ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డుపై పేరుకు పోయిన చెత్త (ఫైల్)
స్థానికంగా ఉండరు... సమస్యలు పరిష్కరించరు
పట్టణాలకే పరిమితమవుతున్న అధికారులు
వచ్చి పోయేందుకే సమయం వృథా
తేలికగానే తీసుకుంటున్న జిల్లా ఉన్నతాధికారులు
ఆదిలాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): పాలన సౌలభ్యం కోసం రా ష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులను కల్పించకపోవడంతో మారుమూల మండలాల్లో విధులు నిర్వర్తించేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించక పోవడంతో ఇన్చార్జిల పాలనలో పనులు ముందుకు సాగడం లేదంటున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిలో కీలకమైన రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందంటున్నారు.
జిల్లాలోని 18 మండలాల పరిధిలో..
జిల్లాలో 18 మండలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. అయినా అరకొరగానే అధికారులు పనిచేస్తున్నారు. ఒక్కో అధికారికి రెండు, మూడు మండలాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగిపోతుందని పేర్కొంటున్నారు. జిల్లా విభజనతో పరిధి తగ్గినా కొందరు అధికారులు పిల్లల చదువులు, వసతి సౌకర్యాలు, వివిధ కారణాలతో స్థానికంగా ఉండలేకపోతున్నారు. దాదాపుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలందరూ మండలస్థాయిలో ఉండక పోవడంతో పంచాయతీ కార్యదర్శులు కూడా పత్తాలేకుండానే పోతున్నారు. గతం లో పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండడం లేదంటూ జడ్పీ సమావేశంలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు సమస్యను లేవనెత్తడంతో.. జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులందరూ స్థానికంగానే ఉండాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కావడం లేదు. దీంతో కొత్తగా ఏర్పడిన గాదిగూడ, మావల, సిరికొండ, భీంపూర్, ఆది లాబాద్ గ్రామీణ మండలాల్లో పరిస్థితి అధ్వానంగా మారి పాలన గా డి తప్పుతుందన్న వాదనలున్నాయి.
అధికారులు ఎప్పుడొస్తాడో?
మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా స్థానికంగానే ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ స్థానికంగా ఉంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పోయేప్రజలు అధికారుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఏదైనా పనినిమిత్తం కార్యాలయాలనికి వస్తే సారు ఎప్పుడోస్తాడోనని ఇతరులను అడిగి తెలుసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏదైనా అత్యవసరమైతే అధికారులను ఫోన్లో సంప్రదించినా అందుబాటులోకి రావడం లేదని చెబుతున్నారు. పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడమే లేదు. వీడియో కాన్ఫరెన్స్ పేరిట జిల్లాకేంద్రానికి వెళ్తూ తిరిగి మండల కేంద్రానికి రావడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బందిపై నిఘా కొరవడి మండలస్థాయి పాలన గాడితప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే జిల్లా ఉన్నతాధికారులు వస్తున్నారన్న సమాచారంతోనే వి ధులకు హాజరవుతూ హ డావిడి చేస్తున్న ఆ తర్వాత పత్తా లేకుండానే పోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే శాఖాపరమైన పనుల నిమిత్తమే జి ల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని సమాధానమిస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం..
జిల్లాకేంద్రంలో పనిచేసే ఉద్యో గులు మాత్రమే స్థానికంగా ఉంటున్న ఇతర మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారి స్థానికంగా ఉం డడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూర్ ప్రాంతాల్లో నివాసం ఉం టున్న అధికారులు చుట్టు పక్కల మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోనూ నివాసం ఉంటున్న వారం తా నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, సిరికొండ, బజార్హత్నూర్ తదితర మండలాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సగం సమయం వచ్చిపోయేందుకే స రిపోతుంది. సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. స్థానికంగా ఉండకపోయినా బిల్లులను చూ పుతూ జేబులో వేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.