ట్రంప్‌పై పగతీర్చుకున్న గ్రెటా.. గ్రేట్ అంటున్న నెటిజన్లు !

ABN , First Publish Date - 2020-11-06T20:28:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన 'స్టాప్ ది కౌంట్' ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ట్రంప్ ఓటమి భయంతోనే ఇలా కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతున్నారని ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ట్రంప్‌పై పగతీర్చుకున్న గ్రెటా.. గ్రేట్ అంటున్న నెటిజన్లు !

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన 'స్టాప్ ది కౌంట్' ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ట్రంప్ ఓటమి భయంతోనే ఇలా కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతున్నారని ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయమై స్వీడన్‌కు చెందిన పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్(17) కూడా ట్రంప్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. 'చిల్ డొనాల్డ్, చిల్' అంటూ సెటైర్ వేశారు. "చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ గ్రెటా గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. 1.3 మిలియన్ల లైక్స్, లక్షలాది మంది రిట్వీట్ చేశారు.


అయితే, ట్రంప్‌పై గ్రెటా ఇలా పగ తీర్చుకోవడానికి ఓ కారణం ఉంది. 2019 ఏడాదికి గాను గ్రెటాను టైమ్ మ్యాగ్జైన్ డిసెంబర్‌లో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా తన కవర్ పేజీపై వేసింది. ఈ సందర్భంగా ట్రంప్ ఆమెను ఇలాంటి ట్వీట్‌తోనే అవమానించినంత పని చేశారు. "చాలా హాస్యాస్పదం. గ్రెటా యాంగర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్ గ్రెటా, చిల్!" అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. 


ఇప్పుడు దాదాపు ఓటమి అంచున ఉన్న ట్రంప్.. ఈ 'స్టాప్ ది కౌంట్'  ట్వీట్ చేశారు. దీంతో గ్రెటాకు 11 నెలల తర్వాత ఆయనపై పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఇంకేముంది తనపై ట్రంప్ విసిరిన విమర్శలనే తిరిగి ఆయనపై తిప్పికొట్టారు గ్రెటా. దీంతో నెటిజన్లు ఆమెను సమయం చూసి దెబ్బ కొట్టారు అంటూ మెచ్చుకుంటున్నారు. తన టెంపరీతనంతో ప్రతి ఒక్కరిపై విమర్శలు గుప్పించే ట్రంప్‌కు ఇదే సరియైన సమాధానం అంటూ గ్రెటా ట్వీట్‌ను లక్షలాదిగా రిట్వీట్ చేస్తున్నారు. 


ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ దాదాపు అధ్యక్ష పీఠానికి దగ్గరయ్యారు. ఆయన ఇంకో ఆరు ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే చాలు... వైట్‌హౌస్ బాస్ కావచ్చు. మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి అధికారం దక్కడం అనుమానంగా మారింది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఆయన క్లీన్‌స్వీప్ చేస్తే తప్ప మరో మార్గం లేదు. కానీ, ఇది దాదాపు అసాధ్యం. దీంతో ఈసారి ట్రంప్‌కు ఓటమి తప్పకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక మొదటి నుంచి మెయిల్ ఇన్ బ్యాలెట్లపై ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. ఈ విషయమై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. బ్యాలెట్ ఓట్లు బైడెన్‌కు అధికంగా వస్తున్నాయి. బ్యాలెట్ ఓట్లలో సుమారు 60 నుంచి 90 శాతం ఓట్లు బైడెన్‌కే పడ్డాయని అక్కడి మీడియా తెలిపింది. దీంతో స్వింగ్ స్టేట్స్‌లో బైడెన్ పుంజుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవేడాలో ఆధిక్యంలో కొనసాగుతున్న బైడెన్ అక్కడ గెలిస్తే అగ్రరాజ్యాధిపతి అవుతారు.  

Updated Date - 2020-11-06T20:28:50+05:30 IST