాటాలు, ప్రయత్నాల ఫలితంగా నిర్మాణం పూర్తి చేసుకుంది పేరూరు బండమీది వకుళమాత ఆలయం. .అభ్యంతరాలు..అనుమానాలు.. విమర్శలు..కోర్టు కేసులు..అన్నింటినీ దాటి నిత్య పూజా కైంకర్యాలను అందుకోబోతోంది తిరుమల శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. క్వారీల దాడుల్లో కరిగిపోతున్న కొండ మీద శిథిలమైపోయిన ఆలయం స్థానంలో కొత్త నిర్మాణం పూర్తయింది. 23న ముఖ్యమంత్రి సమక్షంలో మూల విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా పేరూరు బండమీది ప్రాచీన ఆలయం విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.


ప్రత్యేక కథనం - తిరుపతి(కల్చరల్‌) 


తొండమండలంలోనే  ప్రసిద్ధి


తొలినాళ్లలో తిరుపతికి ఇంత పేరూ, ప్రాధాన్యమూ లేవు. అప్పట్లో తిరుచానూరు, చంద్రగిరి బాగా ప్రసిద్దిపొందిన ప్రాంతాలు. బ్రిటీషు పాలన తర్వాతే తిరుపతికి ప్రాముఖ్యత ఏర్పడింది. తిరుపతికి సమీపంలోని పేరూరు ప్రాంతం.. పెరుంబాణపాడికి చెందిన తిరువేంగడకొట్టములో భాగమైన కుడువూరునాడులో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇది ఆనాటి జయంకొండ చోళమండలంలో అంతర్భాగం. దీనికి కడవూర్‌నాడు, తిరుక్కడవూర్‌నాడు అనే పేర్లుకూడా ఉండేవి. ఇది తొండమండలం పరిధిలోనిది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు(ఉమ్మడిజిల్లా), తమిళనాడులోని వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్నామలై, విల్లుపురం, కల్లకురిచ్చి. తిరువల్లూరు, కంచి, చెంగల్పట్టు, కడలూరు, చెన్నై ప్రాంతాలను కలిపి తొండమండలమని పిలిచేవారు.  ఈ ప్రాంతాన్ని నవాబులు, విజయనగర రాజులు, చోళులు, పల్లవులు, ఇలా రేనాటిచోళులు మొదలుకొని వైదుంబులు, బాణులు, నొలంబులు, పశ్చిమగాంగులు, రాష్ట్రకూటులు   దాకా భిన్న కాలాల్లో పరిపాలించారు. ఈ ప్రాంతంలో లభించిన మొదటి శాసనం రేనాటి చోళులకాలం నాటిది. వీరు క్రీ.శ. 6-7 శతాబ్ధాలలో పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది.


వర్తమాన వివాదాలు


 2000 సంవత్సరం తరువాత ఈ ఆలయం గురించిన ఆందోళన మొదలంది.  ఇది వకుళమాత ఆలయం అంటూ హిందూ సంఘాలు కొన్ని ఉద్యమం మొదలు పెట్టాయి. పేరూరు బండను పరిరక్షించాలనే వారికి మాఫియా అడ్డుతగిలింది. కోర్టుకు వెళ్లారు. స్టే తెచ్చుకున్నారు. పరిపూర్ణానంద స్వామి ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌ రెడ్డి ముందు నిలబడ్డారు. ఇలా చరిత్రకారులు, స్వామివారి భక్తులు ఉద్యమించిన నేపధ్యంలో  అప్పట్లో టిటిడి పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న భూమన కరుణాకర రెడ్డి ఆలయ పరిరక్షణకు సానుకూలంగా స్పందించారు అనేక ప్రజాపోరాటాల తరువాత 2009 లో టిటిడి వకుళమాత ఆలయం కోసం రూ. 2 కోట్లు కేటాయించి, రూ 15 లక్షలతో కంచె నిర్మించే ప్రయత్నం చేసింది.  2012లో ఉన్నత న్యాయస్థానం స్టేలను తొలగించడంతో అప్పటి టిటిడి పాలక మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు ఆలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 5మార్చి 2017న ఉదయం 7.40 గంటలకు ఆలయం పునరుద్దరణకు భూమిపూజ జరిగింది.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చడంతో పనులు వేగంగా కదిలాయి. తరచూ పేరూరు బండను ఆయన సందర్శిస్తూ పనులు పర్యవేక్షించారు. సుదీర్ఘమైన ప్రయత్నాల తర్వాత పేరూరు బండమీద వకుళమాత ఆలయం తిరిగి సిద్ధమైంది.  మహాసంప్రోక్షణతో ఈ నెల 23 నుంచీ శ్రీనివాసుని మాతృమూర్తికి తిరిగి దీపధూప నైవేద్యయోగం పట్టనుంది. 


మహమ్మదీయ దాడుల్లో ధ్వంసం


విజయనగర రాజుల పాలన ఆఖరి కాలంలో ఈ ప్రాంతంపై మహ్మదీయుల దాడి పెరిగింది.  క్రీ.శ.1700 నాటికే ఏడాదికి రూ.2లక్షల ఆదాయం గల తిరుమల ఆలయం పై  కన్నుపడింది. క్రీ.శ. 1759లో మరాఠా నాయకుడు గోపాలరావు తిరుపతి పగోడాను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ నేపధ్యంలోనే అప్పటికి పేరుపొందిన పేరూరు బండపైనున్న  ఆలయంకూడా దాడికి గురైంది.  క్రీ.శ. 1860 లో పెల్లీ అనే అప్పటి రెవిన్యూబోర్డు సభ్యుని చేత తిరుపతి, చంద్రగిరి కలిసి  చంద్రగిరి తాలూకా ఏర్పాటైంది. క్రీ.శ. 1869 నాటికి దాడులు ఆగిపోయాయి. ఆ తరువాత బ్రిటీషు పాలకులు ఆదాయం వచ్చే గుడులను గోపురాలను పట్టించుకున్నారు గానీ పాడుపడిన వాటిని పునరుద్దరించలేదు. ఇలా పేరూరు బండపై ఉండే ఆలయం మరుగునపడింది. మైనింగ్‌ మహాశయులు కొండను తవ్వేసి సంపద మూటగట్టుకున్నారు. దాదాపు 50 ఎకరాలున్న కొండను కాస్తా గుడి అంచువరకూ తొలిచేశారు.


ఎందుకు అంత వివాదం అయ్యింది?


తగిన ఆధారాలు లభించకపోవడమే ప్రధాన కారణం. క్రీ.శ.1881లో ప్రచురింపబడిన ఏ మాన్యువల్‌  ఆఫ్‌ ది నార్త్‌ఆర్కాట్‌ డిస్ట్రిక్ట్‌ ఆప్‌ ది ప్రెసిడెన్సీ ఆఫ్‌ మద్రా్‌సలో గాని, ఆ తరువాత కొద్దికాలానికే 1890లో ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రచురించిన సౌత్‌-ఇండియన్‌ ఇన్ర్స్కిప్సన్స్‌ అనే గ్రంథంలోగాని, 1953 లో టిటిడి ప్రచురించిన హిస్టరీ ఆఫ్‌ తిరుపతి (టికెటి వీరరాఘవ చార్య) అనే మూడు సంపుటాల  గ్రంథంలోగాని వకుళాలయం ప్రస్థావన లేదు. శిథిల దిబ్బగా మారిన ఈ గుట్టమీద విగ్రహాలు మాయమయ్యాయి. శాసనాధారాలు చెరిగిపోయాయి. క్రీ.శ. 1198 నాటి శాసనం కూడా ఈ శిథిలాల కింద మరుగున పడిపోయింది. పునర్నిర్మాణంలో కాంక్రీటు కింద ఉండిపోయిన ఈ శాసనం తిరుపతికే చెందిన డాక్టర్‌. కె.మునిరత్నంరెడ్డి పరిశీలనతో వెలుగు చూసింది. పేరూరు బండ ఆలయం ప్రాచీన చరిత్రకు కీలక ఆధారంగా మారింది. వివాదాలన్నింటికీ ఇక స్వస్తి పలికింది. 


40 ఏళ్ల కల...


చరిత్ర అధ్యాపకుడు పి.కృష్ణమూర్తి జ్ఞాపకాలు


పేరూరు ఆలయానికి సంబంధించిన కొన్ని చారిత్రక అంశాలనూ, జ్ఞాపకాలనూ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు, టిటిడికి చెందిన ఎస్‌జీఎస్‌ డిగ్రి కళాశాల విశ్రాంత వైస్‌ ప్రిన్సిపాల్‌, చరిత్రవిభాగం అధ్యాపకుడు పి. కృష్ణమూర్తి. ఆయన మాటల్లోనే...  


‘‘‘పేరూరు బండ అంత బండ, రాయల చెరువు అంత చెరువు, కాళహస్తి గుడి అంత గుడి మరెక్కడా లేవనేది నానుడి. నానుడులు ప్రజల్లో ఊరికే పుట్టవు. పేరూరు ఆలయంలో వకుళమాతకు నైవేద్యం పెట్టిన తురువాతే తిరుమలలో శ్రీవారి ఆలయంలో నైవేద్యం పెట్టేవారని చెప్పేవారు. దీనిని నిర్ధారిస్తూ పేరూరు, చంద్రగిరి, తిరుమలలో గంటా మండపాలు ఉన్నాయి.  వకుళమాత ఆలయానికి అనుబందంగా ఉన్న కోనేరుని నారద సరస్సు అని పిలిచేవాళ్లు.  అప్పట్లో అమ్మవారికి బంగారు తొడుగు కూడా ఉండేదని, మహ్మదీయుల దాడులలో దోచుకోబడిందంటారు.  ఆలయం సమీపంలోనే కొంతకాలం క్రితం వరకు రెండుగా విరిగిపోయిన వకుళమాత విగ్రహం కూడా ఉండేది.  పేరూరు బండను మైనింగ్‌ కోసం పగలకొట్టే క్రమంలో దానినీ  మాయం చేశారు. ఒకప్పుడు యోగి మల్లవరం, పేరూరు లోని వకుళమాత ఆలయాలే పెద్ద సంఖ్యలో భక్తులకు ఆకర్షించేవి. వారికి భోజనాదులకు చక్కటి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఐతిహ్యం ప్రకారం వకుళాదేవిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోదగా హిందులు భావిస్తారు. ఆనాడు యశోదకు ఇచ్చిన మాటమేరకే వకుళ ఆధ్వర్యంలో  పద్మావతీ శ్రీనివాసుల వివాహం జరిగింది. శ్రీనివాసుని తల్లికి ఇప్పటికైనా, తగిన గుర్తింపు, ఆదరణ రావడం సంతోషంగా ఉంది.  ఆలాగే పెళ్లిదుస్తుల్లోనే వెళ్లి శ్రీనివాసుడు, పద్మావతిదేవిలను దర్శించుకున్న అవనాక్షమ్మ (అవనజాక్షి) ఆలయం నారాయణవనంలో ఉంది. ఈ ఆలయం కూడా పూర్వవైభం సంతరించుకుంటే బావుండును. వకుళమాత ఆలయ దుస్థితికి దుఃఖిస్తూ 40 ఏళ్ల కిందటే నేను ‘ఏదితల్లీ నాటి నీ ఆలయం’ అనే శీర్షికతో  వ్యాసం రాశాను. నా కల ఇప్పటికి ఫలించింది. వయసు పైబడింది. ఆరోగ్యం సహకరించడం లేదు. కదల్లేను. కానీ వకుళమాత ఆలయం వైభవాన్ని స్వయంగా వెళ్లి చూడాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. ’’

Updated Date - 2022-06-19T07:06:10+05:30 IST