రాజకీయంలో ముక్కుతున్న ధాన్యం

ABN , First Publish Date - 2022-07-06T09:41:04+05:30 IST

కేంద్ర, రాష్ట్ర రాజకీయాల మధ్య వరి ధాన్యం ముక్కిపోతున్నది. మిల్లుల్లో ఎండకు ఎండి, వానకు తడిసి మగ్గిపోతున్నది.

రాజకీయంలో ముక్కుతున్న ధాన్యం

  • నెల రోజులుగా సేకరణ నిలిపివేసిన కేంద్రప్రభుత్వం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ అగాథం
  • విమర్శ, ప్రతి విమర్శలతో పెరుగుతున్న అంతరం
  • రాష్ట్రానికి వందల కోట్ల నష్టం.. స్పందించని సీఎం కేసీఆర్‌
  • అధికారుల భుజాలపైనే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత
  • రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకున్న ‘గరీబ్‌’ బియ్యం
  • కేంద్రానికి సమాచారం ఇవ్వకుండానే పంపిణీకి బ్రేక్‌ 
  • ఎఫ్‌సీఐ నుంచి లిఫ్ట్‌ చేసి పంచకపోవటంతోనే సీరియస్‌
  • నష్ట నివారణ చర్యలు చేపట్టినా ప్రయోజనం శూన్యం
  • ముఖ్యమంత్రి జోక్యంచేసుకుంటేనే కొలిక్కివచ్చే చాన్స్‌
  • రాష్ట్రంలో నెల రోజులుగా మూతపడిన రైస్‌ మిల్లులు

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర రాజకీయాల మధ్య వరి ధాన్యం ముక్కిపోతున్నది. మిల్లుల్లో ఎండకు ఎండి, వానకు తడిసి మగ్గిపోతున్నది. మేం ఇచ్చిన బియ్యం పంపిణీ చేయలేదని కేంద్రం బియ్యం సేకరణ నిలిపివేయగా.. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే మాపై అదనంగా ఆర్థిక భారం పడుతున్నదని రాష్ట్రప్రభుత్వం వాదిస్తున్నది. ఇద్దరి మధ్య మిల్లులు నలిగిపోతున్నాయి. నెల రోజులుగా బియ్యం సేకరణ నిలిపివేయడంతో మూతపడ్డాయి. ప్రస్తుతం మిల్లుల్లో  రూ.22 వేల కోట్ల విలువైన 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది. ధాన్యం సేకరణకు బ్యాంకుల్లో తీసుకున్న వేల కోట్ల అప్పులకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నెలకు రూ.170 కోట్ల చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఖజానాపై వందల కోట్ల భారం పడుతున్నది. ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు’ రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినా, జూన్‌ నెలలో అదనపు కోటా పంపిణీ చేసినా కేంద్రప్రభుత్వం కనికరించటం లేదు. 


రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరం పెరగటంతో పరిస్థితి మరింత జఠిలమైంది. మునుపెన్నడూ లేనివిధంగా నెల రోజులుగా కేంద్రప్రభుత్వం బియ్యం సేకరణ నిలిపివేయటంతో రాష్ట్రంలో పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్రం పంపిణీ చేసిన ఉచిత బియ్యాన్ని పేదలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితం ఇప్పుడు దాని మెడకే చుట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వ చర్యను తీవ్రంగా పరిగణించిన కేంద్రం రాష్ట్రంలో బియ్యం సేకరణను నిలిపివేసింది. కొవిడ్‌ సమయంలో పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం కోసం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. జాతీయ ఆహార భద్రత కార్డులు కలిగిన పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేసింది. 2022లో కూడా జనవరి నుంచి పథకాన్ని అమలుచేస్తోంది. సెప్టెంబరు వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేయకుండా అప్పుడప్పుడూ బియ్యానికి కోత పెడుతూ వస్తోంది. మే నెలలో మొత్తానికే ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వ కోటా కింద 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదు. జూన్‌లో కూడా అదే తరహాలో పంపిణీ చేస్తుండగా కేంద్రం రంగంలోకి దిగింది. తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపివేసింది.

  

కొంపముంచిన రాజకీయ విమర్శలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరుచుగా చేస్తున్న తీవ్ర విమర్శలే ఇరు ప్రభుత్వాల మధ్య అగాథాన్ని సృష్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిజర్వు బ్యాంకు నుంచి అప్పు పుట్టకుండా చేయటానికి, బియ్యం సేకరణ నిలిపివేసి బిల్లులు మంజూరుచేయకుండా ఉండటానికి కూడా రాజకీయ విమర్శలే కారణంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు ప్రధానమంత్రి వచ్చినా, ఢిల్లీకి సీఎం వెళ్లినా ఒకరినొకరు కలుసుకొనే పరిస్థితి లేదు. ఈ ప్రభావం నేరుగా రాష్ట్ర ఆర్థిక మూలాలపై పడుతోంది. గతంలో రాష్ట్ర సమస్యలు ఏవైనా ఉంటే ఢిల్లీకి వెళ్లి ప్రధానికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇచ్చే వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేసినా ఇంతవరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదు. 


ఆర్థికంగా భారమనే

గరీబ్‌ కల్యాణ్‌ కింద ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రం జారీచేసిన ఆహార భద్రతకార్డులు 53.88 లక్షలు. వీటి కింద 1.92 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిస్తోంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 36.50 లక్షల ఆహార భద్రత కార్డులు జారీ చేసింది. వీటిపై 94.75 లక్షల మంది లబ్ధిదారులున్నారు. తెలంగాణలో రూపాయికి కిలో చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోలు పంపిణీచేసే పథకం అమలులో ఉంది. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డుదారులకు కూడా తప్పనిసరిగా ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తోంది. అందుకే ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్రప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తున్నది.  


ఎందుకు లిఫ్ట్‌ చేశారు

ఉచిత బియ్యం పంపిణీ చేయటం రాష్ట్రప్రభుత్వానికి ఇష్టం లేకపోతే సెంట్రల్‌ పూల్‌ కోటా 1.90 లక్షల మెట్రిక్‌ టన్నులను ఎఫ్‌సీఐ నుంచి ఎందుకు లిఫ్ట్‌ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా పంపిణీ చేయకపోవడంపై కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు. వీటికి తోడుగా రైస్‌మిల్లర్ల అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతున్నదన్న ఆరోపణలున్నాయి.ఎఫ్‌సీఐ బృందాలు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి మాయమైన ధాన్యం లెక్కలు చెప్పినా, మిల్లర్లపై చర్యలకు సిఫారసులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ చర్యలే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి, బియ్యం సేకరణ నిలిపివేతకు కారణాలుగా మారాయి.


రాష్ట్రం దిద్దుబాటు చర్యలు

కేంద్రం బియ్యం సేకరణ నిలిపివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. మొదట రాష్ట్రప్రభుత్వ పథకం ప్రకారం జూన్‌లో 6 కిలోలు పంపిణీ చేసినప్పటికీ మళ్లీ చివరి వారంలో ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున పంపిణీ చేసింది. మే నెల కోటాను వచ్చే అక్టోబరులో పంపిణీ చేస్తామని కేంద్రానికి లేఖ రాసింది. ఈ నెలలో 10 కిలోలు ఉచితంగానే పంపిణీ చేస్తోంది. అయినప్పటికీ కేంద్రం దిగిరాలేదు. దీంతో మే నెల కోటాను ఆగస్టులోనే పంపిణీ చేస్తామని మరో సర్క్యులర్‌ జారీ చేసింది. అయినప్పటికీ కేంద్రం నుంచి బియ్యం సేకరణకు అనుమతిరాలేదు. సీఎ్‌సతోపాటు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు ఢిల్లీలో  లాబీయింగ్‌ చేస్తున్నారు. ఎఫ్‌సీఐ అనుమతి ఇస్తుందని ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమూ సమస్యను అధికారులకే వదిలేసి మిన్నకుండిపోయింది. బియ్యం సేకరణ నేడో, రేపో పునఃప్రారంభం అవుతుందన్నఆశతో ధాన్యాన్ని టెండర్లు పెట్టాలనే ఆలోచనను వాయిదా వేసినట్టు, కోర్టులో కేసు వేయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది.


ఆలస్యమైనకొద్దీ నష్టం

ఒకవైపు రైస్‌మిల్లుల ఆవరణలో వడ్లు వానకు తడిసి మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైస్‌మిల్లర్లేమో ‘మిల్లింగ్‌కు అనుమతులైనా తీసుకురండి. లేకపోతే టెండర్లు పెట్టి ధాన్యాన్ని విక్రయించండి. రెండూ సాధ్యం కాకపోతే ధాన్యం తీసుకొని రైస్‌మిల్లు ప్లాట్‌ఫారాలు ఖాళీ చేయండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌ చొరవ తీసుకుంటేనే సమస్య కొలిక్కివస్తుందని మిల్లర్లు, అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-06T09:41:04+05:30 IST