పాతాళంలోకి భూగర్భ జలాలు

ABN , First Publish Date - 2022-05-12T06:55:35+05:30 IST

జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

పాతాళంలోకి భూగర్భ జలాలు
భూగర్భ జలాల వినియోగంపై అవగాహన ఇన్‌సెట్‌లో గ్రౌండ్‌వాటర్‌ను పరిశీలిస్తున్న అధికారి

జిల్లాలో పాతాళంలోకి భూగర్భ జలాలు

గతంలో కంటే మూడు అడుగుల లోతుల్లోకి నీరు 

బోరు బావులను పొదుపుగా వినియోగించాలంటున్న అధికారులు 

మరో పది రోజుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గే అవకాశం 

నిర్మల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, ఎండవేడితీవ్రత కారణంగా భూగర్భజల మట్టం పడిపోతోంది. ఇష్టారాజ్యంగా బోరుబావుల తవ్వకాలు అలాగే ఉచితవిద్యుత్‌ కారణంగా నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో భూగర్భజలాలశాతం తగ్గుముఖం పడుతోంది. ఈసారి గతాని కన్నా 36 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ భూ గర్భజలాలు అడుగంటిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ బోరుబావుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆరుతడి పంటలకు చివ రిదశలో సాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నకారణంగా బోరుబావులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో భూ గర్భజలాలు క్రమంగా అడుగంటిపోతోంది. జిల్లాలోని వ్యూజోమీటర్‌ ఆధారంగా జిల్లావ్యాప్తంగా బోరు బావులను లెక్కిస్తుంటారు. ప్రస్తుతం బావుల్లో 30 అడుగుల లోతు లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ గతాని కన్నా దాదాపు మూడు అడుగుల మేరకు నీటిశాతం తగ్గిపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో 11.52 శాతం భూగర్భజలం అందుబాటులో ఉండగా ఈ సారి 9.35 శాతానికి నీటిమట్టం పడిపోయింది. సుమారు మూడు అడుగుల మేరకు నీటిమట్టం తగ్గిపోవడం వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోందంటున్నారు. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కారణంగా అలాగే పోటాపోటీగా భూగర్బ నీటివినియోగం కొనసాగుతున్న కారణంగా నీరంతా అడు గంటిపోయే పరిస్థితికి చేరుకుందంటున్నారు. ప్రస్తుతం ఆరుతడి పంటలకు నీరు అవసరం ఏర్పడుతుండడంతో ఈ నెలాఖరు వరకు నీటివినియోగం తప్పదంటున్నారు. ఇదిలాఉండగా అధికారులు మాత్రం అనుమతులు లేకుండా బోరు బావుల తవ్వకాలు జరపవద్దని, అలాగే పంట చేనుల్లో, ఇతర చోట్ల గల బోరుబావులను తక్కువగా వినియోగించాలని సూచిస్తున్నారు. 

36 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు

గత సంవత్సరం కన్నా 36 శాతం ఈ ఏడు అధిక వర్షపాతం నమోదయ్యింది. ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా భూగర్భజలం ఒక్కసారిగా పైకి చేరుకుంది. వర్షకాలంతో పాటు ఆడపాదడపా కూడా వర్షాలు కురవడం కూడా నీటిమట్టం పెరిగేందుకు తోడయ్యింది. కుంటల నిర్మాణాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలతో పాటు చెరువుల్లో నీటివినియోగం తగ్గిన కారణంగా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదమైందంటున్నారు. గత సంవత్సరం భారీగానే వర్షాలు కురిసినప్పటికీ ఈ సారి పడినంతగా ప్ర భావం చూపలేదు. జిల్లాలోని అన్ని చెరువులు, ప్రాజెక్ట్‌లు నిండిపోయా యి. ముఖ్యంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన గేట్లను చాలా సార్లు పైకేత్తి వరద నీటిని దిగువన గల గోదావరిలోకి వదిలేశారు. ఇలా లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి పాలైంది. అయితే నీటి నిలకడ , ప్రవాహం కారణంగా భూగర్భ జలాల శాతం పెరిగిందంటున్నారు. అయితే అదే వేగంతో పెరిగిన భూగర్భ జలాల శాతం ఏప్రిల్‌, మే నెలల్లో ఒక్కసారిగా వేగంగా అడుగంటిపోయింది. 

పాతాళంలోకి భూగర్భ జలాలు

గత సంవత్సరం కన్నా ఈ సారి దాదాపు మూడు అడుగుల కిందికి భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరం ఇదే సమయంలో 11.52 శాతం భూగర్భజలాలు ఉండగా ప్రస్తుతం 9.35 శాతానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా భూగర్భజలశాఖ అధికారులు గత కొద్ది రోజుల నుంచి వ్యూజోమీటర్‌ల నివేదికల ఆఽధారంగా భూగర్భ జలా ల శాతాన్ని నిర్ధారించారు. మరో నెల రోజులకు పైగా వేసవి తీవ్రత కొనసాగే అవకాశాలు ఉండడం, ఆ తరువాత వరుసగా వర్షాలు కురుస్తా యో లేదోననే విషయమై స్పష్టత లేకపోవడంతో భూగర్భ జలాలు మరింత తగ్గితే నీటిలభ్యత ఇబ్బంది కలిగించవచ్చంటున్నారు. ఇందులో భాగంగానే సంబంధిత భూగర్భ జలశాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులతో, రెవెన్యూ అధికారులతో సమీక్షలు జరిపి ఆరుతడి పంటలకు నీటిని తక్కువగా వినియోగించుకోవాలని ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం ఆరుతడి పంటలకు బోరుబావుల ద్వారా నీటిని విఫరీతంగా వినియోగిస్తున్నారు. రైతులు పంటలను కాపాడుకునేందుకు ఈ నీటిని వినియోగించుకున్నప్పటికీ రాబోయే రోజులపై దృష్టి సారించడం లేదంటున్నారు. 

అఽధిక వినియోగానికి ఉచిత విద్యుత్‌ ఊతం

ఇదిలా ఉండగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న కారణంగా రైతులు పంటలకు నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారన్న విమర్శలున్నాయి. పోటాపోటీగా నీటివినియోగం కారణంగా భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటిపోతున్నాయంటున్నారు. నీటి వినియోగంలో పొదుపు సూత్రాలను పాటించకపోతుండడం కూడా సమస్యకు కారణమైందని చెబుతున్నారు. మొదట్లో గ్రౌండ్‌వాటర్‌ ఆశజనకంగానే ఉన్నప్పటికి నీటితీవ్రత ఆ ఆశలను వమ్ము చేస్తోంది. రైతులకు ఆరుతడి పంటల సాగు ప్రాధాన్యతతో పాటు భూగర్భజలాల నీటి వినియోగంపై కూడా మొదటి నుంచి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉందంటున్నారు. ఇలా భూగర్భ జల శాఖ కూడా మొదటి నుంచే దీనిపై ప్రచారం చేస్తే కొంత మేరకైనా ప్రయోజనం చేకూరవచ్చని అభిప్రాయ పడుతున్నారు. గ్రామీణ ప్రాంతా లు, పట్టణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా తాగునీటి కోసం సాధారణ బోరు బావులను ఇష్టారాజ్యంగా తవ్వుతుండడంతో భూగర్భజలాలు వేగంగా అడుగంటిపోయేందుకు కారణమవుతున్నాయంటున్నారు. ప్రభు త్వం బోరు బావుల తవ్వకాలను అరికట్టేందుకే కాకుండా భూగర్భ జలా ల పెంపు కోసం అమలు చేస్తున్న వాల్టా చట్టం కూడా ఎక్కడ అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. సంబందిత అఽధికారులు వాల్టా చట్టం పై అవగాహన కల్పించకపోవడం, ఆ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతుండడంతో బోరుబావుల తవ్వకాలకు అడ్డు ఆదుపు లేకుండాపోయిందంటున్నారు. 

Read more